మని‘షి’ తలచుకుంటే కానిది ఏదీ లేదు.. | Challa Asha From Srikakulam Learned Heavy Vehicle Driving | Sakshi
Sakshi News home page

సిక్కోలు యువతులకు ఆదర్శంగా చల్లా ఆశ

Nov 24 2020 1:02 PM | Updated on Nov 24 2020 1:02 PM

Challa Asha From Srikakulam Learned Heavy Vehicle Driving  - Sakshi

హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ అనంతరం డీటీసీ సమక్షంలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ చేస్తున్న చల్లా ఆశ  

హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ నేర్పిస్తామని ఆర్టీసీ వారు ప్రకటన ఇవ్వడమే ఆలస్యం.. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువలా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ఆనక చూస్తే అందులో ఒకే ఒక్కదానిపై యువతి సంతకం ఉంది. నిజమేనా.. అని అధికారులు ఆశ్చర్యపడేలోపే ఆ యువతి చక్కగా శిక్షణ కూడా పూర్తి చేసుకుంది. మని‘షి’ తలచుకుంటే కానిది ఏదీ లేదని నిరూపించింది. తండ్రిలోని సైనికుడి తెగువకు తన తెలివిని జత చేసిన ఈ యువ ఇంజినీర్‌ ఇప్పుడు సిక్కోలు యువతులకు ఆదర్శంగా నిలిచింది. హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ నేర్చుకున్న అతికొద్ది మహిళల్లో తన పేరునూ జత చేసుకుంది. సిక్కోలుకు చెందిన చల్లా ఆశ.. ఇలా తన ఆశను నెరవేర్చుకున్నారు.  

సాక్షి, శ్రీకాకుళం: డ్రైవింగ్‌ అంటే ఆడవారు ఆమడ దూరంలో ఉండాలనే ఛాందసం ఇంకా సమాజంలో ఉంది. దాన్ని ఛేదించుకుంటూ ఇ ప్పటికే చాలా మంది బైకులు, ఆటోలు, కార్లను రయ్‌మంటూ పోనిస్తున్నారు. కానీ హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ మాత్రం మగాళ్ల సామ్రాజ్యం లాగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడో సిక్కోలు మహిళ ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశించింది. తానూ సారథినేనంటూ విజయవంతంగా హెవీ వెహికిల్‌ శిక్షణ పూర్తి చేసింది.ఏపీఎస్‌ ఆర్టీసీ సంస్థ ఇటీవల హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌లో శిక్షణ పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు మగవారితోపాటు ఒక మహిళ కూడా దరఖాస్తు చేసుకుంది. ఆ యు వతి సిక్కోలుకు చెందిన వారు కావడం అందరికీ గర్వ కారణం.    (పెళ్లి కోసం దాచిన 9 లక్షలు బూడిద)

ఆమె పేరు చల్లా ఆశ. విద్యాభ్యాసం బీటెక్‌ (ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌). తండ్రి చల్లా వెంకటరావు ఆర్మీలో హానరీ సుబే దార్‌ మేజర్‌(రిటైర్డ్‌). తల్లి చల్లా దమయంతి. గృహిణి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో తప్ప మరే జిల్లాలో కూడా హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు మహిళలు ముందుకు రాలేదు. దీంతో ఆ మహిళకు శిక్షణ ఇచ్చిన వారు ఎంతో సంతోషించారు, ప్రోత్సహించారు. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌లో 40 రోజుల శిక్షణను విజయవంతంగా ముగించుకుని హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌లో సర్టిఫికెట్‌ పొందిన మొట్టమొదటి మహిళగా ఆమె నిలిచారు. ఆశ 8వ తరగతి చదివేటప్పటి నుంచే మైదానంలో ద్విచక్రవాహనం డ్రైవింగ్‌ నేర్చుకున్నారు. ఇప్పుడు హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఎంతో మంది యువతకు మార్గదర్శకంగా నిలిచారు. 

ఆమె మాటల్లో.. 
‘డ్రైవింగ్‌లో నాకు స్ఫూర్తి నాన్నే. ఫస్ట్‌ క్లాస్‌లో ఉన్నపుడు సైకిల్‌ కొనిచ్చారు. తర్వాత నాన్న టీవీఎస్‌ మోపెడ్‌ కొన్నారు. ఆ సమయంలో కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాను. 8వ తరగతి చదివే సమయంలో మామయ్య వద్ద పల్సర్‌ బైక్‌ ఉండేది. మామయ్యను ఒప్పంచి దానిపై డ్రైవింగ్‌ నేర్చుకున్నాను. 2012లో ఇంటర్మీడియెట్‌లో నాన్న ఆశించిన మార్కులు కంటే ఎక్కువ మార్కులు (900 అనుకుంటే 952 మార్కులు) సాధించడంతో నాన్నే స్వయంగా పల్సర్‌ బైక్‌ కొనిచ్చారు. 2016లో బీటెక్‌ ఫైనలియర్‌ చదివేటప్పుడు కార్‌ కొనడంతో కారుడ్రైవింగ్‌ నేర్చుకున్నాను. ఈ ఏడాది జూలై లో నే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ కూడా తీసుకున్నాను. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ సమయంలో ఎంతో నేర్చుకున్నాను.  (ఒక్కడు.. గ్రామాన్ని మార్చాడు!)

హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ చాలా క్లిష్టమైనది. ఓర్పు, నేర్పుతో కూడుకున్నది. ట్రాఫిక్‌లో ఏవిధంగా డ్రైవింగ్‌ చేయాలి, ట్రాఫిక్‌ రూల్స్, టెక్నికల్‌ పాయింట్‌లు, బ్రేక్‌ డౌన్‌ సమయంలో మెకానికల్‌గా ఏ విధంగా చేయాలి, లైసెన్స్‌ ఏవిధంగా పొందాలి తదితర విషయాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాను. ఈ 40 రోజుల శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ క్రెడిట్‌ మొత్తం నాన్నకే దక్కుతుంది. డ్రైవింగ్‌ నేర్చుకుంటానంటే నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ పొందేందుకు చేరిన సమయంలో నన్ను ఎంతోమంది కలిశారు. ఈ డ్రైవింగ్‌ నేర్చుకోవడం వల్ల కలిగే ఫలితాలను వారికి వివరించాను. వారిలో కూడా డ్రైవింగ్‌పై ఆసక్తి కలిగేలా చేశాను. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ సమయంలో శిక్షకుడు వర్మ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. పూర్తిస్థాయిలో మెలకువలు నేర్పించారు.’ అంటూ సారథిగా తన అనుభవాన్ని వివరించారామె.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement