
సత్యాన్వేషణ స్పృహతో స్వతంత్రంగా, నిర్భీతితో, ఎరుకలో జీవించడమే మనిషి నిరంతర కర్తవ్యమని చెప్పి, అలా జీవించిన మహా మనీషి, తాత్వికుడు, విద్యా విప్లవకారుడు ఎం.శివరామ్ (85). పూర్తి పేరు మంచిరెడ్డి శివరామ్. పాతికేళ్లుగా విజయవాడ ప్రాంతంలో ‘పిల్లలు కేంద్రంగా విద్య’ అనే భావనను తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో, పాఠశాల యాజమాన్యాల్లో పాదుకొల్పడానికి అవిశ్రాంత కృషి చేసిన శివరామ్, ఆగస్టు 20న తుదిశ్వాస విడిచారు. ఆయన అవివాహితులు.
పుట్టింది అనంతపురం జిల్లాలో. 20 ఏళ్లుగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అరవింద స్కూల్‌లో మకాం. ఎటువెళ్లినా తిరిగి అక్కడికే చేరుకునేవారు. ప్రిన్సిపాల్ ఇంద్రాణి ఆత్మీయ సంరక్షణలో పిల్లల్లో ఒక పిల్లాడిలా గడిపేవారు. ‘రాజీ జీవితాన్ని’ ఏవగించుకునేవారు. శివరామ్ విఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి (జేకే) సహచరుడు. కొంతకాలం రిషి వ్యాలీ స్కూల్‌లో పనిచేశారు.
వ్యక్తి వికాసం వెదజల్లే ప్రేమపూర్వకమైన ప్రజ్ఞ ద్వారానే మొత్తంగా సామాజిక పరివర్తన సాధ్యమనే భావన ఆయన సాన్నిహిత్యాన్నెరిగిన వారికి అనుక్షణం అర్థమవుతూ వుండేది. కమ్యూనిస్టు పంథా నుంచి ప్రేమతో జేకే చూపిన వెలుగుబాట వరకు ఎన్నెన్నో మలుపులు, మజిలీలు ఆయన జీవనయానంలో తారసపడతాయి. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమం వేళ్లూనుకుంటున్న నాటి నుంచి ఐక్య కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితుడై, పీడిత వర్గ రచయితగా, సాంస్కృతిక సేనానిగానూ ఉద్యమ ప్రగతికి కృషి చేశారు.
సంపన్న కుటుంబంలో జన్మించిన శివరామ్, తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదకంటా నిలబడ్డారు. నాయకుల మాటలకు-చేతలకు, సిద్ధాంతానికి-ఆచరణకు పొంతన లేకపోవడం.. వంటి పరిస్థితులన్నీ ఆయనలో మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ఎంతకాలం ఇలా ఏ నాయకుడో చెప్పిన పంథాలో పయనించడం, వాళ్లు అది కాదంటే మనను మార్చుకోవడం? స్వతంత్రంగా సత్యాన్వేషణ చేయలేమా? సమాజాన్ని అర్థం చేసుకోడానికి, సేవ చేయడానికి మరో మార్గం లేదా?.. వంటి అనంతమైన ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు అన్వేషిస్తూ దేశదిమ్మరి అయ్యారు. ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాలు, ప్రవచనాలు ప్రత్యక్షంగా వింటూ, అధ్యయనం చేస్తూ, ఆ వాతావరణంలో జీవిస్తూ అన్వేషణ కొనసాగించారు.
ఆ క్రమంలో జేకే పుస్తకం ఒకటి శివరామ్ కంటపడింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. అది మొదలుగా జేకే దేశదేశాల్లో నిర్వహిస్తున్న చర్చాగోష్ఠుల సారాంశంతో అచ్చయ్యే తాజా పుస్తకాలను ఔపోసన పట్టడంలో నిమగ్నమయ్యారు. చెరువు గట్టున ఏకాంతంలో జేకేని చదువుతూ, తనలోకి తాను చూసుకుంటూ.. ప్రపంచాన్ని సరికొత్త దృష్టితో అధ్యయనం చేశారు. అనంతరం జేకేని స్వయంగా కలుసుకోవడంతో శివరామ్ జీవన విధానమే మారిపోయింది. ఆ సాన్నిహిత్యం ఆయనను రిషి వ్యాలీలో కట్టిపడేసింది. జేకే ఖండాంతరాల్లో నిరంతరం మాట్లాడుతున్నపుడు రికార్డు చేసిన టేపులు రిషి వ్యాలీకి చేరేవి. వాటిని రాయించి, ముద్రించడంలో కచ్చితత్వం పాటించే విషయంలో శివరామ్ జాగ్రత్త వహించేవారు. అలా జేకేని దగ్గరగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోడానికి ఆయనకు అవకాశం దొరికింది.
రిషి వ్యాలీ మెయిన్ స్కూలు సంపన్నుల బిడ్డలకే పరిమితమవుతుండడం శివరామ్‌కు నచ్చలేదు. ఆ పరిసర ప్రాంతంలో గ్రామీణ పేదపిల్లలకు కూడా ‘సృజనాత్మక విద్య’ అందించాలని ప్రతిపాదించారు. ఆయన ఆధ్వర్యంలోనే రిషి వ్యాలీలో రూరల్ స్కూళ్లకు అంకురార్పణ జరిగింది. సహజంగా వికసిస్తూ, పిల్లలు సజీవంగా స్పందించడం రూరల్ స్యూళ్లలోనే సంతృప్తికరంగా సాధ్యమవుతోందని శివరామ్ అంటుండేవారు. ఎంత అద్భుతమైన వాతావరణంలో జీవిస్తున్నా ఎక్కువ కాలం ‘ఉన్నచోటనే ఉండిపోవటం’ ఆయనకు బొత్తిగా ఇష్టం లేని పని. ఐదారేళ్లకు అంతా పాతపడిపోతుందని శివరామ్ ప్రగాఢంగా భావించేవారు. రూరల్ స్కూల్స్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నప్పటికీ ఉన్నట్టుండి ‘ఇక్కడింకా ఎన్నాళ్లు?’ అనిపించిందాయనకు. అంతే.. లేడికి లేచించే పరుగన్నట్టు... జేకేకి నమస్కారం పెట్టి, జోలె చంకనేసుకొని రిషి వ్యాలీ నుంచి లోక సంచారానికి బయలుదేరారు శివరామ్.
బతుకు భయంతో గానుగెద్దు జీవితాలు ఈడ్చుతున్న జనాన్ని తేలికపరచాలనిపించిందో ఏమో.. అమృతభాండాగారాన్ని మనసులో నింపుకుని కాలికి బలపం కట్టారు. ఎన్నెన్ని మజిలీలో, ఎందరెందరికి పునరుజ్జీవాలో.. ఓహ్.. అదొక సజీవ జీవనగాథల అనంత సాగరం!
నెల్లూరుకు దగ్గరలోని పల్లెపాడులో గాంధీ ఆశ్రమాన్ని పునరుద్ధరించి ‘సృజన స్కూల్’ను విద్యావేత్త ఎలీనా వాట్స్‌తో కలిసి తేదకదీక్షతో నిర్వహించారు. ఇంగ్లండ్‌కు చెందిన ఎలీనా, శివరామ్ సృజన పిల్లలతో గడుపుతూ పొందిన అనుభవ పాఠాలు.. తెలుగునాట విద్యారంగంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాయి. సృజన స్కూల్ అనుభవాలు, అనుభూతులు అనేక రూపాల్లో రికార్డయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో సృజన అనుభవాలకు గుర్తింపు లభించింది. దాదాపు ఐదారేళ్ల పాటు సృజన స్కూల్ శివరామ్, ఎలీనాల ఆధ్వర్యంలో కొనసాగింది. ఎలీనా తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోవటం, శివరామ్ హైదరాబాద్ చేరటంతో ఆ స్కూల్ ఇతరుల చేతుల్లోకి వెళ్లింది.
నిశ్చలంగా ఒక స్కూలును నిరంతర పరిశీలన, పర్యవేక్షణతో నిర్వహించడం అవసరమే. కానీ, దాని పరిమితి దానికి వుంది. నాలుగ్గోడల మధ్య ‘బట్టీ చదువు’ల కింద నలిగిపోతున్న అశేష బాలలకు ఆ హింస నుంచి విముక్తి కల్పించడం కోసం శివరామ్ ఊరూరా తిరుగుతూ అంతులేని కృషి చేశారు. స్కూళ్లలో పిల్లలు నేర్చుకునే వాతావరణాన్ని నింపడానికి, పెద్దలకు తక్షణంలో జీవించడం ద్వారా జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడం రుచి చూపడానికి అనంత మనోశక్తితో, నిశ్చలంగా, నిశ్శబ్దంగా కడదాకా ఉద్యమించారు. ఆ ఉద్యమపథంలో విజయవాడ మజిలీ ఒక మైలురాయి.
24 ఏళ్ల క్రితం శివరామ్ గారితో ముఖాముఖి కూర్చొని, అనేక అంశాలపై గాఢంగా, లోతుగా చర్చించుకునే అవకాశం వచ్చివుండకపోతే నా జీవితం ఇప్పటికన్నా నిస్సందేహంగా వెలితిగా, అలజడిగా, అనారోగ్యంగా వుండేది. ఆయన కనిపెట్టిన ‘విద్యార్థి సృజన కుటీర్’ గనక అందుబాటులో లేకపోయుంటే మా పిల్లలు ఇప్పుడున్నంత సంతోషంగా వుండి వుండేవాళ్లు కాదు!
పిల్లలు వికసించే విద్య.. తక్షణంలో జీవించడమే - జీవితం. ఈ రెంటినీ నిరంతరం ఇతరులతో పంచుకోవడమనే ధ్యానాన్ని ముగించుకొని వెళ్లిపోయారు శివరామ్. ‘డేంజరస్‌గా జీవించాలి’ అనేవారు తరచూ. అన్నట్టే జీవించి చూపిన అమరజీవి శివరామ్ గారికి విద్యావిప్లవ జోహార్లు!
– పంతంగి రాంబాబు,
సీనియర్ జర్నలిస్ట్
8639738658