
కర్నూలు జిల్లా పోలీస్ అధికారులకు ప్రశంసాపత్రం అందజేస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా పెద్దకడుబూర్ పోలీస్ స్టేషన్‌కు జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకు సంబంధించిన రూ.25 వేల నగదు రివార్డును మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెలి్లకి డీజీపీ గౌతమ్ సవాంగ్ సోమవారం అందజేశారు. కేంద్ర హోంశాఖ ఇటీవల నిర్వహించిన డీజీపీల కాన్ఫరెన్సులో 2020 ఏడాదికి సంబంధించి ఈ అవార్డును ప్రకటించారు. ఏపీలో అత్యత్తమ పోలీసు స్టేషన్‌గా కర్నూలు జిల్లా పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ను ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు’కు ఎంపిక చేశారు. ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపిక చేయడానికి పది ప్రధాన అంశాలను కేంద్ర హోంశాఖ పరిగణనలోకి తీసుకుంది.
నేరాలను ముందస్తుగా నిరోధించడం, క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం, వేగవంతంగా దర్యాప్తు చేసి పరిష్కరించడం, త్వరితగతిన ఛేదించడం, కమ్యూనిటీ పోలీసింగ్, శాంతిభద్రతలను పరిరక్షించడం, శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహార శైలి గురించి ప్రజల స్పందన (ఫీడ్ బ్యాక్), నేర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి ఆన్‌లైన్ చేయడం, డేటాను భద్రపరచడం, మహిళలు, ఎస్సీ, ఎస్టీ ప్రజలపై నేరాలు, ఆస్తులకు సంబంధించిన నేరాలపై అవగాహన కల్పించి నియంత్రించడం, సకాలంలో ఎఫ్‌ఐఆర్‌లు, చార్‌్జషీట్లు దాఖలు చేయడం వంటి వాటిని పరిశీలించిన అనంతరం పెద్దకడుబూర్ పోలీస్ స్టేషన్‌ను ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేశారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి
జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడం కర్నూలు జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణమని డీజీపీ సవాంగ్ అన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను, సిబ్బందిని డీజీపీ సవాంగ్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అభినందించారు. డీజీపీ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. పోలీసింగ్‌లో ఆధునిక, సాంకేతిక టెక్నాలజీని వినియోగించి శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించాలన్నారు.