ఏపీ డిజిటల్‌ విద్యకు ప్రశంసల వెల్లువ | Sakshi
Sakshi News home page

ఏపీ డిజిటల్‌ విద్యకు ప్రశంసల వెల్లువ

Published Sat, Feb 24 2024 4:12 AM

Appreciation for AP Digital Education - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ఎన్సీఈఆర్టీ మరోసారి ప్రశంసించింది. ఇతర రాష్ట్రాల విద్యాశాఖలు ఏపీ విధానాలను అధ్యయనం చేయాలని సూచించింది. ముఖ్యంగా ఐఎఫ్‌పీల ద్వారా డిజిటల్‌ బోధన, ట్యాబ్‌ల వినియోగం, విద్యార్థుల ట్రాకింగ్, జగనన్న గోరుముద్ద యాప్, విద్యా సమీక్ష కేంద్రాల పనితీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని కొనియాడింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సమీక్ష కేంద్రాల(వీఎస్‌కే) పనితీరుపై గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రెండు రోజులు నిర్వహించనున్న జాతీయస్థాయి వర్క్‌షాప్‌ శుక్రవారం ప్రారంభమైంది.

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ(సీఐఈటీ) ఆధ్వర్యంలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్సీఈఆర్టీ) నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య కమిషనరేట్‌ ఐటీ విభాగం అధికారి రమేష్‌కుమార్, విద్యా సమీక్ష కేంద్రాల సూపర్‌వైజర్‌ రమ్యశ్రీ, సమగ్ర శిక్ష నుంచి శ్రీదీప్‌ హాజరై రాష్ట్ర విద్యాశాఖలో అమలు చేస్తున్న డిజిటల్‌ విధానాలు, వీఎస్‌కేల పనితీరును వివరించారు.

ముఖ్యంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో యాప్‌ ద్వారా లెక్కించడం, ఆన్‌లైన్‌ విధానంలో విద్యార్థుల హాజరు, ట్రాకింగ్‌ చేయడం వంటివి వివరిండంతో ఎన్సీఈఆర్టీ ప్రశంసించింది. ఐఎఫ్‌పీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2డి, 3డీల్లో పాఠాలు బోధించడం అద్భుతమని సీఐఈటీ జాయింట్‌ డైరెక్టర్‌ అమరేంద్ర బెహరా కితాబిచ్చారు. విద్యా సమీక్ష కేంద్రాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంతో ముందుందని, అక్కడి విధానాలను అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించాలని సూచించారు.

ఏపీలో వీఎస్‌కే పనితీరు ఇలా..
♦ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన విజయవాడ, విశాఖపట్నంలలో విద్యా సమీక్ష కేంద్రాలు(వీఎస్‌కే) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రాష్ట్రంలోని 58,465 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న 70,70,143 మంది విద్యార్థుల హాజరును ప్రతిరోజు ట్రాక్‌ చేస్తున్నారు. 

♦  ప్రతిరోజు ఉదయం విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆ వెంటనే ఎంతమంది గోరుముద్ద స్వీకరిస్తారు, ఎవరెవరు కోడిగుడ్డు, రాగిజావ, చిక్కీ తీసుకుంటారనే వివరాలు సైతం ‘ఏఐ’ టెక్నాలజీ అటెండెన్స్‌ యాప్‌లో నమోదవుతున్నాయి.

♦  ఉపాధ్యాయుల ఫేషియల్‌ రికగ్నేషన్‌ సైతం ఇదే తరహాలో ఉదయం 9 నుంచి 9.15 గంటల మధ్య స్కూలు పరిధిలోనే ఫొటోతో నమోదు చేస్తున్నారు. ఇంటర్నెట్‌ సిగ్నల్‌ లేకపోయినా సిగ్నల్‌ వచ్చినప్పుడు టైమ్‌తో సహా అప్‌డేట్‌ అయ్యేలా టెక్నాలజీని రూపొందించారు. ఆ వెంటనే ‘స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ మానిటరింగ్‌ సిస్టం’(సిమ్స్‌)లో నమోదై, ఉదయం 11– 12 గంటల్లోగా విజయవాడ, విశాఖల్లోని విద్యా సమీక్ష కేంద్రాలకు చేరుతాయి. 

♦ ఈ టెక్నాలజీ రాకతో గతంలో రోజుకు 68 శాతం కంటే తక్కువగా ఉన్న హాజరు... ఇప్పుడు 99 శాతం పైగా నమోదవుతోంది. 

♦ విద్యార్థి ఒక్కరోజు స్కూలుకు రాకపోతే తల్లిదండ్రులకు, వరుసగా మూడురోజులు రాకపోతే విద్యార్థి ఇంటి పరిధిలోని వలంటీర్‌కు, నాలుగు రోజులు హాజరుకాకపోతే గ్రామ, వార్డు సంక్షేమ కార్యదర్శికి, ఎంఈవో, డీఈవోలకు సమాచారం అందుతుంది. వారు కారణాలను తెలుసుకుని ఆ వివరాలను యాప్‌లో నమోదు చేసి సమస్యకు పరిష్కారం చూపించాలి. 

♦  ఇందుకోసం జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది సిబ్బంది, జోన్‌కు ఒక్కరు చొప్పున నలుగురు పర్యవేక్షకులు ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండి, ఆరోజు అంశాలను అదేరోజు పరిష్కరిస్తున్నారు. 

♦  విజయవాడ సెంటర్‌ నుంచి టీచర్స్‌ అటెండెన్స్, గోరుముద్ద, బైజూస్, అకడమిక్‌ అంశాలను, విశాఖపట్నం కేంద్రం ద్వారా విద్యార్థుల హాజరు, కన్‌స్టెన్‌ రిథమ్‌(నాడు–నేడు), జేవీకే, డీబీటీ అంశాలను పర్యవేక్షిస్తున్నారు.

♦  డిజిటల్‌ టెక్నాలజీని అత్యంత పకడ్బందీగా వినియోగిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపు పొంది, ఇప్పుడు ఎన్సీఈ­ఆర్టీతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దృష్టిని ఆకర్షించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement