వైఎస్సార్‌ జిల్లా పేరు మారుస్తా.. జూబ్లీహిల్స్‌లా చేద్దామనుకున్నా: చంద్రబాబు

Chandrababu Conducted roadshows, gave provocative speeches at Eluru - Sakshi

హార్టీకల్చర్‌ యూనివర్సిటీ పేరు మారుస్తా 

పోలవరం పునరావాస కాలనీలను జూబ్లీహిల్స్‌లా చేద్దామనుకున్నా 

ఏలూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు 

పోలవరం ప్రాజెక్టు వద్ద రోడ్డుపై బైఠాయించి హైడ్రామా 

సాక్షి, ఏలూరు/సాక్షి, రాజమహేంద్రవరం/కొవ్వూరు: ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను నట్టేట ముంచుతున్నారు. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరు మార్చి రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. నేను అనుకుంటే వైఎస్సార్‌ జిల్లా పేరు మారుస్తా. పశ్చిమ గోదావరిలో ఉన్న హార్టీకల్చర్‌ యూనివర్సిటీ పేరు మారుస్తా’ అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారు. గురువారం  జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం మండలాల్లో, కొవ్వూరులో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో రోడ్‌షోలు నిర్వహించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు.

తొలుత కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన బీసీ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి, డీజీపీ, చీఫ్‌ సెక్రటరీ ఒకే జిల్లా వాళ్ళు. రాష్ట్రంలో సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల ఈ నలుగురే రాజకీయం చేస్తుంటే మేము చూస్తూ ఉండాలా’ అని అన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు పదవులు ఇచ్చి అగ్రవర్ణాల కింద పని చేయించుకుంటున్నారని అన్నారు. బీసీలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలని కోరిక ఉండటం తప్పు కాదని, ఒక పద్ధతి ప్రకారం ఎదగాలని చెప్పారు. బీసీల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. 

కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు 
ఆయన పోలవరంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు గానీ గంజాయి మాత్రం ఇస్తున్నారని, అందరూ గంజాయి మత్తులో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని, తెలంగాణలో ఎక్కువ మద్దతు ధర ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు పోయి, ఇసుక, మైనింగ్‌ మాఫియా, గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువయ్యారన్నారు. పోలవరం పునరావాస కాలనీలను జూబ్లీహిల్స్‌లా చేయాలనుకున్నా అన్నారు. 72 శాతం ప్రాజెక్టు తానే పూర్తి చేశానని, తాము అధికారంలోకి రాగానే పోలవరాన్ని జిల్లా గా ప్రకటిస్తామన్నారు. మనం ఎమైనా చేస్తే పోలీసులు వచ్చి గోడలు దూకి అరెస్టు చేస్తారని అంటూనే, వాళ్లదేం తప్పులేదని, జీతాలు కూడా లేవంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. తన మీద కేసులు పెట్టేందుకు తవ్వుతూనే ఉన్నారని, ఈక కూడా దొరకదని చెప్పారు.

ప్రాజెక్టు వద్ద హైడ్రామా 
అంతకుముందు చంద్రబాబు, టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్టులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొన్నారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి తప్పనిసరని, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో అనుమతించలేమని డీఎస్పీ లతాకుమారి వివరించారు. దీంతో పోలీసులను అడ్డగోలు రీతిలో ప్రశి్నంచి 15 నిమిషాల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. 

ఉద్యోగాలిచ్చా.. రాయల్టీ ఇవ్వండి 
తన హయాంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానని, మీ పిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని, లక్షల ఆదాయం చూపించానని అందుకు ప్రతిఫలంగా తనకు రాయల్టీ పే చేయాలని చంద్రబాబు కొవ్వూరు సభలో అన్నారు. సంపాదనలో కనీసం ఒక శాతం రాయల్టీ ఇవ్వాలన్నారు. పార్టీ ఫండ్‌ అన్నా ఇవ్వాలని ప్రాథేయపడ్డారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top