Sakshi News home page

ఆన్‌షోర్‌..ఆఫ్‌షోర్‌..ఎనీవేర్‌తో చమురు దోపిడీలకు చెక్‌

Published Sat, Apr 15 2023 3:39 PM

Crude Oil Theft: Security System Implemented Anywhere Policy - Sakshi

కాకినాడ క్రైం: ఆన్‌షోర్‌, ఆఫ్‌షోర్‌, ఎనీవేర్‌... ఇదీ చమురు దోపిడీలను నిలువరించేందుకు భద్రతా వ్యవస్థలు అనుసరిస్తున్న తాజా విధానం. సముద్ర ఉపరితలంపై కోస్టుగార్డు, తీర ప్రాంతాల్లో పోలీస్‌, ఎస్‌పీఎఫ్‌, మైరెన్‌ పోలీస్‌ తమ భద్రతా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సముద్ర భద్రత అంటే కోస్టుగార్డుకే పరిమితం అన్న స్థితిని దాటి తీర ప్రాంతాన్ని కూడా జల్లెడ పట్టి, జలాల్లో నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ తన అనుబంధ శాఖలతో కలిసి సమాయత్తమైంది.

సముద్ర దొంగతనాలంటే సాధారణంగా చమురు కేంద్రంగా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థనే శాసించే ప్రభావం ఉన్న చమురు ఉత్పత్తి నుంచి తరలింపు వరకు ప్రతి దశలోనూ పూర్తి స్థాయి భద్రత కల్పించేందుకు పేర్కొన్న వ్యవస్థలన్నీ ప్రత్యేక ప్రణాళికలతో శ్రమిస్తున్నాయి. ఆ వ్యూహాలను ప్రతిబింబించేలా కీలక సమావేశాలు, కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రక్రియలో భాగంగానే గురువారం వరకూ చేపట్టిన మాక్‌డ్రిల్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ముగిసిన సముద్ర జలశుద్ధి ప్రక్రియ
కాకినాడ తీరంలో అబ్బురపరిచే సముద్ర జల శుద్ది మూడు రోజుల ప్రక్రియ ముగిసింది. ఇండియన్‌ కోస్టు గార్డు ఆధ్వర్యంలో కాకినాడ స్టేషన్‌ పరిధిలో యుద్ద ప్రదర్శనను తలపించే రీతిలో రీజినల్‌ పొల్యూషన్‌ రెస్పాన్స్‌ ఎక్సర్‌సైజ్‌ పేరుతో భారీ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. కాకినాడ కోస్టుగార్డు స్టేషన్‌ కమాండెంట్‌ ఆఫీసర్‌ జి.వేణుమాధవ్‌ సారథ్యంలో భారీ స్థాయిలో చేపట్టిన ఈ మాక్‌ డ్రిల్‌ సముద్ర జలాల్లో చమురు తెట్లను తొలగించే ప్రక్రియతో పాటు భద్రతా పరమైన అంశాలకు నిర్వహణకు ఓ ట్రయల్‌గా అధికారులు తెలిపారు.

అటు పోలీస్‌శాఖ...
కోస్ట్‌గార్డుతో సహా అటు పోలీస్‌శాఖ సముద్ర తీరప్రాంత అనుబంధంగా జరిగే చమురు దోపిడీలపై దృష్టి సారించింది. ఏకంగా రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలు హద్దులుగా ఉన్న అన్ని జిల్లాల ఎస్‌పీలతో ఇటీవల రాజమహేంద్రవరంలో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో జిల్లాల వారీగా చమురు చోరీల గణాంకాలపై చర్చించారని కాకినాడ జిల్లా పోలీస్‌ వర్గాలు తెలిపాయి. దొంగిలించి, తరలించేందుకు దొంగలు అనుసరిస్తున్న విధానాలపై అవగాహన ఏర్పరుచుకున్నారు. పోలీస్‌ లేదా కోస్ట్‌గార్డు అడ్డుకుంటే ఎదుర్కోవడానికి వారు వినియోగించే ఆయుధాలు, అవి వారికి సమకూరుతున్న పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో చమురు దొంగతనాలకు పాల్పడ్డ పాత నిందితుల కదలికలపై నిఘా ఉంచాలని డీజీపీ ఎస్‌పిలను ఆదేశించారు. ఆయన ఆదేశాలమేరకు ఎస్‌పిలు యంత్రాంగాన్ని సమాయత్తపరిచారు.

చమురు లీకై తే...
చమురు తరలించే రెండు ఓడలు ప్రమాదవశాత్తు లేదా దాడుల నేపథ్యంలో సముద్రంలో ఢీకొట్టుకుంటే లేదా లీకేజీలు ఏర్పడితే జరిగే నష్టం సముద్ర జీవుల పట్ల ప్రాణసంకటమని కమాండెంట్‌ వేణుమాధవ్‌ తెలిపారు. లీకై న చమురు ఆక్సిజన్‌ను నీటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని అన్నారు. తద్వారా జీవాలు ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు. చమురు నీటి నుంచి వేరు చేసే ప్రక్రియకు భారీ జల, వాయు మార్గ సంపత్తితో పాటు అధునాతన పరికర సామర్థ్యాన్ని కోస్టుగార్డు వినియోగించింది. 97 మంది అధికారులు సిబ్బంది మాక్‌ డ్రిల్‌లో పాల్గొన్నారు. వీరిలో 85 మంది సైలర్లు, 12 మంది అధికారులు ఉన్నారు.

రెండు విధాలుగా శుద్ది...
చోరీలు జరిగినపుడు, ప్రమాదవశాత్తూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, లేదా మరే కారణం వల్లనైనా భారీ పడవల నుంచి సముద్రంలోకి నేరుగా చమురు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చమురు తెట్లు ఏర్పడ్డ సముద్ర జలాల శుద్ది ప్రక్రియను రెండు విధాలుగా చేపడతారు. ఆ రెండు విధానాలను మాక్‌ డ్రిల్‌లో ప్రదర్శించారు. చమురు తెట్టుకట్టిన ప్రాంతాన్ని చుట్టుముట్టి టీసీ–3 రసాయనాన్ని చల్లడం, ఈ క్రమంలో జరిగే రసాయనిక చర్య వల్ల ఆ చమురు సముద్రగర్భంలోకి చేరుతుంది. ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఆ వ్యర్థాన్ని తిరిగి సేకరిస్తారు. అంతకుముందు నీటిలో చమురు వ్యాప్తిని నిలువరించేందుకు ‘బూమ్‌’ను ప్రయోగించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓడలు భారీ ట్యూబ్‌ వంటి ప్రత్యేక నిర్మాణంతో రూపొందించబడ్డ ఈ బూమ్‌ను చమురు తెట్టు చుట్టూ వృత్తాకారంగా ఏర్పాటు చేస్తాయి. అది దాటి తెట్టు వ్యాపించే ప్రసక్తే లేదు. ఇది కాక రెండవ విధానం భారీ బ్రష్‌ ద్వారా తెట్టును సేకరించడం. ఇది తక్కువ మొత్తంలో ఏర్పడ్డ చమురు తెట్లు తొలగించేందుకు అనుకూలం. ఈ రెండు ప్రక్రియలు జరుగుతున్నంత సేపూ నిశిత పరిశీలన, పర్యవేక్షణ కోసం ‘ఏరియల్‌ రెక్కీ’ నిర్వహించారు.

అద్భుత పనితీరు...
సముద్ర జలాల్లో అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడంతో నేర నియంత్రణను సాకారం చేసే క్రమంలో అన్ని వేళల్లోనూ అప్రమత్తంగా ఉంటాం. మాక్‌డ్రిల్‌ పర్యావరణంపై మా బాధ్యత, చర్యలను ప్రతిబింబించే విధుల సమాహారం. ఈ ప్రదర్శన భారీ స్థాయిలో చేపట్టడంలో భద్రతా అంశాలను ప్రతిబింబించడం కూడా ఓ ఉద్దేశం. ఆ లక్ష్యంతోనే మాక్‌డ్రిల్‌కు గతంలో ఏనాడు వినియోగించని భారీ సంపత్తిని తీసుకొచ్చాం. అత్యంత సమర్థత ఉన్న సాంకేతికతనూ వినియోగించి ఎక్సర్‌సైజ్‌ నిర్వహించాం. ముఖ్యంగా చమురు దొంగతనాలను నిలువరించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేసి అమలు చేస్తున్నాం– జి.వేణుమాధవ్‌, కమాండెంట్‌ ఆఫీసర్‌,

కాకినాడ కోస్టుగార్డు స్టేషన్‌ చమురు చోరీల నివారణకు కార్యాచరణ
చమురు చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. రాష్ట్ర డీజీపీ ఆదేశాలు, డీఐజీ దిశానిర్దేశంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. తాజా సమావేశంలో చమురు చోరీల నివారణ, భద్రత దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చమురు, గ్యాస్‌ సంస్థలకు భద్రత కల్పించడం, పైప్‌లైన్ల నుంచి పెట్రోలు, డీజిల్‌ దొంగిలిస్తున్న దొంగలను పట్టుకోవడం సంబంధిత దోపిడీలను అరికట్టడం ఇందులో కీలక అంశాలు. మైరెన్‌, కోస్ట్‌గార్డు పరస్పర సహకారంతో చమురు చోరీల నివారణ చర్యలకు సిద్దమయ్యాం. త్వరలో ప్రత్యేక కార్యాచరణ, బృంద నియామకాన్ని ప్రకటిస్తాం. 
– ఎస్‌.సతీష్‌కుమార్‌, ఎస్‌పి, కాకినాడ జిల్లా

ప్రత్యేక భద్రత ఏర్పాటు
సముద్రంలో చోరీలు ముఖ్యంగా చమురు దొంగతనాలు నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా తీర ప్రాంత వాసులతో మమేకమవుతూ దొంగల కార్యకలాపాలు నిలువరించే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఆయిల్‌ రిగ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఫాస్ట్‌ ఇంటర్‌సెప్ట్‌ బోట్లు అందుబాటులో ఉన్నా నిపుపయోగంగా ఉండటం వల్ల మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవడంలో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఇప్పటికే విన్నవించాం. 
– సుమంత్‌, మైరెన్‌ సీఐ

Advertisement

What’s your opinion

Advertisement