
రూ.25 లక్షల కవరేజీ హుళక్కి.. రూ.2.50 లక్షలకే బీమా
ఆరోగ్యశ్రీని బీమాలోకి మార్చే క్రమంలో భారీగా ప్రొసీజర్లకు కోత
ఆరోగ్యశ్రీలో ఉన్న 3,257 ప్రొసీజర్లలో 700కు పైగా కనుమరుగు
2,550 ప్రొసీజర్లతో బీమా పథకం.. వీటిలో 1,949 కేంద్ర పథకంలోనివే
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.25 లక్షల కవరేజీ, 3,257 ప్రొసీజర్‌లతో బలోపేతం
బీమా పేరిట ఆరోగ్యశ్రీని భూస్థాపితం చేస్తున్న చంద్రబాబు సర్కార్
బీమా అమలు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం... ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం’.. ఇదీ టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ. కానీ, అన్ని వాగ్దానాల్లాగానే దీనినీ తుంగలో తొక్కారు సీఎం చంద్రబాబు. ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా నిలిచిన ఆరోగ్యశ్రీని భూస్థాపితం చేసేందుకు ‘బీమా’ను తెరపైకి తెచ్చింది కాక... అందులో కూడా మోసానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు 3,257 ప్రొసీజర్లతో రూ.25 లక్షల కవరేజీతో అమలవుతున్న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ 2,550 ప్రొసీజర్లతో కేవలం రూ.2.5 లక్షలకే బీమాను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ బీమా విధానానికి ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్–ప్ర«దానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై)లోని ప్రొసీజర్లకు మరికొన్ని జోడించి బీమా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతులిచ్చింది. ఈ మేరకు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
⇒ 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అరకొరగా ఆరోగ్యశ్రీ సేవలు అందేవి.
⇒ అనారోగ్యం పాలైన పేదలు వైద్య చికిత్సలకు తల తాకట్టు పెట్టి అప్పులు చేయాల్సి వచ్చేది. 2019–24 మధ్య ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దిన వైఎస్ జగన్ ప్రభుత్వం... ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 3,257 ప్రొసీజర్లతో రూ.25 లక్షల వరకు పరిమితితో ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది.
⇒ నిరుడు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ బీమా విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటించింది. మళ్లీ 2019కి ముందునాటి పరిస్థితులకు నాంది పలికింది. పీఎంజేఏవైలోని 1949 ప్రొసీజర్లకు 601 కలిపి బీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ లెక్కన 700పైగా ప్రొసీజర్లకు ప్రభుత్వం కోత విధించినట్టు స్పష్టమవుతోంది.
అంతేగాక వీటిలోని 324 ప్రొసీజర్లను ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. రేషనలైజేషన్ సాకుతో ఏకంగా 186 ప్రొసీజర్లను ఎత్తేశారు. 197 ప్రొసీజర్లను ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు రిజర్వ్ చేసినప్పటికీ వీటికి డబ్బులను చికిత్స అనంతరం బీమా కంపెనీకి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని పేర్కొన్నారు. అంటే, పేద, మధ్య తరగతి ప్రజలకు రూ.2.5 లక్షలకు మించి చికిత్స వ్యయం అయితే ఆ భారాన్ని తొలుత బీమా కంపెనీలే భరించాలి. ఈ లెక్కన చిన్న అనారోగ్య సమస్య నుంచి కాక్లియర్ ఇంప్లాంటేషన్ వంటి పెద్ద చికిత్సల దాక ప్రతిదానికి ప్రజలు బీమా కంపెనీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన దుస్థితిని ప్రభుత్వమే నేరుగా కల్పిస్తోంది.
⇒ రాష్ట్రంలో ప్రస్తుతం 1.63 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అర్హతల్లో వార్షిక ఆదాయాన్ని రూ.5 లక్షలకు పెంచడంతో పేదలతో పాటు, మధ్య తరగతికి చెందిన 1.43 కోట్ల కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి.
ప్రజారోగ్యంతో బాబు చెలగాటం..
కూటమి 15 నెలల పాలనలో ఆరోగ్యశ్రీని నిరీ్వర్యం చేస్తూ వచ్చారు చంద్రబాబు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడం, కొత్త ఆస్పత్రులకు అవకాశం ఇవ్వకపోవడం సహా పథకం అమలును గాలికి వదిలేశారు. పేదలు చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ప్రైవేట్ ఆస్పత్రుల మెట్లెక్కితే యాజమాన్యాలు నిర్మొహమాటంగా బయటకు పంపించే పరిస్థితి తెచ్చారు. వివిధ రాష్ట్రాల్లో విఫలమైన బీమా విధానాన్ని ఏపీలో అమలు చేస్తూ ప్రజారోగ్యంతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముక్కుపిండి ప్రీమియం వసూలు చేసి, ప్రయోజనాలు అందించడంలో ఎగవేతలు, కోతలకు దిగే బీమా కంపెనీల చేతుల్లో ప్రజారోగ్యం పెడుతున్నారని విమర్శలు హోరెత్తుతున్నాయి.