జస్టిస్‌ హరినాథ్‌పై ఆరోపణలు చేయలేదంటారా..? | A bench headed by Justice Lisa Gill strongly objected to Rahul Chaudharys allegation | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ హరినాథ్‌పై ఆరోపణలు చేయలేదంటారా..?

Aug 20 2026 5:40 AM | Updated on Aug 20 2026 5:40 AM

A bench headed by Justice Lisa Gill strongly objected to Rahul Chaudharys allegation

న్యాయవాది రాహుల్‌ చౌదరి ఆరోపణలకు కోర్టు వీడియో ఆధారాలు ఉన్నాయి

ఆరోపణలు చేయలేదని చెప్పేముందు జాగ్రత్తగా ఉండండి

అప్పీలెంట్ల తరఫు సీనియర్‌ న్యాయవాదికి సీజే ధర్మాసనం హెచ్చరిక

సాక్షి, అమరావతి: కాకినాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణంపై ఏసీబీ విచారణకు ఆదేశించి, ఆ వ్యవహారంపై విచారణ జరుపుతున్న హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌పై విశ్వాసం లేదంటూ న్యాయవాది రాహుల్‌ చౌదరి ఆరోపణలు చేయడాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరమని ఘాటుగా వ్యాఖ్యానించింది. 

ఈ వ్యవహారంలో జస్టిస్‌ హరినాథ్‌పై చేసిన వ్యాఖ్యలను తొలగించాలని, ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని విన్నపాలు, అభ్యర్థనలతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి అలాగే కాకినాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన భూములను తమ భూములుగా చెప్పుకుంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ప్రైవేటు వ్యక్తులు.. గుబ్బల సత్యనారాయణమూర్తి, ముమ్మన సూర్యారావు, వాసంశెట్టి అప్పారావు మరికొందరు సీజే ధర్మాసనం ముందు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు.  ప్రైవేటు వ్యక్తులు (అప్పీలెంట్లు) దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం విచారణకు వచ్చిన సందర్భంగా వారి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది  పి.విల్సన్‌ వాదనలు వినిపించారు. 

సింగిల్‌ జడ్జిపై న్యాయవాది రాహుల్‌ చౌదరి ఆరోపణలు చేయలేదన్న విల్సన్‌ వాదనలను ధర్మాసనం ఈ సందర్భంగా తప్పుపట్టింది. అన్నీ తెలుసుకొని వాదించాలని సూచించింది.  సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలు తక్షణ నిలుపుదలకు విల్సన్‌ చేసిన అభ్యర్థనను నిరాకరించిన ధర్మాసనం,  ప్రణతి దాఖలు చేసిన అప్పీల్‌తో కలిపి ఈ రెండు అప్పీళ్లను విచారిస్తామంటూ తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా  వేసింది.   భూముల విషయంలో కాకినాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు గతంలో దాఖలు చేసిన కౌంటర్‌లోని అంశాలకు, ఇటీవల దాఖలు చేసిన కౌంటర్‌లోని అంశాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలపై తాము దృష్టి సారించామని కూడా స్పష్టం చేసింది.  

పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా వాదనలు వినిపించడం సరికాదు
‘సింగిల్‌ జడ్జిపై మేము ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కావాలంటే మేము దాఖలు చేసిన లిఖితపూర్వక మెమోను పరిశీలించాలి’అని విల్సన్‌ అంతక్రితం ధర్మాసనానికి  విన్నవించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘మెమోలో ఏమీ ఉండకపోవచ్చు.. కాని మౌఖికంగా చేసిన ఆరోపణల సంగతి ఏమిటి?  ఆరోపణలు చేయలేదని చెబితే సరిపోదు.  ఆరోపణలకు మా వద్ద వీడియో రికార్డింగ్‌ ఆధారాలున్నాయి. కావాలంటే ఆ వీడియోను ప్లే చేసి చూపుతాము. మీ క్లయింట్ల తరఫు న్యాయవాది రాహుల్‌ చౌదరి (ఎస్‌జీపీ ప్రణతి భర్త) సింగిల్‌ జడ్జి ముందు మాట్లాడిన మాటలు మాత్రం రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. 

వీడియో రికార్డింగ్‌ ఉన్న నేపథ్యంలో సింగిల్‌ జడ్జిపై రాహుల్‌ చౌదరి ఎలాంటి ఆరోపణలు చేయలేదని చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కోర్టుల్లో వీడియో రికార్డింగ్‌ సౌకర్యం ఉండటం పట్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము.  సింగిల్‌ జడ్జిపై ఆరోపణలు ఏమీ చేయలేదని చెబుతున్నారంటే మీకు మీ ఆన్‌ రికార్డ్‌ న్యాయవాదులు గానీ, పిటిషనర్లు గానీ సరైన బ్రీఫింగ్‌ చేసినట్లు కనిపించడం లేదు. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా మీరు వాదనలు వినిపించడం ఎంత మాత్రం సరికాదు.’ అని ధర్మాసనం విల్సన్‌ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement