27న తిరుమలకు ముఖ్యమంత్రి జగన్‌

CM YS Jagan to Visit TTD Srivari Temple on 27th September - Sakshi

శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ, 28న సీఎం చేతుల మీదుగా పరకామణి భవనం ప్రారంభం: టీటీడీ ఈవో 

తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 27న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో శనివారం డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. 27వ తేదీ రాత్రి 7 గంటలకు సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారని తెలిపారు.

28వ తేదీ ఉదయం పరకామణి నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ భవనంలో కానుకల లెక్కింపును భక్తులు వీక్షించేందుకు రెండువైపులా అద్దాలు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి ఆలయానికి బంగారు తాపడం పనులకు సంబంధించిన విధి విధానాలపై అధ్యయనం చేస్తున్నారని.. వచ్చే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు.

శ్రీవాణి ట్రస్టు నిధులను ఆలయ నిర్మాణాలకు, పురాతన ఆలయాల పునరుద్ధరణకు మాత్రమే వినియోగిస్తున్నామని  ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ ట్రస్టుకు రూ.516 కోట్ల విరాళాలు అందాయని.. ఈ నిధులతో ఏపీ, తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలుండే ప్రాంతాల్లో 1,342 ఆలయాల నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. 502 ఆలయాల నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. 110 పురాతన ఆలయాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేశామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top