కుప్పంలో దళిత కుటుంబంపై దాడి | Dalit family attacked in Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో దళిత కుటుంబంపై దాడి

Apr 5 2026 5:10 AM | Updated on Apr 5 2026 5:10 AM

Dalit family attacked in Kuppam

సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మరో దారుణ ఘటన 

శాంతిపురం మండలం నంజంపేటలో దళిత మహిళపై రెచ్చిపోయిన పచ్చమూక 

దాడి చేసింది కాక ఊరు విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ 

బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు 

తిరిగి వారినే బెదిరిస్తున్న వైనం 

రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో దళితులే టార్గెట్‌గా దాడులు

సాక్షి టాస్క్ ఫోర్స్‌: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతుండడంతో దళితులనే టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు డప్పు కొడుతున్న ఓ దళితున్ని కొట్టిన ఘటన మరువక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దళిత కుటుంబంపై టీడీపీ మూకలు దాడి చేసిన దారుణ ఘటన బయటపడింది. 

బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయ ఉత్సవాల్లో గత శుక్రవారం ఐదుగురు చిన్న పిల్లలు గొడవపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార టీడీపీ వర్గీయులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన దళితుడు మంజునాథ్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. భార్య అమృత, పిల్లలపై విచక్షణ లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కులం పేరుతో దూషించి, ఊరు వదలి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

మంజునాథ్‌ భార్య అమృత టీడీపీ నేతల దాడిపై రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ ఇంటిపై దాడి చేసి కొట్టి, కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, దళిత సంఘాలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement