రాబోయే 24 గంటలు చాలా కీలకం.. వరద బాధితులకు ఏ లోటు రాకూడదు: సీఎం జగన్‌

CM YS Jagan Video Conference With Officials On AP Godavari Floods - Sakshi

సాక్షి, అమరావతి: గోదావరి వరదలు..సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఏరియల్‌సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారి నియమించారు. 

రాబోయే 24 గంటలు చాలా కీలకం.. హైఅలర్ట్‌గా ఉండాలని గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎం జగన్‌ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు‌. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షలో చర్చించారు. ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన సీనియర్‌ అధికారులతోనూ చర్చించిన సీఎం జగన్‌.. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్‌ అధికారిని నియమించాలని ఆదేశించారు.

ఏ జిల్లాకు ఎవరంటే..
సీఎం జగన్‌ ఆదేశాల మేరకు.. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు ప్రవీణ్‌కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌లను నియమించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనుంచి ఎలాంటి సహాయంకోసం కోరినా యుద్ధ ప్రాతిపదికిన వారికి  అందించేలా చూడాలని అన్ని విభాగాల సీఎస్‌లకు సహా అన్ని విభాగాల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంవో కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రేపుకూడా(శనివారం) గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉండడంతో.. లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని సూచించారాయన. 

వరద ప్రభావం గ్రామాలపై ఫోకస్‌
గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన పక్షంలో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇసుక బస్తాలు తదితర సామాగ్రిని సిద్ధం చేయాలని తెలిపారు. వీలైనన్ని ఇసుక బస్తాలను గండ్లుకు ఆస్కారం ఉన్న చోట్ల ముందస్తుగా ఉంచాలని సూచించారు. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

‘‘వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలి. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలి. వచ్చే 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలి. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల రూపాయలు ఇవ్వాలి. రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర సర్వీసులకోసం, పరిస్థితిని సమీక్షించేందుకు ఆ హెలికాప్టర్లను వినియోగించుకోండి. గ్రామాల్లో పారిశుధ్య సమస్యరాకుండా, తాగునీరు కలుషితం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.  అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలి. పాముకాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్యకేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలి. వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలి. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సెల్‌టవర్లకు డీజీల్‌ సరఫరాచేసి..  నిరంతరం అవి పనిచేసేలా చూడండి’’ అని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇక్కడ చదవండి: సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే.. ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top