మహనీయులకు మరణం ఉండదు.. వైఎస్సార్‌ బిడ్డగా మరింత మంచి చేస్తా: సీఎం జగన్‌

CM YS Jagan Dynamic Speech At Chimakurthy Public Meeting - Sakshi

సాక్షి, ప్రకాశం: మంచి చేస్తే మనిషికి మరణం ఉండదని, ప్రతీ గుండెలోనూ సజీవంగా నిలిచే ఉంటారనడానికి నిదర్శనం ఇవాళ జరిగిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమమే అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చీమకుర్తిలో మహానేత వైఎస్సార్‌, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ అనంతరం.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

పేదల సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వైఎస్సార్‌. రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్‌‌, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ఆరోగ్యం.. ఇలా ఎంతో మంచి చేశారాయన. ఆయన ఒక అడుగు వేస్తే.. వైఎస్సార్‌ బిడ్డగా తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్‌ మరోసారి వేదిక సాక్షిగా ప్రకటించారు. ఇచ్చినమాట ప్రకారం.. 95 శాతం మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చామని, దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు.  

మహానేతతో పాటు ఆయనతో అడుగులు వేసిన నేత బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహం కూడా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్న సీఎం జగన్‌.. వచ్చే ఏప్రిల్‌ 14న విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ ఉంటుందని ప్రకటించారు. గాంధీ, అంబేద్కర్‌, పూలే, అల్లూరి, ప్రకాశం, మహానేత వైఎస్సార్‌.. ఇలా మహనీయులను కలకాలం ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వీళ్లకు భౌతికంగా మరణం ఉన్నా.. వీళ్లు చేసిన మంచికి, భావాలకు మరణం ఉండదు అనేది వాస్తవమని సీఎం జగన్‌ తెలిపారు.

ఇచ్చిన మాట ప్రకారం.. చిన్నచిన్న పరిశ్రమలకు మేలు జరిగేలా నిర్ణయాలు అమలు చేయబోతున్నామని సీఎం జగన్‌ చీమకుర్తి సభా వేదికగా ప్రకటించారు. చిన్న గ్రానైట్‌ పరిశ్రమలకు కరెంట్‌ ఛార్జీల్లో రూ.2 తగ్గింపు ఉంటుందన్న సీఎం జగన్‌ ప్రకటించారు. గ్రానైట్‌ పరిశ్రమకు కొత్త స్లాబ్‌ సిస్టమ్‌ తీసుకురాబోతున్నట్లు తెలిపారాయన.  జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ కోరినట్లు.. ఒంగోలులో శిథిలావస్థలో ఉన్న కొత్త జిల్లా పరిషత్‌ కార్యాలయం కోసం రూ. 20 కోట్ల మంజూరు చేయడంతో పాటు తుళ్లూరు మండలంలోని శివరాంపురంలో ఉన్న మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్‌ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్‌గా  మారుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేస్తున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. 

ఇదీ చదవండి: సంక్షేమం తలుపు తడుతోంది

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top