నేడు ‘వైఎస్సార్‌ బీమా’ ప్రారంభం

CM Jagan will launch YSR Bima scheme with new guidelines on 1st July - Sakshi

కొత్త మార్గదర్శకాల ప్రకారం అమలు

రూ.1,133 కోట్లతో పేదలకు ఉచిత బీమా రక్షణ

సాక్షి, అమరావతి: నూతన మార్గదర్శకాలతో కూడిన వైఎస్సార్‌ బీమా పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం ప్రారంభించనున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే ఈ పథకం కింద కుటుంబ పోషకులు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా పరిహారం చెల్లిస్తారు. 18 – 50 ఏళ్ల లోపు వారు సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా లక్ష రూపాయలు చెల్లిస్తుంది. 18 – 70 ఏళ్ల వయసువారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తారు. అర్హత ఉన్న వారి తరఫున ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లిస్తుంది. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకునేందుకు 2021–22కిగాను రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.1,133  కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఉచిత బీమా రక్షణ కల్పిస్తోంది. నాలుగు రోజుల క్రితమే బీమా పాలసీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు
గతంలో సెర్ప్‌ విభాగం నోడల్‌ ఏజెన్సీగా ఉండగా తాజాగా గ్రామ/వార్డు సచివాలయ విభాగాన్ని నోడల్‌ ఏజెన్సీగా నిర్ణయించారు. అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత వివరాలను సచివాలయాల్లోనూ తెలుసుకోవచ్చు. 2020 ఏప్రిల్‌ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ బీమా పథకం నుంచి తప్పుకున్నప్పటికీ పేదలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా కింద రూ.765 కోట్లు వ్యయం చేసింది. బ్యాంకుల్లో వివరాలు నమోదు కాని 12 వేల మందికిపైగా మృతుల కుటుంబాలకు కూడా మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వమే రూ.254.72 కోట్లు పరిహారం చెల్లించింది. బీమా నమోదు, క్లెయిముల చెల్లింపులకు సంబంధించి 155214 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top