ఓపీజీడబ్ల్యూ టెండర్లకు అర్హతల్లో కోత
బిడ్డర్లు రావడం లేదంటూ నిబంధనల సడలింపు
అర్హత ప్రమాణాలు 50 శాతం వరకు తగ్గింపు
ఆప్టికల్ గ్రౌండ్ వైర్ నాణ్యతపై నీలినీడలు
సాక్షి, అమరావతి: ఏదైనా ఒక టెండర్‌కు లేదా ఉద్యోగానికి నిర్దిష్ట నిబంధనలుంటాయి. వాటిని ఇష్టానుసారం మార్చేసుకోవడానికి వీల్లేదు. కానీ వాటికి తగ్గ విధంగా ప్రభుత్వ పెద్దలకు చెందిన సంస్థలు, వ్యక్తులు లేకపోతే షరతులను అనుకూలంగా సడలించేసుకునే కొత్త సంప్రదాయానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం తెరతీసింది. దీంతో విద్యుత్ సంస్థల్లో చిన్నచిన్న పనుల దగ్గర్నుంచి భారీ ప్రాజెక్టుల వరకు ప్రతి దానిలో కమీషన్లు దండుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అందులో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో ఆప్టికల్ గ్రౌండ్ వైర్ (ఓపీజీడబ్ల్యూ) టెండర్ల అర్హత నిబంధనలను భారీగా సడలించింది.
టెండర్లలో తగినంతమంది బిడ్డర్లు పాల్గొనడం లేదనే కారణంతో ఇప్పటికే ఉన్న అర్హత ప్రమాణాలను 50 శాతం వరకు తగ్గించింది. ఈ మేరకు ఇటీవల ఏపీ ట్రాన్స్‌కో 173వ బోర్డు సమావేశం చేసిన తీర్మానం ప్రకారం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. బిడ్డర్ల సంఖ్య పెంచేందుకు అర్హత ప్రమాణాలను తగ్గిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. దీనివెనుక వేరే ఉద్దేశాలున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. కేవలం తమ వారికి టెండర్లు కట్టబెట్టేందుకే ఇలా నిబంధనల్లో మార్పులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనుభవం ఇక నామమాత్రం
అర్హత నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం వల్ల కీలకమైన కమ్యూనికేషన్, రక్షణ సిగ్నలింగ్ వ్యవస్థలకు సంబంధించిన పనులను తక్కువ అనుభవం ఉన్న సంస్థలు చేపట్టే అవకాశం ఏర్పడుతుందనే ఆందోళన కూడా కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనికేషన్ బ్యాక్‌బోన్ నెట్‌వర్క్, ఎస్సీఏడీఏ అనుసంధానం, రక్షణ సిగ్నలింగ్, టెలికాం సేవలకు ఓపీజీడబ్ల్యూ ఆధారిత వ్యవస్థలను ఏపీ ట్రాన్స్‌కో వినియోగిస్తోంది. భారీస్థాయి ఓపీజీడబ్ల్యూ ప్రాజెక్టులకు నిర్వహించిన టెండర్లలో తగినంతమంది బిడ్డర్లు ముందుకు రాకపోవడంతో కొన్ని టెండర్లు ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుత అర్హత నిబంధనలు అధిక విలువ కలిగిన టెండర్లకు అడ్డంకిగా మారాయని భావించిన బోర్డు వాటిని సడలించేందుకు ఆమోదం తెలిపిందని అంటున్నారు. ఇప్పటివరకు టెండర్ పరిమాణంలో 40 శాతం సరఫరా చేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను ఇకపై 20 శాతానికి తగ్గించారు. అలాగే టెండర్‌లో పేర్కొన్న పరికరాల్లో కనీసం రెండేళ్లపాటు 20 శాతం పనితీరు అనుభవం ఉండాలన్న అర్హతను 10 శాతానికి కుదించారు.
నాణ్యతపై అనుమానాలు
ఆప్టికల్ గ్రౌండ్ వైర్ అనేది అధిక వోల్టేజ్ విద్యుత్ ప్రసారలైన్లలో ఉపయోగించే ఒక ప్రత్యేక రకమైన కేబుల్. ఇది పవర్ టవర్ల పైభాగంలో షీల్డ్ వైర్‌లా పనిచేస్తూ, ప్రధాన కండక్టర్లను పిడుగుపాటు నుంచి కాపాడుతుంది. విద్యుత్ కేంద్రాల మధ్య వాయిస్, వీడియో, నెట్‌వర్క్ డేటాను ప్రసారం చేయడానికి వాడతారు. అల్యూమినియం పూత పూసిన ఉక్కు లేదా అల్యూమినియం మిశ్రమలోహంతో తయారు చేస్తారు. మధ్యలో ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా అల్యూమినియం గొట్టం సున్నితమైన గ్లాస్ ఫైబర్ పోగులను కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి సురక్షితంగా ఉంచుతుంది.
ఇంత ప్రాధాన్యత కలిగిన ఓపీజీడబ్ల్యూ టెండర్ల నిబంధనల సడలింపు వల్ల పోటీ పెరగడం మాట అలా ఉంచితే.. ప్రమాణాలు బలహీనపడతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీ ట్రాన్స్‌కో జారీచేసే ఓపీజీడబ్ల్యూ టెండర్లకు మాత్రమే ఈ సడలింపులు వర్తిస్తాయని, మిగతా టెండర్లకు పాత నిబంధనలే కొనసాగుతాయని ఏపీ ట్రాన్స్‌కో వివరించింది. కానీ ఇలాంటి చర్యల కారణంగా పరికరాలు, పనుల్లో నాణ్యత తగ్గిపోతుందని ఇంధనరంగ నిపుణులు పేర్కొంటున్నారు.


