నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు నేడు సీఎం శంకుస్థాపన

CM Jagan Laying Foundation Stone For Four Fishing Harbors - Sakshi

తొలిదశలో రూ.1,510 కోట్లతో నాలుగు ప్రాంతాల్లో నిర్మాణం

త్వరలో మరో నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు 

తొలిదశలో 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి నేడు ముఖ్యమంత్రి శ్రీకారం

సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్‌ హార్బర్లకు ముఖ్యమంత్రి నేడు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేస్తారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

పాదయాత్ర హామీ మేరకు...
తన సుదీర్ఘ పాదయాత్ర సమయంలో మత్స్యకారుల సమస్యలను స్వయంగా పరిశీలించిన సీఎం జగన్‌ వారి ఇబ్బందులను తొలగించేందుకు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలిదశలో రూ.1,510 కోట్లతో నాలుగు ఫిషింగ్‌ హార్బర్లను రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా డిసెంబర్‌ రెండో వారంలో ఖరారు కానున్నాయి. రెండోదశలో ప్రారంభమయ్యే మరో నాలుగు ఫిషింగ్‌ హార్బర్లు శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఏర్పాటు కానున్నాయి. మొత్తం 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్లు వెచ్చిస్తోంది.

నియోజకవర్గానికో ఆక్వా హబ్‌
వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం, పౌష్టికాహార భద్రతలో భాగంగా రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఆక్వాహబ్‌ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రూ.225 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలిదశలో భాగంగా 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు సీఎం జగన్‌ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. లైవ్‌ ఫిష్, తాజా చేపలు, డ్రై చేపలు, ప్రాసెస్‌ చేసిన చేపలు, రొయ్యలు, పీతలు ఇతర మత్స్య ఉత్పత్తులు వీటిల్లో లభిస్తాయి. మత్స్య, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ హబ్‌లను జనతా బజార్లతో అనుసంధానం చేయనున్నారు. ఆక్వా రైతుల సొసైటీలు ఈ హబ్‌లను నిర్వహిస్తాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top