పప్పు బెల్లాల్లా మెడికల్‌ కాలేజీలు 'అమ్మబడును'! | Chandrababu Naidu Govt Another Scam With Medical Colleges In AP, Ready To Give For Lease To Private Individuals | Sakshi
Sakshi News home page

పప్పు బెల్లాల్లా మెడికల్‌ కాలేజీలు 'అమ్మబడును'!

May 28 2025 2:10 AM | Updated on May 28 2025 1:38 PM

Chandrababu Naidu govt another Scam with medical colleges in AP

బాబు సర్కారు మరో బంపర్‌ స్కామ్‌..!  

రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు బేరం 

ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి ప్రైవేట్‌ వ్యక్తులకు 66 ఏళ్లు లీజుకు అప్పగింత

50 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఒక్కో కళాశాల.. ఎకరా రూ.వందకే! 

తొలి దశలో నాలుగు కళాశాలలు ప్రైవేట్‌కు ధారాదత్తం 

రెండో విడతలో మిగతా ఆరు ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్‌ పరం 

సగం మెడిసిన్‌ సీట్లు అమ్ముకోవడానికి చాన్స్‌ 

వైద్య సేవలకు రోగుల నుంచి డబ్బులు వసూలు 

ఈ స్కామ్‌కు ఆమోద ముద్ర కోసం కన్సల్టెన్సీ నివేదిక పేరుతో సర్కారు డ్రామా 

ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యత గాలికి 

పేదలకు ఆరోగ్యం.. విద్యార్థులకు వైద్య విద్య కల దూరం

ఈ ఫొటోలో కనిపిస్తున్నది వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని ప్రభుత్వ నూతన వైద్య కళాశాల. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 47.58 ఎకరాల్లో రూ.500 కోట్లతో కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణం చేపట్టింది. వైఎస్సార్‌సీపీ హయాంలోనే దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. 2024–25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించేందుకు గత ప్రభుత్వంలోనే ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. తొలి ఏడాది 50 ఎంబీబీఎస్‌ సీట్లతో ప్రారంభించేందుకు ఎన్‌ఎంసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా చంద్రబాబు సర్కారు దీన్ని ప్రైవేట్‌ పరం చేసేందుకు కుట్రపూరితంగా లేఖ రాసి సీట్లను రద్దు చేయించింది. ఇప్పుడు ఈ మెడికల్‌ కాలేజీని ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 


కారుచౌకగా ఎకరం ఏడాదికి రూ.100 చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ ఎకరం మార్కెట్‌ రేటు రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని ఏడాదికి కేవలం రూ.4,700 చొప్పున ప్రభుత్వం లీజుకు ఇచ్చేస్తోంది. అంతేకాకుండా ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో ఎంబీబీఎస్‌ తరగతులు నిర్వహించేందుకు సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన కాలేజీని ప్రైవేట్‌కు కట్టబెట్టి ఏకంగా 66 ఏళ్ల పాటు హక్కులు కల్పించబోతోంది. ఇదే తరహాలో గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయిన 10 మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేస్తోంది.  

సాక్షి, అమరావతి: ప్రభుత్వానికి విలువైన సంపద సమకూరుస్తూ రూ.వందల కోట్లతో దాదాపుగా పూర్తి చేసిన మెడికల్‌ కాలేజీలను ఏ ప్రభుత్వమైనా సద్వినియోగం చేసుకుంటుంది! ప్రజలకు ఆరోగ్యం, విద్యార్థులకు వైద్య సీట్లు చేరువలో అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటుంది! కానీ కేవలం రూ.ఐదు వేలు.. పది వేల కోసం ఓ మెడికల్‌ కాలేజీని ఎవరైనా ఇచ్చేస్తారా? అన్ని వసతులతో సిద్ధమైన ప్రభుత్వ వైద్య కళాశాలను భవనాలతో సహా అప్పగించేస్తారా? అవి కూడా ఒకటి రెండు కాదు.. ఏకంగా పది కాలేజీలు!! చంద్రబాబు సర్కారు మాత్రం సరిగ్గా ఇదే చేస్తోంది. 

అన్ని వసతులతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఎకరం రూ.వందకే ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. మరికొద్దిగా వ్యయం చేస్తే ఇవన్నీ అందుబాటులోకి వచ్చి పేదలకు ఉచితంగా సూపర్‌ స్పెషాల్టీ వైద్యం.. మన విద్యార్థులకు మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ పెద్దలు ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యతను గాలికి వదిలేసి పప్పు బెల్లాల మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలలను తన సన్నిహితులకు కట్టబెడుతున్నారు. 

ఈ స్కామ్‌కు ఆమోద ముద్ర వేయించుకునేందుకు ఓ కన్సల్టెన్సీని తెరపైకి తెచ్చి కథ నడిపిస్తున్నారు. తనకు ఆది నుంచి అలవాటైన రీతిలో సీఎం చంద్రబాబు తెర చాటున పావులు కదుపుతున్నారు. ఓ వైద్య కళాశాలను సాధించాలంటే ప్రభుత్వం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఈ ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా తీసుకురాకపోగా ఇప్పటికే మంజూరై దాదాపుగా పూరై్తన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కి అప్పగించి చేతులు దులుపుకోవడం వల్ల వైద్య సేవల కోసం అటు పేదలు.. వైద్య సీట్లు కోల్పోయి ఇటు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 

పేదలకు వైద్యం, పిల్లలకు చదువులు సమకూర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఈ రెండింటినీ నెరవేరుస్తూ గత ప్రభుత్వం ఒకేసారి భారీగా మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టింది. అయితే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదలతో సాకారమైన ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌ విద్యా సంస్థలకు కట్టబెట్టే యత్నాలను టీడీపీ కూటమి సర్కారు ముమ్మరం చేసింది. 



ప్రభుత్వ కళాశాలలు, బోధనాస్పత్రులను ప్రైవేట్‌కు ఏకంగా 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంతో పాటు వైద్య సేవలకు పేదల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసే హక్కు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌కు ధారాదత్తం చేయడంపై కేపీఎంజీ సంస్థ వైద్య శాఖకు ఫీజిబిలిటీ నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. వైద్య శాఖ అధికారుల కమిటీ దీనికి ఆమోదం తెలిపాక టెండర్లు పిలవనున్నారు.

ఒకేసారి 17 కాలేజీలకు వైఎస్‌ జగన్‌ శ్రీకారం..
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థుల వైద్య విద్య అవకాశాలను పెంపొందించేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా 17 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిలో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్‌ కాలేజీల్లో 2023–24లో, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. పిడుగురాళ్ల వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. 

ఇవి కాకుండా మిగిలిన 10 కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో అప్పగించనుంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కళాశాలలను పీపీపీలో ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయించింది. తొలి దశలో నాలుగు కళాశాలలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న వారికి ఎకరం భూమిని కేవలం రూ.100కే ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. 

ఒక్కో వైద్య కళాశాల 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఈ లెక్కన రూ.వందల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు గతేడాది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే వీటిలో తొలి ఏడాది ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించేలా చాలా వరకూ పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మిగిలిన అరకొర పనులూ  పూర్తి చేసి ప్రైవేట్‌ వ్యక్తులే 66 ఏళ్ల పాటు నిర్వహించుకునేలా హక్కులు కల్పించనుంది. తొలుత 33 ఏళ్లు తర్వాత 33 ఏళ్ల పాటుఆటో రెన్యువల్‌ అయ్యేలా నిబంధనలు రూపొందించినట్టు సమాచారం.

సేవలకు డబ్బులు వసూలు..
ప్రైవేట్‌ వ్యక్తుల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందవు. అదే ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి లాంటి పెద్ద శస్త్ర చికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందేవి. వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు అప్పగిస్తున్న నేపథ్యంలో ఇన్‌–పేషెంట్, రోగ నిర్ధారణ, మందు బిళ్లల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునే వీలు కల్పించారు. 

సగం మెడిసిన్‌ సీట్లను కూడా ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో మాదిరిగా అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మెడిసిన్‌ సీట్ల విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీలిచి్చంది. అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల జీవోలను రద్దు చేస్తామని నాడు నారా లోకేశ్‌ నమ్మబలికారు. గద్దెనెక్కాక సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాను ఎత్తివేయకపోగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు.

తెల్ల కోటు కల ఛిద్రం..!
ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెడుతూ మన విద్యార్థుల తెల్లకోటు కలను చంద్రబాబు చిదిమేశారు.  2024–25 విద్యా సంవత్సరంలో మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలు ప్రారంభం కాకుండా అడ్డుçపడ్డారు. 50 సీట్లతో పులివెందుల కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వగా టీడీపీ కూటమి సర్కారు కుట్రపూరితంగా లేఖలు రాసి అనుమతులు రద్దు చేయించింది. అయితే గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పాడేరులో 50 సీట్లతో తరగతులు ప్రారంభం అయ్యాయి. 

వాస్తవానికి గతేడాది 750 ఎంబీబీఎస్‌ సీట్లు సమకూరాల్సి ఉండగా చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ఏకంగా 700 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్‌ కాలేజీలు ప్రారంభమై వీటి ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే ఒక్క కళాశాలకు కూడా ప్రభుత్వం దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement