
పనులకు రెండు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ
మొదటి ప్యాకేజీ కాంట్రాక్టు విలువ రూ.394.6 కోట్లుగా అంచనా
4.29 శాతం అధిక ధరతో రూ.411.53 కోట్లకు కోట్ చేసిన ఎన్‌సీసీ
రెండో ప్యాకేజీ కాంట్రాక్టు విలువ రూ.361.34 కోట్లుగా అంచనా
4.28 శాతం అధిక ధరతో రూ.376.80 కోట్లకు కోట్ చేసిన ఎన్‌సీసీ
రెండు ప్యాకేజీల పనులను ఎన్‌సీసీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.32.39 కోట్లకు పైగా భారం
రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే రూ.వంద కోట్లు ఆదా అయ్యేవంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంలో సిండి‘కేటు’ లాలూచీపర్వం మరోసారి బట్టబయలైంది. తాగునీటి పథకం పనులు ఆస్మదీయ సంస్థ పరమయ్యాయి. అది కూడా.. ఏదో ఒక క్రమ సంఖ్యలా అధిక ధరకు కోట్ చేయడం.. దానికే పనులు దక్కడం గమనార్హం. ఇదంతా చూస్తే టెండర్లలో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
అమరావతి తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులకు రూ.755.94 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. డీబీవో (డిజైన్ బిల్ట్ ఆపరేట్) విధానంలో టెండర్లు పిలిచింది. వీటి పూర్తికి 750 రోజులు గడువు నిర్దేశించింది. ఏడేళ్ల పాటు పథకాన్ని నిర్వహించి, తర్వాత ఏడీసీఎల్‌కు అప్పగించాలని షరతు విధించింది.
⇒ కృష్ణా నది నుంచి రోజుకు 190 మిలియన్ లీటర్ల నీటిని తరలించి, శుద్ధి చేసి నిల్వ చేసేందుకు 64 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో చేపట్టే సెమీ అండర్‌గ్రౌండ్ రిజర్వాయర్ పనులకు రూ.394.60 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది. వీటికి 4.29 శాతం అధిక ధరకు అంటే రూ.411.53 కోట్లకు కోట్ చేసింది ఎన్‌సీసీ.
⇒ రాజధాని ప్రాంతంలో తాగునీటి సరఫరా కోసం 45.28 కి.మీ. పొడవునా డి్రస్టిబ్యూషన్ వ్యవస్థను, ఈ వ్యవస్థకు నీటిని సరఫరా చేయడానికి 57.84 కి.మీ. పొడవునా ఫైప్‌లైన్ వేసే పనులకు రూ.361.34 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది. ఈ పనులకు 4.28 శాతం అధిక ధరకు అంటే రూ.376.80 కోట్లకు కోట్ చేసింది ఎన్‌సీసీ.
⇒ రెండు ప్యాకేజీల్లోనూ ఎన్‌సీసీనే ఎల్–1గా నిలవడం గమనార్హం. ఈ సంస్థకే పనులు అప్పగిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఖజానాపై రూ.32.39 కోట్లకుపైగా అదనపు భారం పడింది. ఒకవేళ ఈ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కనీసం రూ.వంద కోట్ల మేర ఆదా అయ్యేవని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సిండికేటు సభ్య సంస్థకే...
రాజధాని సిండి‘కేటు’ కాంట్రాక్టు సంస్థల్లో ఎన్‌సీసీ కూడా ప్రధానమైనది. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే ముఖ్య నేత కనుసైగలతో ఆ పనులు ఎన్‌సీసీకి దక్కుతాయనే చర్చ కాంట్రాక్టు వర్గాల్లో జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది.. కాంట్రాక్టు సంస్థలు సిండికేటై.. అధిక ధరకు కోట్ చేయడం వల్ల ఖజానాపై అదనపు భారం పడింది.
ఈ పనులను అప్పగిస్తూ ఎన్‌సీసీతో ఏడీసీఎల్ అధికారులు ఒప్పందం చేసుకున్న వెంటనే.. కాంట్రాక్టు విలువలో పది శాతం అంటే రూ.78.83 కోట్లను ఆ సంస్థకు మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ముట్టజెప్పనున్నారు. ఆ తర్వాత అందులో 8 శాతం ముఖ్యనేత.. 2 శాతం కాంట్రాక్టు సంస్థ నీకింత నాకింత అంటూ పంచుకోనున్నాయి.
అంచనాలను పెంచేసి...
రాజధాని తాగునీటి పథకం అంచనాలను భారీగా పెంచేసినట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. జ్యుడిíÙయల్ ప్రివ్యూ వ్యవస్థ అమల్లో ఉండి ఉంటే ఈ అక్రమాలు బయటకొచ్చేవని, అంచనా వ్యయం తగ్గేదని స్పష్టం చేస్తున్నాయి.
⇒ ఎన్‌సీసీకి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రూ.8,838.83 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఇప్పుడు రాజధాని తాగునీటి పథకం కూడా కట్టబెట్టడంతో మొత్తం రూ.9,627.16 కోట్ల విలువైన పనులు దక్కినట్లయింది.