
భారత్ విద్యార్థులకు జర్మనీ పిలుపు
ఈ ఏడాది అధిక సంఖ్యలో భారత్ విద్యార్థులే ఉంటారని అంచనా
ప్రస్తుతం జర్మనీలో 50 వేల మంది మనోళ్లే
భారతీయ విద్యార్థుల ఆకర్షణే లక్ష్యంగా జర్మనీ పని చేస్తోంది. విద్యార్థుల ప్రవేశాలకు వీలైనంత సౌలభ్యాన్ని కల్పిస్తామంటూ హామీ ఇస్తోంది. విద్యార్థుల సామాజిక మాధ్యమాలతో పనిలేదంటూ, వారి ఖాతాలు తనిఖీ చేయబోమంటూ వెసులుబాటు కల్పిస్తోంది. తమ దేశంలో చదువుకోవాలంటూ ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం ఈ పరిణామం జర్మనీకి వెళ్లి చదువుకోవాలనుకునే యువతకు ఉపశమనాన్ని కలిగించింది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో వీసా అడ్డంకులు పెరుగుతున్నందున సురక్షిత గమ్యస్థానంగా జర్మనీ అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే గత విద్యా సంవత్సరంతో పోలిస్తే గడిచిన రెండు నెలల్లో 35 శాతం మేర ప్రవేశాల దరఖాస్తులు పెరిగినట్టు ప్రకటించింది.
చదువు తర్వాత వెసులుబాటు..
⇒ వాస్తవానికి జర్మనీ అనేక రంగాల్లో నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. భారత్, జర్మనీ మధ్య విద్యా, పరిశోధనల్లో ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి విద్యా కార్యక్రమాలు, పరిశోధనలు నడుస్తున్నాయి. భారత్ నుంచి ప్రతిభావంతులైన మానవ వనరులు, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి జర్మనీ ఆసక్తి కనబరుస్తోంది.
⇒ ప్రస్తుతం 2,300 కంటే ఎక్కువ ఇంగ్లిష్–బోధన కార్యక్రమాలను ఆ దేశం అందిస్తోంది.
⇒ చదువు పూర్తయ్యాక ఉద్యోగ అన్వేషణ కోసం 18 నెలల స్టే–బ్యాక్ పీరియడ్ –ఉపాధి లభించిన తర్వాత నివాస అనుమతి పొడిగింపు విద్యార్థులకు కలిసొచ్చే అంశాలు.
జీవన వ్యయం, ఫీజులు తక్కువే!
గత దశాబ్దంలో భారతీయ విద్యార్థులకు అగ్ర గమ్యస్థానాల్లో జర్మనీ స్థిరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 2025లో జర్మనీలో భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా.
ఇందుకు పలు కారణాలున్నాయి
1. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు ఉండటం
2. తక్కువ ట్యూషన్ ఫీజు
3. ఉన్నత విద్య, పరిశోధన–ఆవిష్కరణలపై ప్రాధాన్యత కల్పించడం
4. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం(స్టెమ్) రంగాలతో పాటు ఆంగ్లంలో అందించే అనేక కార్యక్రమాలు
5. జీవన వ్యయం తక్కువ
6. సమృద్ధిగా స్కాలర్‌షిప్‌లు
7. మేటి ఉద్యోగావకాశాలు
ఏటా విద్యా వీసాలు పెరుగుదల..
జర్మనీలో దాదాపు 425 విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో 305 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా,భారత్ విద్యార్థుల ఉన్నత చదువులకు గమ్యస్థానంగా జర్మనీ నిలుస్తోంది. మరోవైపు వీసాల జారీలోనూ నిబంధనలను జర్మనీ సరళతరం చేస్తోంది. వాటి సంఖ్య ఏటా పెంచుకుంటూ వస్తోంది. జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వీసాల జారీ చూస్తే..
సంవత్సరం వీసాల సంఖ్య
2021 63,000
2024 90,000
8 మందిలో ఒకరు మనోళ్లే
న్యూఢిల్లీలోని జర్మన్ అకడమిక్ ఎక్సే్ఛంజ్ సర్విస్ (డీఏఏడీ) నివేదిక ప్రకారం జర్మనీలోని విశ్వవిద్యాలయాల్లో సుమారు 4.05 లక్షల మంది విదేశీ విద్యార్థులు చేరారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం. ప్రస్తుతం 50 వేల మంది భారతీయ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు భారత్ కు చెందిన విద్యార్థులే ఉన్నారు.