
కర్నూలు జిల్లాకు చెందిన ఎం.నాగజ్యోతికి డీఈడీ, బీఎస్సీ, బీఈడీ అర్హత ఉండడంతో డీఎస్సీలో ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్), టీజీటీ (మ్యాథ్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీలో ఆమె ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) పోస్టుకు ఎంపికయ్యారు. కానీ, పరీక్షలకు ముందే తొలి ప్రాధాన్యం ఎస్జీటీకే ఇవ్వడంతో ఆమె ఉన్నతమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోవాల్సి వస్తోంది.
కర్నూలు పట్టణానికి చెందిన కురువ నటరాజ్ డీఎడ్, బీఈడీ చేశారు. ప్రస్తుత డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుతోపాటు ఎస్జీటీ పోస్టుకు ఎంపికయ్యారు. ఆయన కూడా మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ పోస్టుల ప్రాధాన్యంలో మొదట ఎస్జీటీకి ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అవకాశం లేకుండాపోయింది.
చిత్తూరు జిల్లాకు చెందిన పి.అనిత డీఎడ్, బీఎస్సీ, బీఈడీ పూర్తిచేశారు. ఆమె డీఎస్సీలో ఎస్జీటీ విభాగంలో జిల్లాస్థాయి 89వ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)లో 10వ ర్యాంకు పొందారు. కానీ, పోస్టుల ప్రయారిటీలో మొదట ఎస్జీటీకే ఆప్షన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోనున్నారు.
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో అత్యుత్తమ మార్కులు సాధించినవారి ఆనందాన్ని... కూటమి సర్కారు తెచ్చిన ‘ముందస్తు ఆప్షన్ నిబంధన’ ఆవిరి చేస్తోంది. పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని చెప్పడం... అధికారులు ఇప్పుడు అదే ‘ఫైనల్’ అని ప్రకటించడంతో మెరిట్ అభ్యర్థులకు శాపంగా మారింది.
పరీక్ష పాసై మెరిట్ లిస్టులో ఉండి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్‌గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. ఇలా రాష్ట్రంలో 10వేల మందికి పైగా రెండు నుంచి నాలుగు ఉద్యోగాలు సాధించినా... ప్రాధాన్యత క్రమంలో మొదట ఇచ్చిన ఎస్జీటీ పోస్టుకే పరిమితమయ్యే పరిస్థితి తలెత్తింది.
చేజారిపోతున్న ‘ఉన్నత’ అవకాశం
ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యత క్రమం కూడా తెలియజేయాలని నిబంధన పెట్టారు. అభ్యర్థులు ఎన్ని పోస్టులకు ఎంపికైనా, మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్న ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుందని, మిగిలిన పోస్టులు బ్లాక్ అవుతాయని అధికారులు ప్రకటించారు.
ఎడిట్‌కు అవకాశం ఇవ్వని విద్యాశాఖ
తెలియక పోస్టుల ప్రాధాన్యత క్రమం తప్పుగా ఇచ్చామని, ఎడిట్ అవకాశం కల్పించాలని పరీక్షకు ముందే డీఎస్సీ నిర్వాహక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోలేదని అభ్యర్థులు వాపోతున్నారు. పోస్టుల ప్రాధాన్యత ఎడిట్ అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
అభ్యర్థులకు జీవితాంతం వేదనే...
» స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పెట్టిన ముందస్తు ఆప్షన్ నిబంధన వల్ల ఎస్జీటీలో చేరినవారు తీవ్రంగా నష్టపోతారు.
» ఎస్జీటీ పోస్టులో చేరినవారు 10 నుంచి 15 సంవత్సరాల సర్వీసు పూర్తయినా స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి వస్తుందన్న గ్యారెంటీ లేదు.
» అదే టీజీటీ పోస్టులో చేరితే ఐదేళ్లలో పీజీటీ, మరో పదేళ్లలో ప్రిన్సిపాల్ అయ్యే అవకాశం ఉంటుంది.
» ప్రభుత్వం పెట్టిన ఒక్క నిబంధనతో ఇప్పుడు మెరిట్‌లో ముందున్న దాదాపు 10వేల మంది అభ్యర్థులు జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడింది.