జగనన్న కాలనీల్లో ఇం‘ధన’ ఆదా

Cherukuvada Sri Ranganadha Raju says on electricity saving in Jagananna Colonies - Sakshi

పేదలకు నిర్మిస్తున్న ఇళ్లకు స్టార్‌ రేటెడ్‌ విద్యుత్‌ ఉపకరణాలు

తద్వారా ఏటా రూ.539 కోట్ల విలువైన విద్యుత్‌ ఆదా చేయొచ్చు

మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో ఏటా రూ.539.7 కోట్ల విలువైన విద్యుత్‌ను ఆదా చేయొచ్చని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. స్టార్‌ రేటెడ్‌ ఉపకరణాలు అమర్చడం ద్వారా భారీగా విద్యుత్‌ ఆదా చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను కూడా మరింత మెరుగుపరచవచ్చన్నారు. ఇంధన శాఖను సమన్వయం చేసుకుంటూ ఇందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్, హౌసింగ్‌ ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండే, ఏపీ  హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ నారాయణ్‌ భరత్‌ గుప్తా తదితరులతో మంత్రి ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా.. రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ,  విద్యుదీకరణ, తాగు నీరు,  పాఠశాలలు, ఆస్పత్రులు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు.

అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ  ప్రభుత్వం ఇల్లు మంజూరు  చేస్తోందని మంత్రి చెప్పారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వీటిలో 10.72 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఈ ఏడాది జూన్‌ నాటికి మొత్తం తొలి దశ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఆమోదంతో ఫైవ్‌ స్టార్‌ రేటెడ్‌ విద్యుత్‌ ఉపకరణాలు అందజేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ట్యూబ్‌ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్‌  ఫ్యాన్లు అందించాలనుకుంటున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ తెలిపారు.

వీటి వల్ల ప్రతి ఇంటికి ఏటా రూ.3,598  విలువైన విద్యుత్‌ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 15 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలు అమర్చడం వల్ల ఏడాదికి 1,674 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఆదా అవుతుందని చెప్పారు. కేంద్ర సంస్థలైన  బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఎనర్జీ ఎఫిషియెన్సీ  సర్వీసెస్‌ లిమిటెడ్‌  సహకారంతో  ఏపీ ఇంధన సంరక్షణ మిషన్‌ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోందని అజయ్‌ జైన్‌ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top