తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
డీఎస్సీ స్కామ్‌తో వణికిపోతూ ఎట్టకేలకు స్పందించి వివరణ ఇచ్చే యత్నం
ఈ క్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాత్రికేయుల సమావేశం
అంతా పారదర్శకంగానే చేశామని చెప్పుకొచ్చిన అధికారి
ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు ఉద్యోగి ర్యాంకుపై మాత్రం ఆన్సర్ నిల్
అతడి లాగిన్ ఐడీ బ్లాక్ చేయడంపైనా సమాధానం చెప్పని వైనం
సర్టిఫికెట్ల పరిశీలనకు రాలేదని ఒకసారి.. ఆ పోస్టు పక్కన పెట్టామని మరోసారి పొంతనలేని సమాధానం
ఒక్క పోస్టుకు ఒక్కరినే పిలిచామని వెల్లడి
ఇందులో హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల కొందరి పోస్టు పోయింది
పోస్టులు రానివారంతా అలాంటి వారేనని సమర్థింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెగా డీఎస్సీ–2025లో అవకతవకలకు పాల్పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్త కథలు చెబుతూ తప్పుపై తప్పు చేస్తూ దొరికిపోతోంది. ఈ కుంభకోణంపై ఎట్టకేలకు ఆలస్యంగా స్పందించింది. పోస్టుల భర్తీలో తీవ్ర అవకతవకలకు పాల్పడటాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. చేసిన స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం ఎనిమిది రోజుల తర్వాత ఈ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. శనివారం విద్యాశాఖ అధికారులను ముందుకు నెట్టి, తూతూ మంత్రంగా వివరణ ఇప్పించే ప్రయత్నం చేసి.. అందులోనూ అడ్డంగా బుక్కయింది. శనివారం సాయంత్రం విద్యాభవన్‌లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు పొంతన లేని జవాబులిస్తూ.. కొన్నింటికి సమాధానం దాటవేశారు. స్పోర్ట్స్ డీఎస్సీ గురించి తనకు తెలియదని చెప్పడం కుంభకోణం జరిగిందనడానికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ సమావేశంలో మెగా డీఎస్సీ–2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పుకొచ్చారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి 241 కేసులు నమోదైనప్పటికీ, రికార్డు సమయం 148 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ర్యాంకుపై పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే, స్పోర్ట్సు కోటా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన తప్పులపై తనకు తెలియదని, అది తన పరిధికాదన్నట్టు జవాబు దాటవేశారు.
నవీన్ విషయంలో 3 సమాధానాలు
మీడియా: మెగా డీఎస్సీలో ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్‌గా, టీజీటీలో ఆరో ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంక్ సాధించిన అతనికి పోస్టు ఎందుకు నిలిపివేశారు? ఎలాంటి తప్పు జరక్కుంటే ఇలా ఎందుకు చేశారు. అసలు ఆయనకు టాప్ ర్యాంకు ఎలా వచ్చింది?
కార్యదర్శి: శాఖలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా పరీక్ష రాయాలన్నా, కోర్సులు చదవాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. నవీన్ ముందస్తు అనుమతి తీసుకోలేదు. అందుకే అతడి పోస్టును నిలిపివేశాం. నవీన్ రెండు పరీక్షలు రాశారు. పరీక్ష రాసేంత వరకు ఇక్కడ పనిచేశాడు. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను సెలెక్షన్ లిస్టులో ఉన్నారు. కానీ వెరిఫికేషన్ కోసం రాలేదు. దీంతో నిబంధన ప్రకారం అతన్ని రిక్రూట్మెంట్ చేయలేకపోయాం. నవీన్ కోర్టుకు వెళ్లాడు. కోర్టుల్లో మా వాదనలు వినిపించాం. అతను వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు రాలేదో అతనికే తెలియాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాకపోవడంతో అతని పోస్టు పక్కన పెట్టాం.
వాస్తవం: నవీన్ రెండు పోస్టులకు ఉత్తమ ర్యాంకులు సాధించాక అతనితో తన కాంట్రాక్టు ఉద్యోగానికి రాజీనామా చేయించారు. అనంతరం అతడి డీఎస్సీ లాగిన్ ఐడీని బ్లాక్ చేశారు. అతను కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు.
1:1 పద్ధతిలో సర్టిఫికెట్ల పరిశీలన
కార్యదర్శి: గత అనుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్టు కాకుండా 1ః1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచాం. వెరిఫికేషన్‌లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత వారిని వెరిఫికేషన్‌కు పిలిచాం. హారిజాంటల్ రిజర్వేషన్లు స్పోర్ట్స్, మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుతం పేపర్లలో వస్తున్న కథనాలన్నీ హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించినవే.
వాస్తవం: 1:1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిస్తే.. కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటల్ రిజర్వేషన్‌లో ఉన్నవారే. వీరందరికీ ఉద్యోగం రావాలి. సర్టిఫికెట్లు సరిగా లేకపోతే వారిని రిజెక్ట్ చేసి, రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటాల్ రిజర్వేషన్‌లో ఉన్నవారే. అలాంటి వారికి పోస్టింగ్ ఇవ్వలేదు.
స్పోర్ట్సు కోటా వారిచ్చిందే చేశాం
కార్యదర్శి: డీఎస్సీ స్పోర్ట్సు కోటా అంశంలో శాప్ ఇచ్చిన అంశాలనే పరిగణనలోకి తీసుకున్నాం. అక్కడేం జరిగిందో మాకు తెలియదు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వాలన్నది డీఎస్సీ భర్తీ నాటి పాలసీ. ప్రభుత్వంలో పాలసీలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు పాలసీ మారితే మాకు సంబంధం లేదు. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం. స్పోర్ట్స్ సెపరేట్‌గా హ్యాండిల్ చేద్దాం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారు కూడా కష్టపడి ఉద్యోగాన్ని సాధించారు.
వాస్తవం: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో రెండు విధానాలు అనుసరించారు. ఒకటి రెగ్యులర్ డీఎస్సీలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు క్రీడల ప్రాధాన్యం ప్రకారం వెయిటేజీ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారు. కానీ, ఈ ప్రభుత్వం కొత్తగా రెండో విధానం ఈ డీఎస్సీ వరకు అమలు చేసింది. ప్రత్యేకంగా క్రీడా పాలసీ–2024–29ను డీఎస్సీకి ముందు తీసుకొచ్చింది. ఇందులో ఎటువంటి రాత పరీక్ష (టెట్/డీఎస్సీ) లేకుండా క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేసింది. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ పాలసీని సవరించి, రాత పరీక్ష తప్పనిసరి చేసింది.
ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు
కార్యదర్శి: డీఎస్సీలో లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. తప్పు పట్టలేదు.
వాస్తవం: డీఎస్సీ నిర్వహణలో 33,830 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు రాత పూర్వంగా ప్రకటించారు. జిల్లా, జోనల్ స్థాయిలో తమకు సంబంధం లేదు.. రాష్ట్ర కార్యాలయంలో తేల్చుకోండి అని, మరికొందరికి నిర్లక్ష్యంగా సమాధానం పంపించారు. మరి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పడంలో అర్థం లేదు.
కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదు
కార్యదర్శి: డీఎస్సీలో కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదు. అంతా ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.
వాస్తవం: తూర్పు గోదావరి జిల్లాలో ఓ సెంటర్‌లో మాస్ కాపీయింగ్ చేశారని 11 మంది డీఎస్సీ అభ్యర్థులను అధికారులే స్వయంగా అనర్హులుగా ప్రకటించారు. వారంతా కోర్టుకు పోగా అధికారులు నేరం రుజువు చేయలేకపోయారు. దాంతో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. (కాపీయింగ్‌పై మరోసారి ప్రశ్నించగా అలా అనలేదని సమాధానం చెప్పారు)
వాస్తవాలు దాచి సమాధానం దాటవేత
డీఎస్సీ అక్రమాలలో కీలకమైన ఆరోపణలపై విద్యా శాఖ సమాధానం దాటవేసింది. ఎస్సీఈఆర్టీలో పనిచేసే నవీన్‌కు టాప్ ర్యాంక్ రావడంపై కార్యదర్శి కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామని ఒకసారి.. కౌన్సిలింగ్‌కు రాలేదు కాబట్టి పక్కన పెట్టామని మరోసారి చెప్పారు. వాస్తవానికి నవీన్‌కు కాల్ లెటర్ వెళ్లకుండా అభ్యర్థి డీఎస్సీ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారు. ఆ విషయం బాధిత నవీన్ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. పైగా కాంట్రాక్టు ఉద్యోగి పరీక్ష రాసేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశంపై సమాధానం దాటవేశారు. అలాగే, అతను ఎస్సీఈఆర్టీలో పనిచేస్తూ టాప్ ర్యాంకులు సాధించడం యాదృచ్ఛికమా లేక ఏమైనా తప్పు జరిగిందా అనే అంశంపైనా సరైన సమాధానం ఇవ్వలేదు.
గ్రీవెన్స్‌లోనూ తప్పులే
కాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లిన తర్వాత అన్నీ సక్రమంగానే జరిగాయని చెప్పిన అధికారులు ఎంపిక లిస్టులో అభ్యర్థుల పేర్లను గల్లంతు చేశారు. ఈ విషయమై బాధిత అభ్యర్థులు విద్యా శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ రిడ్రెసెల్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చాలా మంది అభ్యర్థులకు సరైన సమాధానం లభించలేదని వాపోయారు. మరికొందరికి రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అధికారుల నిర్లక్ష్యం కనిపించింది.
దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం!
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా డైరెక్టు నియామకాలే కాదు.. రాత పరీక్షల్లో స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెయిటేజీల్లోనూ అక్రమాలు జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టిఫికెట్లు పెట్టి పోస్టులు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ జత చేయడంతో పోస్టు కట్టబెట్టారు. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గానీ, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ఆడింది గానీ లేకుండా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. సదరు వ్యక్తి భర్త పీఈటీ కావడంతో మాస్టర్ మైండ్ ఏజెంట్లతో కలిసి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తూ పిటిషనర్లను బెదిరించడం గమనార్హం.
ఇదో అవినీతి క్రీడ
⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ క్రీడా కోటా ఉద్యోగానికి అనర్హురాలిగా ప్రకటించింది. అనూహ్యంగా ఆమెకు ఏపీ డీఎస్సీ క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పోస్టు ఇచ్చారు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో పోస్టల్ శాఖను మోసగించే ప్రయత్నం చేయడంతో ఆమెపై గతంలో అనర్హత వేటు వేశారు. అలాంటి ఈమెకు ఏపీలో ఎలా ఉద్యోగం ఇచ్చారు? ఆమె రెండు వేర్వేరు ఏజ్ గ్రూప్స్‌లో ఆడినట్టు విజయనగరం జిల్లా పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆధారాలతో గతేడాది ఆగస్టులోనే శాప్‌కు ఫిర్యాదులు చేశారు. అప్పుడు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. నెల క్రితం ‘సాక్షి’లో కథనం వచ్చాక విచారణ చేస్తామని శాప్ అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఆమె ఉద్యోగంలో కొనసాగుతున్నారు.
⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపించి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే అతన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత అతను కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖలో ఇదే క్రీడా కోటాలోనే ఉద్యోగం పొందారు. ఇక్కడ పోస్టల్ శాఖ అనర్హులుగా తేల్చిన వ్యక్తికి ఏపీలో ఉద్యోగం ఇస్తే.. ఏపీలో తిరస్కరించిన వ్యక్తికి పోస్టల్ శాఖలోనే ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ఘటనలే డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికల పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.
⇒ కర్నూలు జిల్లాలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి నాన్–లోకల్ కోటాలో వేరే జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడ నాన్–లోకల్‌లోకి వచ్చేవారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలకు దిగువన ఉన్నా నాన్‌లోకల్ కోటాలో అక్కడ పోస్టును భర్తీ చేశారు. పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఇది తప్పు అని తెలిసినా పట్టించుకోలేదు. అసలు ఓపెన్ కేటగిరీలో ఓ పోస్టు భర్తీ చేశాక, నాన్ లోకల్‌లో మరో పోస్టును ఎలా భర్తీ చేస్తారు?


