అందుకు సీఆర్‌పీసీ, ఐపీసీ నిబంధనలు అనుమతిస్తున్నాయి
అందుకే ఫిర్యాదుదారుగా రాజీచేసుకున్నాం
ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు
పిటిషనర్‌వి ఊహాజనిత ఆరోపణలు
హైకోర్టుకు నివేదించిన అప్పటి ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్
తమ వాదనలు కూడా వినాలంటూ ఏపీ సాధు పరిషత్ ఇంప్లీడ్ పిటిషన్
సాక్షి, అమరావతి: టీటీడీ పరకామణిలో జరిగిన రూ.72 వేల విలువైన 900 డాలర్ల చోరీ వ్యవహారంపై నమోదైన కేసు చట్ట ప్రకారం రాజీ చేసుకోదగ్గ కేసు కాబట్టే నిబంధనలకు అనుగుణంగా లోక్ అదాలత్‌లో రాజీ అయిందని అప్పటి పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి (ఏవీఎస్‌ఓ) వై. సతీష్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. రాజీ వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. దొంగతనం కేసులో తానే ఫిర్యాదుదారుడిని కాబట్టే నిబంధనల ప్రకారం రాజీ జరిగిందన్నారు. సీఆర్‌పీసీ, ఐపీసీలో రాజీపై ఎలాంటి నిషేధంలేదని ఆయన వివరించారు. రాజీ అన్నది అసాధారణ విషయం ఏమీకాదని తెలిపారు.
రాజీ విషయంలో పిటిషనర్ చేసిన ఆరోపణలన్నీ కూడా ఊహాజనితమైనవేనన్నారు. రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనం చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తానే ఫిర్యాదు చేశానని సతీష్‌కుమార్ తెలిపారు. రూ.72వేల విలువ చేసే డాలర్లు దొంగతనం జరిగితే దీనివెనుక భారీ కుట్ర ఉందన్న పిటిషనర్ ఆరోపణ అర్ధంలేనిదన్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయడానికి, రాజీ చేసుకోవడానికి శాఖాధిపతులకు అధికారం ఉందని తెలిపారు. ఇందుకు టీటీడీ పాలక మండలి అనుమతి అవసరంలేదని తెలిపారు.
టీటీడీ చట్టం రాష్ట్రం చేసిన చట్టమని.. సీఆర్‌పీసీ, ఐపీసీలు కేంద్ర చట్టాలని.. ఈ కేంద్ర చట్టాలే రాజీకి ఆస్కారం కల్పిస్తున్నప్పుడు దానిని తప్పుపట్టాలి్సన పనేలేదన్నారు. రాజీ అన్నది చట్ట విరుద్ధమైన చర్య కాదన్నారు. ఊహాజనిత, నిరాధార ఆరోపణలతో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని సతీష్‌కుమార్ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పరకామణిలో చోరి వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు అప్పటి ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్ కౌంటర్ దాఖలు చేశారు.
మా వాదనలు కూడా వినండి..
ఈ వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని, తమ వాదనలు కూడా వినాలంటూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


