సాక్షి, తిరుపతి: టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. వైఎస్సార్‌సీపీపై “హత్య రాజకీయాలు” ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుకు “మెగలోమానియా” అనే వ్యాధి ఉందని.. తనను తాను అతిశయోక్తిగా చూపించుకుంటారంటూ భూమన విమర్శించారు. మీడియా సంస్థలు చంద్రబాబును అతిగా పొగడ్తలతో ప్రోత్సహిస్తున్నాయంటూ భూమన మండిపడ్డారు.
హింసా, కుల రాజకీయాలకు చంద్రబాబే తెర తీశారని.. పలు పాత హత్య ఘటనలపై చంద్రబాబు పాత్ర ఉందని భూమన ఆరోపించారు. వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైలులో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, కేసులు పెరిగాయి. “సూపర్ సిక్స్” హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమైంది, దేవుడిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ ప్రజల కోసం పనిచేసే నాయకుడని, చంద్రబాబు మేనేజ్‌మెంట్ రాజకీయాలపై ఆధారపడుతున్నారన్న భూమన.. 2029లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల నాయకుడిగా అభివర్ణించిన భూమన.. టీటీడీ భూములను కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
టీటీడీలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు పెరిగాయన్న భూమన.. ఇసుక, గ్రావెల్ దోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు.


