అన్నదాతకు ‘మోంథా’ గుబులు | Severe negligence in grain purchasing centers | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ‘మోంథా’ గుబులు

Oct 26 2025 5:44 AM | Updated on Oct 26 2025 5:44 AM

Severe negligence in grain purchasing centers

తుపాను కంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అపార నష్టం

పలు జిల్లాల్లో ముమ్మరంగా పత్తి తీతలు, మొక్కజొన్న కోతలు 

కృష్ణా, గోదావరి డెల్టాలో కోత దశలో వరి 

మద్దతు ధర లేక కన్నీరు పెడుతున్న రైతులు

ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదనలకే పరిమితం 

అక్టోబర్‌ నాలుగో వారం వచ్చి నా పత్తాలేని సీసీఐ కొనుగోలు కేంద్రాలు 

సాక్షి, అమరావతి: అన్నదాతకు మోంథా తుపాను కంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగే అపార నష్టం భయం పట్టుకుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చేతికొచ్చి న పంట ఎక్కడ తుపాను బారిన పడుతుందోననే ఆందోళన కలవరపెడుతోంది. ముంచుకొస్తున్న మోంథా నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కోతలు ప్రారంభమైన జిల్లాల్లో కనీస మద్దతు ధర లేక, పంటను అమ్ముకునే దారిలేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు.. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే ఈ తిప్పలు ఉండేవి కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా.. 
ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం నుంచి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా వెంటాడింది. అన్నదాతలు తీవ్ర వర్షాభావ, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి సాగు చేశారు. విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకూ ఏదీ సక్రమంగా అందించలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసినా.. నానా అవస్థలు పడి పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. తీరా పంట చేతికొచ్చే దశలో మోంథా రూపంలో విరుచుకుపడుతున్న తుపాను వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 

ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడినట్టు వ్యవసాయ శాఖ చెబుతోంది. దాదాపు లక్ష ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. అత్యధికంగా కర్నూలు, ప్రకాశం, విజయనగరం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. కానీ క్షేత్ర స్థాయిలో రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్టుగా రైతులు చెబుతున్నారు. ముంచుకొస్తున్న మోంథా తుపాను ప్రభావం వ్యవసా­య, ఉద్యాన పంటలపై తీవ్రంగా ఉంటుందని ఇ­ప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  

పత్తి, మొక్కజొన్న రైతు దిగాలు 
పత్తి రైతు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఖరీఫ్‌లో వరి తర్వాత కాస్త ఆశాజనకంగా సాగైన పంట పత్తి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాల్లో సాగైతే ఒక్క కర్నూలు జిల్లాల్లోనే 5.55 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పటికే అధిక వర్షాల కారణంగా ఆగస్టు రెండో వారంలో పూత, పింద రాలిపోగా, సెప్టెంబర్‌ నాలుగో వారంలో వర్షాలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. కనీస మద్దతు ధర రూ.8,110 కాగా మార్కెట్‌లో రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. 

సాధారణంగా ఏటా అక్టోబర్‌ 1న సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ ఈ ఏడాది నాలుగో వారం వచ్చి నా కూటమి ప్రభుత్వానికి కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. దీంతో కొతకొచ్చి న పంటను తేమ శాతంతో కొర్రీలు వేయడంతో అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు పూతకొచ్చి న పత్తి కాయలు కుళ్లిపోతున్నాయి. అధికారికంగానే 50వేల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మోంథా తుపాను కూడా జతకలిస్తే పత్తి రైతుల ఆశలు పూర్తిగా గల్లంతైనట్టే. 

ఇక పత్తి తర్వాత చెప్పుకోతగ్గ స్థాయిలో మొక్కజొన్న 4 లక్షల ఎకరాల్లో సాగైంది. అధిక వర్షాల వల్ల 40 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి కాస్త 15–20 క్వింటాళ్లకు పరిమితమైంది. మరో వైపు కనీస మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రస్తుతం దళారీలు రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య కొంటున్నారు. ఫలితంగా ఎకరాకు రూ.17,500 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 12వేల ఎకరాలకు పైగా పంట దెబ్బతింది. 

ఇదే అదనుతో పంట రంగు మారినట్టుగా, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ధర తగ్గించేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మొత్తుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టనట్టుగా ఉంది. పత్తి, మొక్కజొన్నతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.  
ధాన్యం రైతుపై తుపాను పోటు 
కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఎక్కువగా సాగయ్యే వరి పంట ప్రస్తుతం కోత దశలో ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో మోంథా తుపాను తీరం దాటితే కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే కృష్ణా, గోదావరి డెల్టాలో వరిపంట దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. 

గతేడాది మద్దతు ధర లేక 75 కేజీల బస్తాకు రూ.300–రూ.500 వరకు నష్టపోయిన కర్షకులు ఈసారి అంతకంటే దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటామన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈపాటికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లక్ష్యాలు నిర్దేశించుకున్నారే తప్ప ఒక్క కేంద్రం కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు. కనీసం ఆ దిశగా కసరత్తు కూడా చేసే ఆనవాళ్లు కనిపించట్లేదని రైతులు వాపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement