వర్సిటీలపై వేటు పెత్తనం | Coalition government will destroy the education system | Sakshi
Sakshi News home page

వర్సిటీలపై వేటు పెత్తనం

Sep 1 2025 6:16 AM | Updated on Sep 1 2025 6:16 AM

Coalition government will destroy the education system

విద్యార్థుల జీవితం కార్పొరేట్‌ గుప్పిట్లో..  

వర్సిటీల భవితవ్యం అగమ్య గోచరం 

ప్రశ్నపత్రాల మూల్యాంకన, ఫలితాల వెల్లడిపై టెండర్లు పిలుస్తున్న వర్సిటీలు 

ఎస్వీయూలో కార్పొరేట్‌ సంస్థలకు ఆహ్వనం పలకనున్న అధికారులు

వర్సిటీలపై ఇక ప్రైవేటు పెత్తనం తప్పదు. విద్యా సంస్థలను బహుళజాతి కంపెనీల చేతిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రక్షాళన పేరుతో వర్సిటీలను ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు కుటిల యత్నం బహిర్గతమవుతోంది. ఇప్పటికే టెండర్లను పిలిచేందుకు వర్సిటీలను సిద్ధం చేశారు. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సమాయత్తం అవుతున్నారు. విద్యార్థుల జీవితాలు కార్పొరేట్‌ గుప్పిట్లోకి వెళ్లనుండడంతోవిద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

తిరుపతి సిటీ : యూనివర్సిటీల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న నేపథ్యంలో వర్సిటీలో ప్రైవేటు సంస్థల ఆధిపత్యాన్ని ప్రోత్సహించేందుకు మరో అడుగు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ విద్యార్థుల అడ్మిషన్ల వివరాలతో పాటు విద్యార్థులకు నిర్వహించే సెమిస్టర్‌ పరీక్షలు, ప్రశ్నపత్రాల మూల్యాంకనంతో పాటు, ఫలితాల వెల్లడి ఇక ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఓ పేరొందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సూచనల మేరకు ఎస్వీయూ అధికారులు టెండర్లు పిలవనున్నారు. దీంతో ఉన్నత చదువులను అభ్యసించే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారనుంది. విద్యార్థుల భవితవ్యం పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల అదీనంలోకి వెళ్లనుంది.  

పేదలకు ఉన్నత విద్య దూరం  
వర్సిటీలలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తుంటారు. కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూ­టమి ప్రభుత్వం ఉన్నత విద్యను దూరం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎస్వీయూ లాంటి ప్రధాన వర్సిటీలో పలు కోర్సులను రద్ధు చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఆర్ట్స్‌ విభాగంలో పదుల సంఖ్యలో కోర్సులను విలీనం పేరుతో రద్ధు చేసిన అధికారులు, అకడమిక్‌ కన్సల్టెంట్లను సైతం తొలగించారు. దీంతో పెద్ద ఎత్తున తాత్కాలిక అధ్యాపకులు, విద్యార్థుల నిరసన వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎస్వీయూలో పేద విద్యార్థులు చదివే కోర్సులకు చరమగీతం పాడిన వర్సిటీ అధికారులు ప్రస్తుతం వర్సిటీని ప్రైవేటీకరణ చేయడం దారుణమని మేధావులు, విద్యార్థి సంఘాలు 
మండిపడుతున్నారు.

మొక్కుబడిగా టెండర్లు 
ఎగ్జామినేషన్‌ సెక్షన్‌ ప్రక్షాళన చేస్తున్నామంటూ వర్సిటీ అధికారులు ప్రైవేటు సంస్థలకు టెండర్లు ఆహా్వనించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే ఉద్దేశంతో ఆ సంస్థ సూచించిన ఆదేశాలతో మొక్కుబడిగా టెండర్లు  పిలిచి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న బహుళ జాతి కంపెనీ చేతుల్లో పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ నుంచి డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల పరీక్షల  నిర్వహణ, పేపర్ల  మూల్యాంకన, ఫలితాల వెల్లడిని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు నిర్ణయం తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు త్వరలో టెండర్లు  పిలవనున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఊరుకోం 
వర్సిటీని ప్రైవేటు పరం చేసే విధంగా అధికారులు నిర్ణ­యాలు తీసుకుంటే అడ్డుకుంటాం. పరీక్షల విభాగాన్ని టీసీఎస్‌ కంపెనీ లాంటి ప్రైవేటు సంస్థల సూచనలు పాటిస్తూ టెండర్లకు ఆహా్వనిస్తే అడ్డుకుని తీరుతాం. పేద బడుగు బలహీన వర్గాల ఉన్నత విద్యను సైతం కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తే ఉద్యమిస్తాం.  – అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ 
వర్సిటీల కోర్డినేటర్, తిరుపతి  

తిరుగుబాటు తప్పదు
ఎస్వీయూ పరీక్షల విభాగా న్ని ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థుల భవితవ్వం అంధకారమే. వర్సిటీ ప్రైవేటు పరం అయినట్టే. ఎంతో ప్రతిష్టాత్మకమైన వర్సిటీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం దారుణం. పరీక్షల నియంత్రణ, మూల్యాంకన, ఫలితాల వెల్లడిని ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి పెడితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.  –డాక్టర్‌ ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపా«ధ్యక్షులు, తిరుపతి  

ప్రైవేటుకు అప్పగించేందుకే ..  
ఎస్వీయూలో పరీక్షల విభాగం అధికారుల పనితీరు దారుణంగా ఉంది. వర్సిటీని ప్రక్షాళన  చేయా­లని భావిస్తున్న నేపథ్యంలో ప్రైవేటీకరణపై దృష్టి సారించడం దారుణం. మూల్యాంకనతో పాటు పరీక్షా ఫలితాల వెల్లడి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు అధికారులు టెండర్లు పిలిచే ప్రయత్నం చేయడాన్ని అడ్డుకుంటాం. – శివశంకర్‌ నాయక్, జీఎస్‌ఎన్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తిరుపతి  

విద్యార్థుల ప్రతిఘటన తప్పదు 
ఎస్వీయూను ప్రైవేటీకరణ చేస్తే ఐక్య విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ప్రతిఘటిస్తాం. పరీక్షల విభాగాన్ని పట్టిష్టం చేయాల్సిన  అధికారులు చేతు­లెత్తేయడం దారుణం. పరీక్షల విభాగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఎస్వీయూ అధికారులు టెండర్లు పిలిచే ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాం. పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. 
– ఆర్‌ ఆషా, పీడీఎస్‌ఓ జిల్లా కార్యదర్శి, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement