విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని శాననమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ‍్నిస్తే అది ముగిసిన అధ్యాయమని చెబుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.
విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఏమైంది? రెండేళ్లలో అమరావతిలో ఎంత అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలి. అమరావతిలో అగ్నిప్రమాదం జరిగితే వైఎస్సార్‌సీపీకి ఏం సంబంధం? ఆ అగ్ని ప్రమాదం విషయం ఏమైంది? కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఏం చేశారో చెప్పాలి.
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యడం లేదు. గిట్టుబాటు ధరలేక రైతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి విషయంలో కాంక్రీట్ వేశామని ఫీలింగ్ ఇవ్వడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారు’ అని చెప్పారు.
విభజన హామీలు ఏమయ్యాయి?
మీడియా కూడా జరుగుతున్న అఘాయిత్యాలను పట్టించుకోకుండా అమరావతి అంశాన్నే చూపిస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాష్ట్రంలో మామిడి పండ్లను కూడా కల్తీ చేసే దుస్థితి నెలకొంది. ఆరోగ్య శ్రీని పూర్తిగా అటక ఎక్కించారు. తీర్మానం చేసి అమరావతి పర్మినెంట్ అనుకుంటున్నారు. నిర్మాణం పూర్తి చేస్తే అది పర్మినెంట్ అవుతుంది. రాష్ట్ర విభజన హామీల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదా వస్తే 10 అమరావతిలు వస్తాయి.
ముంబై వంటి నగరాలు కూడా వస్తాయి. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు? మావిగన్ ప్రతిపాదనలో తప్పేముంది? మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చే క్వార్టర్స్ అయినా పూర్తి చేశారా? కరకట్ట రోడ్డు కూడా వెయ్యలేకపోయారు. అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు? అమరావతి నిర్మాణంలో ఎస్‌ఎఫ్‌టీకి రూ.14 వేలు ఎందుకు?
ఎవ్వరికైనా ఇదే అనుమానం వస్తుంది.. జగన్ కూడా అదే అడిగారు. ఈ రెండేళ్లలో అమరావతిపై ఎంత ఖర్చు చేశారు? ఎంత పని చేశారు? ఎంత పేమెంట్ ఇచ్చారు? బకాయిలు ఎంత పెట్టారు? ఆ వివరాలను బట్టి ఎన్ని సంవత్సరాల్లో అమరావతి పూర్తి అవుతుందో చెప్తాం. గిరి గీసుకొని అమరావతి మాత్రమే అభివృద్ధి చెయ్యాలని అనుకోని చేస్తున్నారు. మళ్లీ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా బిల్లు పెట్టించాలి. ప్రభుత్వం మీదే కదా? ప్రత్యేక హోదా బిల్లు పెట్టిస్తే.. చంద్రబాబుని మెచ్చుకుంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.


