పారిశ్రామిక రంగంపై స్పెషల్‌ ఫోకస్‌: సీఎం జగన్‌ | CM Jagan Lay Foundation Stone For New Industries | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక రంగంపై స్పెషల్‌ ఫోకస్‌: సీఎం జగన్‌

Published Wed, Nov 29 2023 10:37 AM | Last Updated on Wed, Nov 29 2023 2:58 PM

CM Jagan Lay Foundation Stone For New Industries - Sakshi

సాక్షి, అమరావతి: రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి కలగనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రూ.402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్‌, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో సిగాచి ఇండస్ట్రీస్ గ్రీన్ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో-ఇథనాల్ తయారీ యూనిట్లను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోంది. కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. 386 ఎంఓయూలు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌లో చేసుకున్నాం. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నాం. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ నెలకొల్పేలా ప్రతినెలా సమీక్ష చేస్తూ పురోగతికోసం చర్యలు తీసుకున్నాం. 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభించాయి. 94 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రారంభదశలో ఉన్నాయి.

సీఎస్‌ గారి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసంగా రెండు సమీక్షా సమావేశాలు వీటిపై జరుగుతున్నాయి. వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయి. ప్రతి అడుగులోనూ కలెక్టర్లు చేయిపట్టి నడిపించాలి. ఈనాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. 69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో ఎప్పుడూ చూడని అడుగులు వేశాం. కోవిడ్‌ సమయంలోకూడా కుప్పకూలిపోకుండా వారికి చేయూత నిచ్చాం.

1.88 లక్షల ఎంఎస్‌ఎంఈలు కొత్తగా వచ్చాయి. 12.62 లక్షల ఉద్యోగాలు వీటిద్వారా వచ్చాయి. మనం అందరం కలిసికట్టుగా ఈ బాధ్యతను తీసుకున్నాం కాబట్టే ఇది సాకారం అయ్యింది. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి కేవలం మనం ఫోన్‌కాల్‌దూరంలో ఉన్నాం. వారిపట్ల సానుకూలతతో ఇదే పద్ధతిలో ఉండాలి. దేవుడి దయతో మనం ఇవాళ మంచి కార్యక్రమాన్ని చేశాం. 9 ప్రాజెక్టుల్లో 3 ప్రారంభిస్తున్నాం, మిగతా ఆరు పనులు ప్రారంభిస్తున్నాం. దాదాపు 1100 కోట్ల పెట్టుబడి, 21 వేలమందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. పత్తికొండకు నేను వెళ్లినప్పుడు అక్కడ పరిశ్రమ ఏర్పాటుచేస్తామని చెప్పాం. ఈ మేరకు ఇవాళ ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపనచేస్తున్నాం. అధికారులు మంచి కృషిచేశారు. అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నవారందరికీ కూడా ఆల్‌ ది బెస్ట్‌. ఎంఎస్‌ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్‌లు అందించనున్నాం.
చదవండి: క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement