గురువుకా... రాజ గురువుకా పరీక్ష?

Eenadu Yellow Media On Tenth Public Exams in Andhra Pradesh - Sakshi

ఏది నిజం?

మాస్‌ కాపీయింగ్, మాల్‌ ప్రాక్టీస్‌ను సైతం వెనకేసుకొచ్చిన ‘ఈనాడు’  

ఉపాధ్యాయులపై ఒత్తిడి వల్లే అలా చేస్తున్నారంటూ వంకర రాతలు 

టీచర్లపై ఒత్తిడి వల్లే అలా చేస్తున్నారంటూ వంకర రాతలు 

అసలు పరీక్షల్లో అక్రమాలు మొద లెట్టిందే ‘నారాయణ’ సిబ్బంది 

కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం.. 60 మందిపై కేసులు 

కాపీయింగ్‌ పెరిగిపోయిందంటూ గుండెలు బాదుకున్న రామోజీ 

మరోవైపు అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలే నేరమన్నట్టు వక్రభాష్యం 

ప్రభుత్వ టీచర్లు ఒత్తిడివల్లే అలా చేస్తున్నారంటూ వితండవాదన 

బాబు హయాంలో పరీక్షల్లో అక్రమాల్ని పట్టించుకోని తీరు 

‘నారాయణ’ బంధువుకే విద్యా శాఖ.. అక్రమాలెన్ని చేసినా మౌనం 

అసెంబ్లీలో సాక్ష్యాలతో సహా అప్పట్లో ప్రస్తావించిన జగన్‌ 

తప్పు.. తప్పు కాకుండా పోయేదెప్పుడు? నేరం చేసినవారిపై కేసులు పెట్టడమే నేరమయ్యేదెప్పుడు? అక్రమాలను అడ్డుకోవటమే పాపమయ్యేదెప్పుడు? ఈ ప్రశ్నలకు ‘ఈనాడు’ అధిపతి రామోజీరావు మాత్రమే ఠక్కున జవాబివ్వగలరు. అది... ‘చంద్రబాబు అధికారంలో లేనప్పుడు’ అని! ‘గురువులకే పరీక్ష’ అంటూ బుధవారం ‘ఈనాడు’ పతాక శీర్షికతో అచ్చేసిన కథనం ఇలాంటిదే మరి.  

దొంగతనం చేసిన వ్యక్తి తానెలాంటి పరిస్థితుల్లో ఆ దొంగతనం చేశాడో చెబితే కరిగిపోవటానికి ఇదేమైనా సినిమానా రామోజీ? కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే... కష్టపడి చదువుకున్న విద్యార్థులు నష్టపోతారని తెలియదా? విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికేగా పరీక్షలు? లక్షన్నర మంది ఉపాధ్యాయుల్లో ఓ 10 మంది చేసిన తప్పిదం వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు రావటం లేదా? తప్పు జరిగినపుడు దాన్ని తప్పు అని చెప్పకపోతే ఎలా? వారు అలా చేయటం కరెక్టేనన్నట్టు ఆ రాతలేంటి? అధికారంలో ఉన్నది చంద్రబాబు కాకుంటే ఎంత తప్పయినా ఒప్పయిపోతుందా?‘ఈనాడు’ దారుణమైన కథనాల్లో నిజమెంత? ఏది నిజం? 

ఐదేళ్ల కిందట... 2017లో విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. నారాయణ విద్యాసంస్థల అధిపతికి స్వయానా వియ్యంకుడు. నారాయణ కూడా... మరో మంత్రి. అప్పట్లో టెన్త్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ ఓ రేంజిలో జరిగింది. ‘నారాయణ’ సిబ్బంది కొందరు పేపర్లు లీక్‌ చేయటమే కాక... రోజూ తమ బ్రాంచీలకు జవాబులు పంపి మాస్‌ కాపీయింగ్‌కు తెగబడ్డారు. దీన్ని నాటి ప్రతిపక్ష నేత... ప్రస్తుత సీఎం వై.ఎస్‌.జగన్‌ ఆధారాలతో సహా అసెంబ్లీలో పెట్టారు. గంటా,  నారాయణ, చంద్రబాబు పొంతన లేని సమాధానాలు చెప్పారు. వీళ్లందరి భాష్యమూ ఒక్కటే!! పేపర్లు బయటికొచ్చాయి కానీ.. అది లీక్‌ కాదు!. కాపీయింగ్‌ జరిగింది కానీ.. మాస్‌ కాపీయింగ్‌ కాదు. జస్ట్‌ మాల్‌ప్రాక్టీస్‌. బస్‌! ఎవ్వరిపైనా కేసుల్లేవు. అంతా గప్‌చుప్‌!!. అందుకే... ‘ఈనాడు’ దృష్టిలో ఇది స్వర్ణయుగం. ఇప్పుడలా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్‌కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు సంబంధించి ఏకంగా 60 మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. వీరిలో నారాయణ స్కూళ్లకు చెందిన సూత్రధారులూ ఉన్నారు. 38 మంది ప్రభుత్వ అధ్యాపకులు, సిబ్బంది కూడా ఉన్నారు.  

2017లో 10వ తరగతి ప్రశ్నాపత్నాల లీజేజీలు, నారాయణ సిబ్బంది ప్రమేయాన్ని బయటపెట్టిన రుజువులివే..  

ఆలోచనకు సంబంధించిన అవయవాలన్నీ సక్రమంగా పనిచేసే వారెవరైనా ఇలాంటి చర్యల్ని అభినందిస్తారు. రామోజీ రూటే సెపరేటు!! మంచి ఫలితాల కోసం ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది కనకే వారిలా చేస్తున్నారని, అలాంటి అధ్యాపకులపై కేసులు పెట్టడమేంటని ‘ఈనాడు’ ఆక్రందనలు మొదలెట్టింది. రామోజీరావు గారూ!! ఇది ఏ స్థాయి జర్నలిజం? 

ఫలితాలు బాగుండాలనటం ఒత్తిడా? 
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి మార్కులతో పాస్‌ అయ్యేలా చక్కని ప్రమాణాలతో విద్యా బోధన సాగాలని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. దాదాపు లక్షన్నర మంది టీచర్లలో ఓ పిడికెడు మందికి మాత్రం అది ఒత్తిడి చేయటంలా కనిపించింది. వారు మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహించటంతో... వారికి జై కొడుతూ ‘ఈనాడు’ వారి వెనకన చేరిపోయింది. నిజానికి రామోజీ ఉద్దేశం వేరు. నారాయణ లాంటి స్కూళ్లు అక్రమాలకు పాల్పడకపోతే టెన్త్‌లో మంచి ఫలితాలు రావు. దీంతో వాటి పేరు దెబ్బతిని... అడ్మిషన్లు తగ్గి మొదటికే మోసం వస్తుంది. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితి కనక... వాళ్లను వెనకేసుకు రావటం మొదలెట్టారు. బాబు మిత్రులైన కార్పొరేట్‌ స్కూళ్లకోసం మరీ ఇంతలా దిగజారాలా? దానికి ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయుల్ని అడ్డం పెట్టుకోవాలా?  

విద్యావిప్లవం కనిపించటం లేదా?
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దటం మొదలెట్టారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. నాడు–నేడు అంటూ స్కూళ్ల రూపు రేఖలు మార్చారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద వంటి పథకాలతో విద్యను అందరికీ చేరువ చేశారు. ఫలితం... కొన్ని ప్రైవేటు స్కూళ్లు మూతపడ్డాయి. 6 లక్షలమంది ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు సర్కారీ స్కూళ్లకు వచ్చారు. పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీషు మీడియం తెచ్చారు. విద్యార్థులకు మెరుగ్గా బోధించే బాధ్యత టీచర్లదే కనక... దానికి కొలమానంగా ఫలితాలుండాలని నిర్దేశించారు. ఇది తప్పా రామోజీ? అరకొర వసతులు, చాలీచాలనీ జీతాలిచ్చే ప్రైవేటు స్కూళ్లే తమ విద్యార్థులు సరైన మార్కులు తెచ్చుకోకుంటే టీచర్లను బాధ్యులను చేస్తాయి. మరి వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించి... అన్నింటా మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రభుత్వం... పేద విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని ఆశించడం నేరమా? అది ప్రభుత్వ బాధ్యత కాదా? ‘ఈనాడు’కెందుకు ఇంత ఉలుకు? ఇది ఉపాధ్యాయుల్ని ఒత్తిడి చేయటమెలా అవుతుంది? ఎందుకీ వక్రభాష్యాలు? మంచి మార్కులు రావాలంటే మాస్‌ కాపీయింగ్, మాల్‌ ప్రాక్టీస్‌ తప్పనిసరి అన్నట్టుగా ఏంటీ రాతలు?  

నాడు బాబు హయాంలో నిజంగా జరిగినా నోరుమెదపని ఈనాడు... ఇపుడు ఉన్నవీ లేనివీ పోగేసి ‘గురు’వింద రాతలు..  

నారాయణ... నారాయణ 
ఈ సారి టెన్త్‌ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డదెవరో తెలియదా రామోజీ? తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తొలిరోజే నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు అక్రమాలకు టెంకాయ కొట్టేశారు.  తిరుపతి నారాయణ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌.గిరిధర్‌ రెడ్డి చిత్తూరులో ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ప్రలోభపెట్టి వాట్సాప్‌ ద్వారా పేపరు తెప్పించుకున్నాడు. దాన్ని నారాయణ, మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థల అధికారులు, సిబ్బందికి ఫార్వర్డ్‌ చేశాడు. కానీ ఈ కుట్రను పోలీసులు రట్టు చేయటంతో కథ అడ్డం తిగింది. గిరిధర్‌తో పాటు చైతన్య స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఆరీఫ్, డీన్‌ కె.మోహన్, తిరుపతి ఎన్‌ఆర్‌ఐ అకాడెమీ ఉపాధ్యాయుడు కె.సుధాకర్, శ్రీకృష్ణారెడ్డి చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పి.సురేష్, ప్రభుత్వ ఉపాధ్యాయులు పవన్‌కుమార్, బి. సోములను అరెస్టు చేశారు. ఇదే... ఈనాడు ఆగ్రహానికి అసలు కారణం మరి!!. 

టీడీపీ... మరో అడుగు ముందుకు 
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఏ స్థాయికైనా దిగజారాలన్నది టీడీపీ ‘వ్యూహం’. గతంలో రాష్ట్రం డ్రగ్స్‌ మయమైపోయిందని... గంజాయి పెరిగిపోయిందని చేసిన ప్రచారాలు ఈ కోవలోనివే. ఇటీవల తెలుగుదేశం తమ్ముళ్లు అత్యాచారాలకు తెగబడితే... చినబాబు లోకేశ్‌ వాటిని ప్రభుత్వానికి అంటగడుతూ ఎగిరెగిరి పడటమూ ఇలాంటిదే. ఇక టెన్త్‌ విషయంలో ఈ దుష్టచతుష్టయం మరో అడుగు ముందుకేసింది. శ్రీకాకుళం జిల్లా రొట్టవలస, కొత్తపేట జెడ్పీ హైస్కూళ్లలో హిందీ ప్రశ్నాపతాన్ని టీడీపీ నేతలే లీక్‌ చేసి వాట్సాప్‌లో వైరల్‌ చేశారు. పోలీసులు నిగ్గు తేల్చి ఏడుగురు టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేశారు కూడా. లీక్‌ వెనుక ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి సిబ్బంది పాత్ర కూడా ఉందంటే కుట్ర లోతును అర్థం చేసుకోవచ్చు. లీకేజీ వార్తల్ని ఆ చానలే పదే పదే ప్రసారం చేసింది. కళ్లముందున్న వాస్తవాలక్కూడా ఇన్ని రంగులేస్తున్న ఎల్లో మీడియా ఇంకెన్నాళ్లు జనాన్ని నమ్మించగలుగుతుంది? మీ అబద్ధాల్ని జనం ద్వేషిస్తున్నారని తెలియదా? వింటున్నారా రామోజీ!!  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top