పెట్రోల్ కొరతపై చంద్రబాబు, లోకేశ్‌లను సామాజిక మాధ్యమాల్లో ఏకిపడేస్తున్న నెటిజన్లు
అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చడానికి ప్రజల నోట్లో మట్టికొట్టారని తీవ్ర విమర్శలు
ఎన్నికల ముందు వారు చెప్పిన మాటల్ని వినిపిస్తూ.. ప్రస్తుత దుస్థితిపై సెటైర్లు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే తీవ్రస్థాయిలో తలెత్తడానికి చంద్రబాబు ప్రభుత్వమే ప్రధాన కారణమనే విషయాన్ని మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు గుర్తించారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ఈ ప్రభుత్వాన్ని రాయడానికి కూడా వీలులేని విధంగా బూతులు తిడుతున్నారు. ఎన్నికల ముందు వారు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లను పోస్టింగ్‌లతో ఏకిపడేస్తున్నారు. ఎన్నికల ముందు ఇంధన ధరలపై తండ్రి, కొడుకు చేసిన ప్రసంగాల వీడియోలను బయటకు తెచ్చి ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ సెటైర్లు, మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చడానికి డీజిల్‌ను తక్కువ ధరకు వారికి మళ్లించి ప్రజల నోట్లో మట్టికొట్టడాన్ని మేధావులు సైతం తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా మరోసారి చంద్రబాబు, లోకేశ్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువు పూర్తిగా పోయింది. దీంతో ఆ పార్టీల కేడర్‌లో తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. ప్రజల దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందంటూ వారు మథనపడుతున్నారు.

ఇదేం రాజకీయం.. విచిత్రంగా ఉంది
ప్రజలు ఇబ్బందిపడితే పడనీ.. అమరావతి కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు.. కార్పొరేట్ల లాభాలు పోకూడదు... సామాన్యుడి ఎకానమీ నాశనం అయినా పర్లేదు.. అని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది. అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ కొరత రాకూడదని, వారికి కష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బందిపడినా పర్లేదనే ధోరణి కాదా ఇది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇవ్వాల్సిన డీజిల్‌ను వారికి ఇవ్వకుండా బల్క్‌లో కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆదేశాలివ్వడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. కొరత వచ్చిన తరువాత కూడా కాంట్రాక్టర్లకు సరఫరా ఆగకూడదని ఆదేశాలివ్వడం దారుణం.
సామాన్యుడి ఎకానమీ, పేదవాడి ఎకానమీ పడిపోయినా పర్లేదుగానీ కాంట్రాక్టర్ల ఎకానమీని మాత్రం కాపాడాలి. వారి లాభాలు మాత్రం నిరాటంకంగా కొనసాగాలి.. అనుకునేది ఏం రాజకీయం ఇది. సామాన్యులకు అనుకూలం అయిన రాజకీయం అయితే కాదు. పోనీ డీజిల్‌ను బల్క్‌లో మళ్లించకపోతే అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? వారం ఆలస్యమవుతుందేమో, అంతకు మించి ఏమవుతుంది. అంటే ఈ డైవర్షన్ అమరావతి కోసం కూడా కాదు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం మాత్రమే.
తక్కువ ధరలకు కాంట్రాక్టర్లకు డీజిల్ ఇస్తున్నప్పుడు నిర్మాణ ఖర్చులు కూడా తగ్గాలి కదా. కానీ ఇప్పటికే అమరావతి నిర్మాణానికి అధిక ఖర్చులపై అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చు అన్నారు కదా.. డీజిల్ తక్కువకు ఇస్తున్నందున రూ.12 వేలకు చేయమని అనగలరా. ఐఏఎస్ అధికారులు కనీస అవగాహన లేకుండా ఆదేశాలిస్తారా? వాటివెనుక కచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు, కారణాలు ఉన్నాయి. ఇంధన కొరతపై ముఖ్యమంత్రి సమీక్ష తరువాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. పనికిమాలిన ఆర్డర్ ఏంటిది, కాంట్రాక్టర్లు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని సీఎం అడగాలి కదా.
– ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు


