రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ఊదరగొట్టిన చంద్రబాబు
దాని భారం ప్రజలపై పడదని పదేపదే వెల్లడి
ఇప్పుడు మెల్లగా రాష్ట్ర ఖజానా నుంచి అప్పుల చెల్లింపులు
రెండో త్రైమాసికంలో చెల్లించాల్సిన అప్పులకు రూ.231.40 కోట్లు
గడువు తీరుతున్న అప్పులు చెల్లింపునకే ఈ నిధులు వినియోగమని సన్నాయినొక్కులు
ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు భారం రాష్ట్ర ప్రజలపై పడదని సీఎం చంద్రబాబు, ఇతర కూటమి నేతలు పదే పదే చెబుతూ వచ్చారు. కేంద్రం ఇప్పించిన రుణాల భారమూ రాష్ట్రంపై పడదని నమ్మబలికారు. తీరా చూస్తే అప్పులను మెల్లగా రాష్ట్ర ఖజానా నుంచే చెల్లించడం ప్రారంభించారు. రాజధాని పేరుతో చేసిన అప్పులు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర బడ్జెట్ నుంచి చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ప్రారంభించింది.
ఈ ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో చెల్లించాల్సిన అప్పుల కోసం బడ్జెట్ నుంచి రూ.231.40 కోట్లను విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గడువు తీరుతున్న అప్పుల చెల్లింపునకే ఈ నిధులను వినియోగించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ కమిషనర్ వినతి మేరకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ గొప్పలు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరి రాజధాని పేరుతో చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు బడ్జెట్ నుంచి నిధులు ఎందుకు విడుదల చేస్తున్నారో చెప్పాల్సి ఉందని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ, ఎన్ఏబీఎఫ్ఐడీ, ఏపీపీఎఫ్‌సీఎల్, నాబార్డు నుంచి రూ.47,387 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే. అప్పులు చేసినా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయినందున అప్పులను ఆ ప్రాజెక్టే తీరుస్తుందనే రీతిలో సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గడువు తీరుతున్న అప్పులను తిరిగి చెల్లించేందుకు రూ.231.40 కోట్లను బడ్జెట్ నుంచి విడుదల చేయడం గమనార్హం.
ఈ నిధులు విడుదలతో పాటు షరతులను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులను సీఆర్‌డీఏ ప్రతిపాదనల్లో సూచించిన రుణ బాధ్యతల చెల్లింపునకు మాత్రమే ఉపయోగించాలని, మరే ఇతర ప్రయోజనానికి వినియోగించరాదని షరతు విధించారు. అన్ని తిరిగి చెల్లింపులు రుణ ఒప్పందాలు, గడవు తేదీల ప్రకారం కచ్చితంగా జరగాలని, వాటిని నిర్ధారించాలని చెప్పారు. నిధుల వినియోగం జరిగిన వెంటనే, రుణాల వారీగా చెల్లింపుల వివరాలతో పాటు వినియోగ ధ్రువీకరణ పత్రాన్ని పరిపాలన, ఆర్థిక విభాగాలకు సమర్పించాలని, సంబంధిత శాఖ తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


