బాబు పర్యటనలో తెలుగు దేశం నేతల మధ్య బట్టబయలైన వర్గ విభేదాలు
పార్టీ పెద్దల జోక్యంతో సుగవాసికి పిలుపు
రాయచోటి : రాయచోటి టీడీపీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు సీఎం పర్యటనలో మరోమారు భంగపాటుకు గురయ్యారు. జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబును ఆహ్వానించడం, ఇతర కార్యక్రమాలలో పాల్గొనేందుకు పిలుపు లేకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గత ఫిబ్రవరి ఒకటో తేదీన సీఎం సంబేపల్లి మండల పర్యటనలోనూ సుగవాసికి ఆహ్వానం అందలేదు.
రెండో పర్యాయం నియోజకవర్గానికి వచ్చిన సీఎం పర్యటనలో హెలిప్యాడ్, గృహ ప్రవేశాల సందర్భంగా దేవగుడిపల్లెకు, మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం లిస్టులో సుగవాసి పేరు లేదు. విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పార్టీ పెద్దలు హుటాహుటిన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. కొద్ది గంటల్లో చంద్రబాబు జిల్లా పర్యటనకు రాబోతున్న సమయంలో సీఎంఓ కార్యాలయం నుంచి ప్రసాద్ బాబుకు ఫోన్ ద్వారా ఆహ్వానం పంపారు. ఆ మేరకు ప్రసాద్ బాబు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన అనంతరం తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.
గుప్పుమన్న విభేదాలు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిగా అన్నమయ్య జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు గుప్పుమన్నాయి. బుధవారం సీఎం రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం పర్యటనకు వచ్చిన సందర్భంగా స్థానిక మంత్రి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నాయకులు ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా పరిస్థితి కనిపించింది. సీఎంకు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన వారిలో మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా, అరవ శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్ మోహన్ రాజు, ప్రసాద్ బాబు తదితరులు ఉన్నారు. వచ్చిన వారు ఎడముఖం పెడముఖంగా ఉన్నట్లు తెలియవచ్చింది.
సీఎం హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ ద్వారా దేవగుడిపల్లికి వెళ్లగానే మిగిలిన నాయకులు తిరుగుముఖం పట్టినట్లు తెలిసింది. సాయంత్రం సీఎం తిరుగు ప్రయాణంలో వీడ్కోలు పలికేందుకు నాయకులు దూరం అయ్యారన్న వార్త అందరినీ విస్మయానికి గురి చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.


