అర్హులకు చంద్రబాబు సర్కారు దగాపై మండలిలో విపక్ష నేత బొత్స మండిపాటు
ఫస్ట్ ర్యాంకర్‌కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు?
నవీన్ క్యాండిడేట్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేయడం నిజం కాదా?
ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా ఫస్ట్ ర్యాంకు రావడం.. ఫస్ట్ ర్యాంకు వచ్చినా కూడా ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా?
నవీన్ 2025లో రాజీనామా చేశాడని ప్రభుత్వం చెబుతోంది
తాను డీఎస్సీ ముగిసే వరకు ఎస్సీఈఆర్టీలోనే కంప్యూటర్
ఆపరేటర్‌గా ఉన్నట్లు కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో అతడు చెబుతున్నాడు
ఇందులో ఏది నిజం చినబాబూ? ఏం చర్యలు తీసుకున్నారు?
డీఎస్సీ 2025 మొదటి మెరిట్ లిస్టు ఎందుకు రద్దు చేశారు?
గతంలో డీఎస్సీ మెరిట్ లిస్ట్‌లు కలెక్టర్ల కార్యాలయాల్లో వెరిఫై చేసేవాళ్లు
ఈ దఫా మాత్రం సెలెక్ట్ అయిన వారికి నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు?
అమరావతిలో మెగా డీఎస్సీ నియామక పత్రాల ప్రదానోత్సవానికి కొందరిని ఆహ్వానించి తర్వాత వాళ్లు సెలెక్ట్ కాలేదని వెనక్కి పంపడం వాస్తవం కాదా?
స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి? ఏ క్రీడల్లో ప్రతిభ చూపారు? ఎలా పోస్టింగులు ఇచ్చారో మొత్తం వివరాలు బయటపెట్టగలరా?
డీఎస్సీపై కోర్టు తీర్పు కాపీ వచ్చేలోపే ప్రభుత్వం హడావుడిగా ఫలితాలను ప్రకటించడం... ప్రక్రియ ముగించి పోస్టింగ్‌లు ఇచ్చేయడం వెనుక మతలబు ఏమిటి?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 తప్పిదాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆధారాలతో సహా డీఎస్సీ అక్రమాలు బహిర్గతం కావడంతో ప్రభుత్వం బెంబేలెత్తుతోందన్నారు. ‘ఫస్ట్ ర్యాంకర్‌కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు? నవీన్ క్యాండిడేట్ ఐడీని ప్రభుత్వం బ్లాక్ చేయడం నిజం కాదా? ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా ఫస్ట్ ర్యాంకు రావడం.. ఫస్ట్ ర్యాంకు వచ్చినా కూడా ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? డీఎస్సీ–2025 మొదటి మెరిట్ లిస్టు ఎందుకు రద్దు చేశారు?’ అని ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు. గతంలో డీఎస్సీ మెరిట్ లిస్టులు కలెక్టర్ కార్యాలయాల్లోనే వెరిఫై చేసేవారని, ఈదఫా మాత్రం సెలెక్ట్ అయిన వారికి నేరుగా మెసేజ్‌లు పంపడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు.
డీఎస్సీలో డొల్లతనంపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు వెలువడటం.. మాజీ సీఎం వైఎస్ జగన్ దీన్ని ఎండగట్టడం.. సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో ఉలిక్కిపడిన బాబు సర్కారు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే అర్ధరాత్రి తూతూమంత్రంగా ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకొనే యత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ అక్రమాలను సర్వత్రా నిలదీస్తుంటే విద్యాశాఖ మంత్రి మాత్రం అంతా పారదర్శకమని తన ‘ఎక్స్’ ఖాతాలో బుకాయించడం విస్మయం కలిగిస్తోందన్నారు. మెరిట్ కలిగి ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులను బుజ్జగించేందుకు విద్యాశాఖ మంత్రి రాజకీయాలు చేయడం ఏమిటన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులను ఎలాంటి పరీక్ష లేకుండా భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా అదే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందాలంటే రాత పరీక్ష తప్పనిసరి అంటూ పాలసీ, జీవోలను సవరించడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు.
తప్పించుకునేందుకు ‘శాప్’ ఆపసోపాలు..
ప్రభుత్వం వివరణ: శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాకోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవం, నిరాధారమైనవి.
ఇదీ వాస్తవం: క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోస్టులు పొందారని, అనర్హులకు పోస్టుల దక్కాయని.. అర్హులైనప్పటికీ తమకు అన్యాయం జరిగిదంటూ ఎందరో అభ్యర్థులు ‘శాప్’కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కోర్టులకు వెళ్లి తేల్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. సమాచార హక్కు–2005 ప్రకారం అర్హులైన అభ్యర్థులు కోరిన సమాచారాన్ని ‘శాప్’ ఇంత వరకు ఇవ్వకపోవడం దేనికి సంకేతం? ఏదైనా నోటిఫికేషన్ తర్వాత పోస్టు భర్తీ చేస్తే ఆ పోస్టుకు సంబంధించిన సమగ్ర వివరాలు, ఉద్యోగి ఏ అర్హతతో ఉద్యోగం పొందారో సమాచారం ఇవ్వాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. దీనిని శాప్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? టీచర్ పోస్టులకు బేరాలు పెడుతూ నంబర్‌తో సహా ఫోన్ కాల్ రికార్డింగ్స్ బహిర్గతమైతే వాటిపై శాప్ విచారణ చేయడం మానేసి మౌనం దాల్చడం వెనుక మతలబు ఏమిటి?
ప్రభుత్వం వివరణ: 3,600 మంది అభ్యర్థులు దాఖలు చేసుకున్న 5,326 దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించి పోస్టులు భర్తీ చేసింది.
ఇదీ వాస్తవం: స్క్రీనింగ్ కమిటీలో సభ్యులైన డీఎస్‌డీవోలను ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా తయారీ వరకు ఎందుకు కొనసాగించలేదు? ప్రాథమిక ఎంపిక జాబితాను బహిరంగంగా ఎందుకు ప్రదర్శించలేదు? ఒకవేళ ప్రదర్శిస్తే కచ్చితంగా అభ్యంతరాలు వచ్చేవి. కానీ శాప్‌లో ఒక్క అభ్యంతరం కూడా ఎందుకు నమోదు కాలేదు? అంటే, అసలు ప్రాథమిక జాబితా ప్రదర్శించకుండానే తుది జాబితా సిద్ధం చేసేశారు. చివరికి ఫలితాల రోజు అనర్హురాలైన విజయనగరానికి చెందిన ఓ క్రీడాకారిణికి ఉద్యోగం రావడం గమనించి అర్హులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే శాప్ వాటిని ఎందుకు పట్టించుకోలేదు? ఈ ఏడాది ఏప్రిల్ 24న సాక్షిలో ‘డీఎస్సీ డీల్స్’ కథనం వెలువడగానే సదరు క్రీడాకారిణిపై విచారణ చేస్తున్నట్లు శాప్ పేర్కొంది. ఇప్పటికీ నెల రోజులు దాటినా విచారణ ఎందుకు ముగించడం లేదు? అంటే ప్రభుత్వమే వాస్తవాలు బయటపడకుండా అడ్డుకుంటోంది కదా!
తాను ఎస్సీఈఆర్టీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా 2016 నుంచి పనిచేసినట్టు కోర్టుకు తెలిపిన నవీన్
సర్కారు అబద్ధాల వివరణలపై అభ్యర్థుల మండిపాటు..
డీఎస్సీ–2025లో కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్‌గా ప్రకటించిన పి.నవీన్ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్‌పై కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతడికి డీఎస్సీలో ప్రశ్నలను ఆన్‌లైన్ చేసే బాధ్యతలు అప్పగించారు. డీఎస్సీ ఫలితాల అనంతరం అతడికి టాప్ ర్యాంకులు వచ్చాయని గుర్తించిన అధికారులు మొత్తం ఎంపిక ప్రక్రియనే మార్చేశారు. అబద్ధాల వివరణలతో ప్రభుత్వం వరుసగా కట్టు కథలు వినిపిస్తోందని టీచర్ అభ్యర్థులు మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు తీరును నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న పలు సందేహాలు, ప్రభుత్వ వివరణలు ఇలా ఉన్నాయి..!
ప్రభుత్వం వివరణ: డీఎస్సీ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్ పి.నవీన్ 2016 నవంబర్ నుంచి ఎస్సీఈఆర్టీలో అవుట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తూ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు. అన్నింటికంటే ముఖ్యంగా మెరిట్ ప్రాతిపదికన అతడిని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినా వెరిఫికేషన్‌కు హాజరు కాలేదు.
ఇదీ వాస్తవం: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 26న కాల్ లెటర్లు విడుదల చేశారు. వీటిని ఆయా అభ్యర్థులు తమ డీఎస్సీ నంబర్ ఆధారంగా కంప్యూటర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఆగస్టు 29 నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అయితే, నవీన్ తన క్యాండిడేట్ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారంటూ హైకోర్టుకు ఆధారాలు సమర్పించాడు. అసలు కాల్ లెటర్ లేకుండా సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతిస్తారా?
ప్రభుత్వం వివరణ: నవీన్ వ్యక్తిగత కారణాలతో 2025లో రాజీనామా సమర్పించాడు.
ఇదీ వాస్తవం: నవీన్ 2025 ఏ నెలలో రాజీనామా చేశాడో చెప్పలేదు. తాను డీఎస్సీ ప్రక్రియ ముగిసే వరకు ఎస్సీఈఆర్టీలోనే కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశానంటూ కోర్టుకు ఇచ్చిన పిటిషన్‌లో అతడు పేర్కొన్నాడు. మరి వ్యక్తిగత కారణాలతో ఎప్పుడు రాజీనామా చేశాడు?
ప్రభుత్వం వివరణ : డీఎస్సీ రాసేందుకు నిర్ణీత విధానాల ప్రకారం ముందుగా శాఖకు సమాచారం ఇచ్చి సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే నవీన్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరయ్యాడు. అందువల్ల అతడి పేరు తదుపరి ఎంపిక ప్రక్రియ రికార్డుల నుంచి తొలగించాం.
ఇదీ వాస్తవం: అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరైతే అతడి ఎంపిక ప్రక్రియను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ దాదాపు ఏడాదిన్నర కాలంపాటు సాగిన డీఎస్సీ ప్రక్రియలో ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదు? గుర్తించి ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా ఎక్కడా చేయలేదు. ఎంపిక ప్రక్రియలో నవీన్‌ను తొలగించి ఉంటే అతడి స్థానంలో మరో అభ్యర్థికి సోషల్ స్టడీస్‌లో మొదటి ర్యాంకు, జోన్–2 టీజీటీలో ఆరో ర్యాంకును మరో అభ్యర్థికి కేటాయించి ఉండాలి. ఇలా ఎందుకు చేయలేదు? ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నవీన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. అతడికి పోస్టు ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. మరి నవీన్ విద్యాశాఖ అనుమతి లేకుండా పరీక్ష రాశాడని, అందుకే అతడికి పోస్టు కేటాయింపును రద్దు చేశామని కోర్టుకు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు?
ఉర్దూ మీడియం పోస్టుల్లోనూ తప్పిదాలు..!
ప్రభుత్వం వివరణ: అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ మీడియం) పోస్టుల భర్తీ పూర్తిగా మెరిట్, రోస్టర్ నిబంధనల ప్రకారమే జరిగింది. ఓపెన్ కాంపిటీషన్ (ఓసీ) రోస్టర్ పాయింట్ కింద అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థిని, ఓసీ–ఈడబ్ల్యుఎస్ కోటా కింద చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్ గల మెరిట్ అభ్యర్థిని నిబంధనల ప్రకారమే ఎంపిక చేశాం. ఇందులో ఎటువంటి నిబంధనల అతిక్రమణ జరగలేదు.
ఇదీ వాస్తవం: అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ)లో 58.77 స్కోరు సాధించారు. ఓసీ–ఈడబ్ల్యుఎస్ కోటాలో ఆయనకు ఆ పోస్టు ఇవ్వాలి. కానీ ఆ పోస్టును ముస్లిం బీసీ(షేక్) వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారు. ఎంపిక అయిన అభ్యర్థి 2008, 2012, 2014, 2018 డీఎస్సీల్లో ‘బీసీ’గా నమోదు చేసుకున్నాడు. 2025 నాటికి ‘ఓసీ–ఈడబ్ల్యుఎస్’గా నమోదు చేశాడు. గతంలో బీసీ కులం అని చూపించి 2025 డీఎస్సీలో ఓసీగా ఎలా మారిపోయాడు?
ఇదేనా పారదర్శకత?
డీఎస్సీ నియామకాలను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అదే నిజమైతే టెట్ మార్కుల సవరణకు పలు పర్యాయాలు ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది? ఒకసారి మెరిట్ జాబితాను విడుదల చేశాక సవరణతో రెండోసారి జాబితా ఎందుకు ఇచ్చారు? అనంతరం వాటిని ఆన్‌లైన్ నుంచి తొలగించి నేరుగా ఎంపిక జాబితాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఎంపికైనట్లు కొందరు అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌లు పంపి, ఆ తర్వాత కాదని చెప్పడం నిజం కాదా? అమరావతిలో వేడుకలకు ఆహ్వానించి ఆ తర్వాత మీరసలు టీచర్ పోస్టులకే ఎంపిక కాలేదని చెప్పడంలో ఆంతర్యమేంటి? జూలై–2024 టెట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అధికారిని డీఎస్సీ కన్వీనర్‌గా నియమించామని చెబుతున్నారు. మరి ప్రారంభంలో ఆయనకే బాధ్యతలు ఎందుకు అప్పగించలేదు? అప్పటికే ఉన్న డీఎస్సీ కన్వీనర్‌ను ఎందుకు తొలగించారు?
ప్రభుత్వం వివరణ: క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఇచ్చాం.
ఇదీ వాస్తవం: స్క్రీనింగ్ కమిటీ ద్వారా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అత్యంత రహస్యంగా సాగింది. ఇందులో ఎక్కడా క్రీడా సంఘం, ఫెడరేషన్‌కు సంబంధించిన వ్యక్తులు లేరు. శాప్ తయారు చేసిన తుది జాబితా లిస్టు ప్రకారం ఆయా క్రీడా సంఘాల నుంచి సమ్మతి లేఖలు తీసుకుని ‘మమ’ అనిపించింది. జాతీయ స్థాయిలో పోస్టుల భర్తీలో ఫెడరేషన్లకు చెందిన వ్యక్తులను దగ్గర పెట్టుకుని సర్టిఫికెట్ల ధ్రువీకరణ చేపట్టడం ఆనవాయితీ. క్రీడాకారుల టీమ్ ఫొటోలు, మెడల్స్ లాంటివి స్వయంగా పరిశీలించి ధ్రువీకరిస్తారు. మరి ఇక్కడ అలా ఎందుకు జరగలేదు? డిగ్రీ లేకున్నా ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ చదివినట్లు ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చి అనర్హులు టీచర్ ఉద్యోగాలు పొందారు. ఆ డిగ్రీలకు సంబంధించి శాప్ ఇతర రాష్ట్రాల వర్సిటీలను ఎందుకు సంప్రదించలేదు?
ప్రభుత్వం వివరణ: మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పోర్ట్స్ కోటా సీట్లను భర్తీ చేశాం.
ఇదీ వాస్తవం: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీలో 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా 97 శాతం పోస్టులు నింపేశారు. డీఎస్సీ ముగిసిన 8 నెలల తర్వాత క్రీడా పాలసీ, 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ హఠాత్తుగా ఎందుకు మారింది? ఈ డీఎస్సీలో రాత పరీక్షల అవసరం లేకుండా క్రీడల కోటాలో ఉద్యోగాలు ఇవ్వగా ఇప్పుడు మాత్రం ఆయా శాఖలు నిర్వహించే రాత పరీక్షల్లో కచ్చితంగా అర్హత సాధించాలని ఎందుకు సవరించారు? రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఇవ్వడం తప్పయితే.. 2025 డీఎస్సీ పూర్తిగా తప్పిదమే. అది సక్రమమే అయితే.. ఇప్పుడు రాత పరీక్షను తప్పనిసరి ఎందుకు చేశారు? కర్నూలు జిల్లాలో ఓపెన్ కేటగిరీ పోస్టును భర్తీ చేసిన తర్వాత మళ్లీ నాన్–లోకల్ పోస్టు ఎలా భర్తీ చేస్తారు? దీనిపై కోర్టుల్లో కేసులు వేస్తే శాప్ 2002 తర్వాత జరిగిన సవరణలను దాచిపెట్టి కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులు–1975 అంశాలను మాత్రమే కోర్టుకు ఎందుకు నివేదించింది?
జవాబు చెప్పలేక జగన్‌పై వ్యక్తిగత విమర్శలా?
విద్యాశాఖ మంత్రి లోకేశ్ డీఎస్సీపై వాస్తవాలను అంగీకరించకుండా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తూ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. డీఎస్సీలో అర్హులకు అన్యాయం జరగడం ముమ్మాటికీ నిజమని.. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం తప్పు అని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా లోకేశ్ చూపలేకపోయారని పేర్కొన్నారు. 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని, పది వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని గొప్పలు చెప్పుకున్న లోకేశ్ ఎక్కడా తప్పు జరగలేదని చెప్పే ధైర్యం చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. డీఎస్సీ–2025లో జరిగిన దారుణాలు ఆధారాలతో సహా కళ్లముందే కనిపిస్తున్నా దర్యాప్తు చేస్తామని ఒక్కమాట అనేందుకు లోకేశ్ సాహసించలేదన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు 200 కేసులు వేయించారని జగన్‌పై నిరాధార ఆరోపణలతో బురద చల్లారని మండిపడ్డారు. వాస్తవానికి డీఎస్సీలో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లిన వారంతా ప్రతిభ కలిగిన టీచర్ అభ్యర్థులేనని, వారిలో పరీక్ష రాయని వారు ఒక్కరూ లేరని గుర్తు చేశారు. ‘వారికి పోస్టులు ఇవ్వాలని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
అయితే కోర్టు తీర్పు కాపీ వచ్చేలోపే ప్రక్రియను హడావుడిగా ముగిస్తూ ప్రభుత్వం ఫలితాలు ప్రకటన, ఎంపిక ప్రక్రియ, పోస్టింగ్‌లు ఇచ్చేశారు. దీనిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెరిట్ అభ్యర్థులకు పోస్టులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో పాటు విద్యాశాఖ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఇది నిజం కాదా? ఈ విషయం తెలిసి కూడా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు? అర్హులకు ఎందుకు న్యాయం చేయలేదు? డీఎస్సీకి 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఆడిన అవినీతి క్రీడతో 3 లక్షల మందికి పైగా అభ్యర్థులకు పూడ్చలేని నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పి అభ్యర్థులకు న్యాయం చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. స్పోర్ట్సు డీఎస్సీలో జరిగిన స్కామ్‌పై ‘సాక్షి’లో కథనం వెలువడిన నెల రోజుల తర్వాత అబ్బే.. తప్పు జరగలేదంటూ ‘శాప్’ మంగళవారం ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకోవటాన్ని బొత్స తప్పుబట్టారు.
ఈ ప్రశ్నలకు జవాబేది చినబాబూ..
1. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
2. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
3. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్‌లో టాపర్‌గా వచ్చిన ఎస్సీఈఆర్టీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి పి.నవీన్ ఎంపిక జాబితాలో తనకు పోస్టు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది వాస్తవం కాదా?
4. రాయలసీమ జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి న్యాయంగా తనకు దక్కాల్సిన పోస్టు నాన్‌ృలోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టేశారని హైకోర్టును ఆశ్రయించింది నిజం కాదా?
5. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?
6. రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టులు బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి? వారు ఏయే క్రీడల్లో ప్రతిభ చూపారు? వారికి ఎలా పోస్టింగులు ఇచ్చారో మొత్తం వివరాలు బయటపెట్టగలరా?
7. టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ
పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి?
8. మెగా డీఎస్సీ పేరుతో అమరావతిలో నిర్వహించిన నియామకపత్రాల ప్రదానోత్సవానికి కొందరు డీఎస్సీ ఉద్యోగార్థులను పిలిచి, తర్వాత వాళ్లు సెలెక్ట్ కాలేదని వాళ్ల జీవితాల్లో నిప్పులు పోసిన మాట వాస్తవం కాదా?


