
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వేళ విద్యార్థులకు గందరగోళ పరిస్థితి
కౌన్సెలింగ్ షెడ్యూల్ కంటే ముందు రావాల్సిన ప్రభుత్వ అనుమతులు
ఫీజులు, సీట్ల అనుమతులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం
సాయంత్రం తీరిగ్గా జీవోలు విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ
కౌన్సెలింగ్ వెబ్‌సైట్.. జీవోల్లో పరస్పర విరుద్ధంగా ఫీజుల వివరాలు
ప్రభుత్వ వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు రూ.45,000కు పెంపు
కొత్తగా సెల్ఫ్ సపోర్టు పేరిట సీట్లు.. ఫీజులు రూ.75 వేల నుంచి రూ.1.25 లక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రవేశాల వేళ గందరగోళాన్ని సృష్టిస్తోంది. డిగ్రీ నుంచి ఇంజనీరింగ్ విద్య వరకు ప్రవేశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు డిగ్రీ విద్యా విధానంపై స్పష్టత ఇవ్వని కూటమి సర్కార్, 2025–26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ ప్రవేశాల విషయంలో కోర్సుల ఫీజులు, సీట్లకు అనుమతులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వడంలో దోబూచులాడింది. వాస్తవానికి ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాలు నిర్వహించే క్రమంలో కౌన్సెలింగ్‌కు ముందే కళాశాలల ఫీజులు, వాటి సీట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలి.
తద్వారా ప్రజా క్షేత్రంలో సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి వీలుంటుంది. కానీ, కూటమి ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలు దిగజారినట్టే పరిపాలనా ప్రమాణాలను కూడా గాలికొదిలేసింది. ఏపీ ఈఏసీ సెట్ ద్వారా ఇంజనీరింగ్ (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్‌లో భాగంగా 13వ తేదీ (ఆదివారం) నుంచి వెబ్ ఆప్షన్ల నమోదుకు వీలుకల్పించింది. అయితే ఆదివారం ఉదయం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదు. దీంతో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించడంపై కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సాంకేతిక విద్యా మండలి ఆలోచనలో పడింది.
ఉదయం నుంచి మల్లగుల్లాలు పడిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారిక ఉత్తర్వులు వారికి చేరకుండానే వెబ్ ఆప్షన్లను మధ్యాహ్నం నుంచి ప్రారంభించింది. ఇక్కడ అధికారిక ఉత్తర్వులు చేరే వరకు వేచి చూడాల్సి ఉండగా వెబ్ ఆప్షన్లు వాయిదా వేస్తే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని భావించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తీరిగ్గా సాయంత్రం అప్‌లోడ్
కౌన్సెలింగ్‌కు ముందు రావాల్సిన ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు, సీట్ల వివరాలు వెబ్ ఆప్షన్లు ప్రారంభమైన తరువాత, అంటే ఆదివారం సాయంత్రం 8 గంటల అనంతరం ప్రభుత్వ జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. ఇందులో 212 ప్రైవేటు అన్ ఎయిడెడ్ సాంకేతిక విద్యా సంస్థలకు, 24 ప్రభుత్వ వర్సిటీ ఇంజనీరింగ్, వాటి అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. వీటిల్లో ప్రైవేటు కాలేజీల్లో సగటున ఫీజు రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ.1.05 లక్షలుగా నిర్ణయించారు.
వెబ్‌సైట్‌లో ఫీజులు.. సీట్ల వివరాలు
ప్రభుత్వ అనుమతులతో ఉత్తర్వులు వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో కళాశాలల వారీగా ఫీజుల వివరాలు, సీట్ల సంఖ్యను పొందుపరుస్తారు. ఇక్కడ ఎక్కడా అధికారిక ఉత్తర్వులు బయట పెట్టకుండానే వెబ్‌సైట్‌లో ఫీజులు, సీట్ల సమాచారాన్ని బహిరంగపరిచారు. కళాశాలలకు ఫీజులు నిర్ణయించే అధికారం ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్కు మాత్రమే ఉంటుంది.
కమిషన్ నిర్ణయించిన మేరకు ఫీజులు ఉంచారా? ముందుగా ఫీజుల వివరాలు అప్‌లోడ్ చేసి తీరిగ్గా కమిషన్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఫీజు వివరాలకు.. ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ఇచ్చిన జీవోలోని ఫీజులకు వ్యత్యాసం ఉంది. అంటే ముందుగా ఫీజు వివరాలు, సీట్ల అనుమతులు తెలపకుండానే కౌన్సెలింగ్‌కు వెళ్లినట్టు స్పష్టం అవుతోంది.
ఉదాహరణకు నరసరావుపేటలోని ఏఎం రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వార్షిక ఫీజు రూ.43 వేలుగా కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో ఉంటే.. జీవోలో మాత్రం రూ.40 వేలుగా చూపించారు. ఇలా చాలా కళాశాలల ఫీజులు వెబ్‌సైట్‌లో అధికంగాను.. జీవోల్లో తక్కువగా కనిపించాయి. ప్రభుత్వ విభాగాల్లో ఇలా పరస్పర విరుద్ధంగా ఫీజులు ఉండటం విద్యార్థులను కలవరపెడుతోంది.
వర్సిటీలను నడపలేక ఫీజుల పెంపు
చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇచ్చే ప్రాధాన్యం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఇవ్వట్లేదనేది మరోసారి స్పష్టమైంది. ప్రభుత్వ యూనివర్సిటీలను ఆర్థికంగా, అకడమిక్స్‌గా బలోపేతం చేయడంపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ వర్సిటీల్లో ఇంజనీరింగ్ విద్య కోర్సుల ఫీజులను పెంచింది. రూ.18 వేలు–రూ.30 వేలుగా ఉండే ఫీజులను రూ.45,000గా ప్రభుత్వ వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులను ఖరారు చేసింది.
వీటితో పాటు సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్ కింద రూ.లక్షల ఫీజులను పెట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయకుండా సీట్లు కేటాయిస్తోంది. ఈ ఏడాది కొత్తగా జేఎన్‌టీయూ కాకినాడలో సీఎస్‌ఎం (ఏఐ–ఎంఎల్)కు రూ.75 వేలు, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో సీఎస్‌ఈకి రూ.1.62లక్షలు, జేఎన్‌టీయూ అనంతపురంలో ఈఎస్‌ఈకి రూ.1.50 లక్షలు, ఈసీఈకి రూ.1.25 లక్షలు ఫీజులు విధించింది. ఆయా వర్సిటీల్లో ఈ ఏడాది నుంచి సెల్ఫ్ సపోర్టు సీట్లను కన్వీనర్ కోటా (ఫీజు రీయింబర్స్‌మెంట్) ద్వారా భర్తీ చేయనుంది.
డీమ్డ్ వర్సిటీకి ఫీజు ఖరారా?
విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల గతేడాది యూజీసీ నుంచి ‘డీమ్డ్’ విశ్వవిద్యాలయం హోదా పొందింది. ఆ వర్సిటీ సొంత కరిక్యులమ్, సొంత ఫీజులు, సొంత అజెండాపై నిర్వహణ ఉంటుంది. అయితే, తాజాగా ఈ కళాశాలకు కూడా 2025–26కి రూ.1.05లక్షల ఫీజును నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. అసలు ప్రభుత్వ చట్ట పరిధిలోకి రాని ఓ డీమ్డ్ వర్సిటీకి ఫీజు ఎలా నిర్ణయిస్తారనేది ఇక్కడి ప్రశ్న. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య పనితీరుకు ఇది అద్దం పడుతోంది.