Andhra Pradesh: ‘డిజిటల్‌ హెల్త్‌’కు నాంది

Ayushman India Digital Health Portal In AP - Sakshi

ఏపీలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ పోర్టల్‌

తొలిదశలో అనంత, తిరుపతి, విజయవాడ, కాకినాడ జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాటు

డిసెంబర్‌ మొదటి వారం నుంచి ప్రారంభం

తర్వాత దశలవారీగా బోధనాస్పత్రుల నుంచి పీహెచ్‌సీల వరకు విస్తరణ

అక్కడ పనిచేసే వైద్య సిబ్బందితోపాటు సదుపాయాల సమాచారం సేకరణ

ఆ వివరాలు ఏబీడీఎం పోర్టల్‌కు అనుసంధానం

ఇప్పటికే కొనసాగుతున్న రోగుల వివరాల సేకరణ ప్రక్రియ

ఆ సమాచారమూ పోర్టల్‌లో అప్‌లోడ్‌

దేశంలో ఎక్కడికెళ్లినా వైద్యం సులభతరం  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశవ్యాప్తంగా చేపట్టిన నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ పనులు ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా జరుగుతున్నాయి. తొలిదశలో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి అనంతపురం జిల్లా సర్వజనాస్పత్రితో పాటు తిరుపతి, విజయవాడ, కాకినాడ ఆస్పత్రులు ముందుకొచ్చాయి. డిసెంబర్‌ మొదటి వారంలో ఆయా చోట్ల ఏబీడీఎం (ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌) పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నారు. మొదట ఆయా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది (ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌ తదితరులు) వివరాలతోపాటు అదనంగా వైద్య సదుపాయాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీరికి 14 అంకెలతో కూడిన నంబర్‌ కేటాయిస్తారు.

ఈ వివరాలను పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోకి వెళ్లినా ఆ నంబర్‌తో కూడిన వ్యక్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నాలుగు ఆస్పత్రుల్లో నమోదు పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరిస్తారు. నాలుగు వారాల్లో బోధనాస్పత్రుల్లోనూ, ఆ తర్వాత నాలుగు వారాల్లో జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ, తర్వాత నాలుగు వారాల్లో సీహెచ్‌సీల్లోనూ, చివరగా పది వారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ హెల్త్‌కేర్‌ ఫెసిలిటీస్, వైద్య సిబ్బంది వివరాలన్నీ సేకరించి ఏబీడీఎం పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. త్వరలోనే ప్రైవేటు ఆస్పత్రుల వివరాలనూ సేకరిస్తారు.

రోగుల వివరాలూ నమోదు..
రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌సీడీ (అసాంక్రమిక వ్యాధులు)పై సర్వే వివరాలను ఈ డిజిటల్‌ రూపంలోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 20 ఏళ్ల వయసు దాటిన వాళ్లందరికీ ఏఎన్‌ఎంలు బీపీ, షుగర్, బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) చెక్‌ చేస్తున్నారు. ఈ వివరాలన్నీ డిజిటల్‌ మిషన్‌కు అనుసంధానం చేస్తారు.

పేషెంటు వివరాలతోపాటు మనం చికిత్స చేయించుకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వివరాలూ, వైద్యం చేసిన డాక్టరుకు ఎంసీఐ కేటాయించిన ప్రత్యేక క్రమ సంఖ్య, పేరు నమోదు చేస్తారు.

ఈ ప్రక్రియకు మన రాష్ట్రంలో కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ వివరాలతో ప్రతి వ్యక్తికి ప్రత్యేక డిజిటల్‌ ఐడీ వస్తుంది. ఈ ఐడీ నంబరే పేషెంటుకు దేశవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా ఉపయోగపడుతుంది.

ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశంగా ఈహెచ్‌ఆర్‌ (ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డ్‌) ఏర్పాటు చేస్తారు.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డు మన రాష్ట్రంలో ఎలా పనిచేస్తుందో.. అలాగే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోకి వెళ్లినా ఈహెచ్‌ఆర్‌ నంబర్‌ పనిచేస్తుంది.

మనకు కేటాయించిన డిజిటల్‌ ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయగానే మన వివరాలన్నీ వస్తాయి. దీనివల్ల వైద్యం సులభతరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top