
‘పుట్టిన రోజు పండగే ప్రతి ఒక్కరికి.. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే’’ పాత సినిమా పాట ఇది. కాకపోతే... దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అతికినట్లు సరిపోతుంది ఇది. వచ్చిన అవకాశాలను ప్రజల కోసం వినియోగించిన తీరు గమనిస్తే పుట్టింది ఎందుకో తెలిసిన వ్యక్తులలో వైఎస్సార్ అగ్రభాగాన ఉంటారు.
సంపన్న కుటుంబంలో జన్మించినా సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడడం ఆయన ప్రత్యేకత. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మలమడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు. రూపాయి డాక్టర్‌గా సేవలందించి ప్రజల మన్నన చూరగొన్నారు. రాజకీయాలలోనూ ఆయన తన విధానాలను వదులుకోలేదు. ఎన్నో ఎగుడు దిగుడులు చూశారు. సవాళ్లు ఎదుర్కున్నారు. అయినా ఓటమి ఎరుగని నేతగా రికార్డు సాధించారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు... విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఈ రికార్డు దక్కింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌కు మాత్రమే. ఎమ్మెల్యేగా పోటీచేసినా, ఎంపీగా ఎన్నికల బరిలో దిగినా ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు. 1996లో కడప లోక్‌సభ సీటు నుంచి పోటీచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ గెలవడం ఒక సంచలనం. 1999లోనే ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కాని అప్పట్లో టీడీపీ బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం, కార్గిల్ యుద్ద ప్రభావం, ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కోల్పోయారన్న సానుభూతి వంటి కారణాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేశాయి.
ఆ దశలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వైఎస్ నాయకత్వం వహించారు. అప్పట్లోనూ చంద్రబాబు నాయుడు తన సహజశైలిలో వైఎస్ వ్యక్తిత్వ హననం నానా ప్రయత్నాలూ చేశారు. బ్యానర్లు కట్టారని, ఎన్నికల నిబంధనలు సరిగా పాటించలేదని, ర్యాలీలు తీశారన్న చిన్న చిన్న కారణాలపై కూడా కేసులు పెట్టించి వ్యతిరేక ప్రచారం చేసేవారు. వాటిని బూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగేది. ఇందుకు టీడీపీ మీడియా తోడు ఉండనే ఉంది.1999లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా వైఎస్ దానిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. తదుపరి పాదయాత్రను ప్లాన్ చేసుకుని జనంలోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు వ్యతిరేకించాయి.
సొంతంగా ఎదగడానికి యత్నిస్తున్నారని, భవిష్యత్తులో సోనియా గాంధీని కూడా ధిక్కరిస్తారని పితూరీలు చెప్పేవారు. అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తూండేది. దాంతో వైఎస్ కొన్నిసార్లు ఇబ్బందులు పడేవారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వద్ద అనారోగ్యానికి గురయ్యారు. సోనియా గాంధీని అక్కడకు తీసుకురావాలని కొంతమంది నేతలు యత్నించారు కాని ఎందువల్లో ఆమె రాలేదు. అయినా వైఎస్ తన పాదయాత్రను వదలి పెట్టలేదు. 2003లో చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ దాడి చేసినప్పుడు వైఎస్ తిరుపతి వెళ్లి పరామర్శ చేసి దాడికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు.
అప్పట్లో చంద్రబాబు సానుభూతి వస్తుందని ఆశించి శాసనసభను రద్దు చేశారు. కాని వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూశారు. పాదయాత్ర ద్వారా ప్రజలలో వచ్చిన ఆదరణను నిలబెట్టుకునేందుకు వైఎస్ యత్నించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ గ్రూపులను సైతం కలుపుకుని వెళ్లడానికి సిద్దపడ్డారు. అక్కడ నుంచి ఆయన రాష్ట్ర చరిత్రను ,గతిని మార్చేశారని చెప్పాలి. 2004లో కాంగ్రెస్‌ను విజయపథంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కరాదని కొన్ని యత్నాలు జరగకపోలేదు. అయినా ఆయన తొణకలేదు. చివరికి వైఎస్ కాకుండా మరెవరికైనా సీఎం పదవి ఇస్తే ప్రభుత్వం నడవడం కష్టమని తెలుసుకుని, అధిష్టానం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.
ఆ తర్వాత ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం మొదలు అనేక హామీల అమలుకు కృషి చేశారు. అంతకుముందు ఒకసారి ఎంపీల సమావేశంలోకాని, ఇతరత్రాకాని నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టకపోతే చరిత్ర హీనులవుతారని ఆనాటి పాలకులను రాజశేఖరరెడ్డి హెచ్చరించే వారు. వైఎస్‌కు భయపడి ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాని 2004 వరకు ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఆ సమయంలో వైఎస్ ఒక కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాల వద్ద పూలు పెట్టివచ్చారు.
ఆ సంగతులు అన్నిటిని గుర్తుంచుకున్న వైఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే ప్రాజెక్టులపై సమీక్ష చేసి వాటిని ఎలా పరుగు పెట్టించాలా అని ఆలోచన చేశారు. వైఎస్ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు. ఉమ్మడి ఏపీలో ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి. రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు విస్తరణతో సహా హంద్రీ నీవా, గాలేరు-నగరి, గండికోట ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టారు. తెలంగాణలో ఎల్లంపల్లి, కల్వకర్తి, బీమా, ప్రాణహిత-చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోస్తాంద్రలో పోలవరం, పులిచింతల, వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలైవని ఉన్నాయి.
పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో తెలంగాణ వారితో పాటు ఆంధ్రకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు, నిరసనలు ఎదుర్కున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు తవ్వుతుంటే టీడీపీ ఎన్నో ఆటంకాలు కల్పించింది. అయినా ఆయన ఆగలేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కావల్సిన అనుమతులు తేవడంలో వైఎస్ చూపిన శ్రద్ద నిరుపమానం. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకున్నదంటే ఆ ఘనత ఆయనదే. పులిచింతల నిర్మాణం దశాబ్దాల తరబడి స్తంభించిపోతే వైఎస్సార్ దానిని చేసి చూపించారు. దానిని వ్యతిరేకించే తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఒప్పించి మరీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. ఒక నేత ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావని భావిస్తే, వైఎస్ మాత్రం మనం మొదలుపెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారంటూ విశాల దృక్పథంతో ఆరంభించారు.
ఈ రోజు విభజిత ఆంధ్ర ఈ మాత్రమైనా నిలబడిందంటే అది వైఎస్ గొప్పదనమని అంగీకరించక తప్పదు. ఇది మాబోటివాళ్లం ఇప్పుడు చెప్పడం లేదు. 2009 నుంచే చెబుతున్నాం. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం కట్టిన ఒక సీఎం హైదరాబాద్ తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ ప్రచారం లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఒక రూపం తెచ్చారు. అదంతా ఒక ఆధునిక నగరంగా మారిందంటే బీపీ ఆచార్య అనే ఐఎఎస్ అధికారిని నియోగించి వైఎస్ చేసిన కృషే అని చాలామందికి తెలియక పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ప్రచారం చేసుకోలేకపోయింది. టీడీపీ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకతను భరిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మూడువంతులు పూర్తిచేశారు.
హైదరాబాద్ దశ, దిశను మార్చిన గొప్ప ప్రాజెక్టు అది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణమే కాకుండా, అక్కడకు వెళ్లడానికి వీలుగా ఎక్స్‌ప్రెస్ వంతెనను 13 కిలోమీటర్ల దూరం నిర్మించడం ద్వారా ఆయనకు ఉన్న విజన్‌ను ప్రజలకు తెలియ చేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన నేతగా, విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టి పేదలకు విద్యాదానం చేసిన వ్యక్తిగా చరిత్రపుటలలోకి ఎక్కారు. 2009లో ఆయనను ఓడించడానికి టీడీపీ ఏకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసిందంటేనే వైఎస్ ఎంత శక్తిమంతుడుగా అవతరించారో అర్థం చేసుకోవచ్చు. పరస్పర విరుద్ద భావాలు కలిగిన టీడీపీ, టీఆర్‌ఎస్(నేటి బీఆర్‌ఎస్), సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూటమి కట్టినా 2009లో వైఎస్‌ను ఓడించలేకపోయాయి.
మొత్తం బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి రావడానికి కూడా వైఎస్ కారణభూతులయ్యారు. అయినా ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. వైఎస్ జీవించి ఉన్నా, వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌ను సీఎంగా చేసినా ఉమ్మడి ఏపీ భవిష్యత్తు మరోలా ఉండేదని చాలామంది నమ్ముతారు. ఏది ఏమైనా వైఎస్ సీఎంగా చేసింది ఐదేళ్ల మూడునెలల కాలమే అయినా, ఒక శతాబ్దానికి సరిపడా పేరు తెచ్చుకుని గొప్పనేతగా ప్రజల మదిలో నిలిచిపోయారు.వైఎస్ రాజశేఖరరెడ్డికి జయంతి సందర్భంగా ఇదే నివాళి.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.