
ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా వేధిస్తున్నారు
గ్రూప్–1 స్థాయి అధికారితో చెత్త తొలగించే పనిచేయిస్తున్నారు
పెండింగ్‌లో ఉన్న రూ.31వేల కోట్లు బకాయిలు ఎప్పుడిస్తారు?
ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వంలో చలనం రావడంలేదు
నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్న చరిత్ర ఎప్పుడూ లేదు
ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటి పైకొచ్చి పోరాటం చేయాలి
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: ఒక్క డీఏ అయినా ఇవ్వాలని ప్రభుత్వోద్యోగులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం స్పందించడంలేదని.. నాలుగు డీఏల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారా అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగులు రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేసినా, ఉద్యోగ సంఘాలు ఎంత ఘోషించినా ప్రభుత్వం డీఏల గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదని మండిపడ్డారు.
తాడేపల్లిలోని ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఉద్యోగులకు డీఏ ఇవ్వడం కోసమే పెడుతున్నారని ప్రచారం జరిగిందని, కొన్ని ఛానళ్లు, సోషల్ మీడియాలో అయితే డీఏ ఇచ్చేసినట్లు కూడా చెప్పేశారని.. తీరాచూస్తే కేబినెట్‌లో ఆ ఊసేలేదన్నారు. అసలు డీఏ గురించి తనకు అవగాహనే లేదని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెప్పడాన్ని చూస్తే ఉద్యోగులపట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. వెంకట్రామిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..
రూ.6,500 కోట్ల బకాయిలు ఎప్పుడు, ఎవరికిచ్చారు?
గత వారం 20 వేల మంది టీచర్లు డీఏ కోసం పెద్దఎత్తున ధర్నాచేసినా ప్రభుత్వం స్పందించలేదు. దసరాకు డీఏ ఇస్తారని ఎదురుచూశాం. అప్పుడ ఇవ్వలేకపోయారు కాబట్టి ఇప్పుడైనా ఇస్తారని ఎదురుచూస్తే ఇప్పుడూ నిరాశే ఎదురైంది. డీఏ పరిస్థితి ఇలా ఉంటే పెండింగ్ బకాయిలు రూ.31వేల కోట్లు ఎప్పుడిస్తారు, పీఆర్సీ కమిషన్‌ను ఎప్పుడు వేస్తారనే అంశంపైనా స్పష్టతలేదు. మరోవైపు.. ఉద్యోగులకు రూ.6,500 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ఆరి్థక మంత్రి చెబుతున్నారు.
ఎవరికి చెల్లించారో చెప్పమంటే చెప్పడంలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉన్న బకాయిలెన్ని, ఈ 16 నెలల్లో ఉన్న బకాయిలెన్ని, మీరు చెల్లించిన బకాయిలెన్ని అని చెప్పమంటే చెప్పడంలేదు. గత ప్రభుత్వంలో ఈ వివరాలన్నీ ఇచ్చేవారు. కనీసం ఆర్టీఐ చట్టం ద్వారా అడిగినా బకాయిలు ఎన్నో చెప్పకుండా రూ.6,500 కోట్లు చెల్లించామంటున్నారు. పోయిన సంక్రాంతికి పోలీసులకు రెండు ఎస్‌ఎల్‌లు ఇస్తామని ఒకటే ఇచ్చారు.. మళ్లీ సంక్రాంతి వస్తున్నా రెండో ఎస్‌ఎల్ ఇవ్వలేదు.
ఈ ప్రభుత్వం వచ్చాక రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్తవారిని నియమించడంలేదు. ఇప్పుడు కమిషనర్‌ను నియమించినా దానిపై నిర్ణయం తీసుకోవడానికి రెండేళ్లకుపైనే పడుతుంది. అయినా నియమించడంలేదంటే 2029 ఎన్నికల దాకా పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించడంలేదని అనిపిస్తోంది. ఉద్యోగులంటే ప్రభుత్వానికి అంత చిన్నచూపా!?
సచివాలయ ఉద్యోగులతో దారుణంగా చాకిరి?
ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా కనీసం ఆదివారాలు కూడా సెలవు ఇవ్వడంలేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలకు ప్రతి ఆదివారం ఏదో ఒక పనిచెబుతున్నారు. వారికి సెలవులేదు, పండుగలేదు. కనీసం ఆదివారమైనా సెలవు ఇప్పించాలని వీరు వేడుకుంటున్నారు. ఇక జీఎస్టీ గురించి వీరిని డోర్ టు డోర్ ప్రచారం చేయమంటున్నారు.
అసలు జీఎస్టీ ఒక్క మన రాష్ట్రంలోనే తగ్గించారా? ఏ రాష్ట్రంలో అయినా ఇలా ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం ఉందా? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో దారుణంగా పనిచేయిస్తున్నారు. చేపను బండకేసి రుద్దినట్లు రుద్దుతున్నారు. గ్రూప్–1 స్థాయి అధికారికి చెత్త ఎత్తే ఫొటో తీసే పనిచెప్పడం ఏంటి? ఎవరైనా ఇవన్నీ మాట్లాడితే భయపెడుతూ ఇష్టమొచ్చినట్లు వేధిస్తున్నారు.
డీఏలు, పీఆర్సీ సంగతి దేవుడెరుగు.. కనీసం సెలవు ఇవ్వండి చాలనే స్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారు. ఇతర ఉద్యోగ సంఘాలతో సహా అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పోరాటానికి ఏపీ ఎన్జీఓ సంఘం నాయకత్వం వహించాలి. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్న చరిత్ర ఎప్పుడూలేదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పోరాటం తప్పదు.