Defamation case: ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువు నష్టం కేసు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై దురుద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికలపై పరువు నష్టం కేసు వేస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ శాఖ కార్యదర్శిగా పలుమార్లు విలేకరుల సమావేశాలు, పత్రికా ప్రకటనల ద్వారా రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలియజేస్తున్నప్పటికీ, ప్రజల్లో గందరగోళం సృష్టించడంతోపాటు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేలా వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. రైతులందరికీ 9 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. అయినా, కల్పిత వార్తలు ప్రచురించడం పట్ల విస్మయం వ్యక్తంచేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ హెచ్చరించారు.
(చదవండి: అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది)