పోలీస్‌ ‘తిరుగుబాటు’ | AP Police Fires On Chandrababu Naidu Govt Over Redbook In Andhra Pradesh, More Details Inside | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ‘తిరుగుబాటు’

Aug 19 2025 3:56 AM | Updated on Aug 19 2025 10:56 AM

AP Police Fires on Chandrababu Govt Over Redbook: Andhra Pradesh

రాష్ట్ర చరిత్రలో తొలిసారి బహిరంగంగా ఎదురుతిరిగిన పోలీసులు

రెడ్‌బుక్‌ వేధింపులపై మూకుమ్మడిగా నిరసన గళం

డీజీపీ గుప్తా వితండవాదాన్ని తిప్పికొట్టిన పలువురు అధికారులు

వెయింటింగూ పోస్టింగేనన్న తన మాటను నెగ్గించుకునేందుకే డీజీపీ ఎత్తు

అందుకే ఉదయం, సాయంత్రం వచ్చి బయోమెట్రిక్‌ వేయాలని ఆదేశాలు

డిపార్ట్‌మెంట్‌లో సంచలనంగా మారిన పోలీసు అధికారుల వ్యవహారం

పోస్టింగ్‌లు ఇవ్వకుండా సాధిస్తుండడంపై నిలదీత

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ వేధింపులపై పోలీసు అధికారులు తిరుగుబావుటా ఎగురవేశారు. రాష్ట చరిత్రలో తొలిసారిగా... వందమందికి పైగా అధికారులు ఒకేసారి బహిరంగంగా గళం వినిపించారు. పోస్టింగులు ఇవ్వకుండా సాధిస్తుండడంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. ఏడాదికిపైగా జీతా­లు లేవు... కుటుంబాలను ఎలా పోషించేదని నిల­దీశారు. పైగా... ఇప్పుడు బయోమెట్రిక్‌ హాజరు అంటూ వేధింపులను మరింత తీవ్రం చేయడంపై మండిపడ్డారు.

అసలు పోస్టింగులే లేవు... ఇక మా కు­టుంబాలు ఎక్కడ ఉండాలి? మేం బయోమెట్రిక్‌ హాజరు ఎలా వేయాలి? అని ప్రశ్నించారు. ఇదంతా పోలీసు ప్రధాన కార్యాల­యంలోనే జరగడం గమ­నార్హం. దీంతో క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు అధికారులు కూడా నిరసన స్వరం వినిపించేంతగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మరోసారి స్పష్టమైంది. యావత్‌ పోలీస్‌ యంత్రాంగంతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది ఈ ఉదంతం. ఇంతకూ ఏం జరిగిందంటే...?

తీరు మార్చుకోకపోగా.. మరింత దారుణంగా
చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 24 మంది ఐపీఎస్‌ అధికారులతో సహా 199 మంది పోలీసు అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధింపులకు తెరతీసింది. ఈ తీరుపై జాతీయస్థాయిలో విమ­ర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం తీరు మార్చుకోలేదు. ఏడాదికి పైగా సమయం నుంచి పోలీసు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇది చాలదన్నట్లుగా... అదనపు ఎస్పీ నుంచి సీఐ స్థాయి వరకు పోస్టింగులు లేకుండా వెయిటింగ్‌లో ఉన్న వందమందికి పైగా అధికారులను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. పోస్టింగుల విషయం తేలు­స్తారని ఆశతో వెళ్లిన అధి­కారులు అసలు విషయం తెలిసి అవాక్క­య్యారు. రిసెప్షన్‌ వద్ద చెప్పిన ప్రకా­రం ఆ అధికా­రులు అదన­పు డీజీ మధుసూదన్‌­రెడ్డిని కలిశారు. వెయిటింగ్‌లో ఉన్నవారంతా రోజూ ఉద­యం, సా­యంత్రం డీజీపీ కార్యాలయంలో బయో­మెట్రిక్‌ హా­జరు వేయాలని మధుసూదన్‌రెడ్డి చెప్పా­రు. డీజీపీ హరీశ్‌కు­మార్‌గుప్తా ఈ మేరకు ఆదేశించినట్లు   తెలిపారు. 

ఆవేశం, ఆవేదన కలగలిపి నిరసన స్వరం
అదనపు డీజీ చెప్పిన సమాచారంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు. శాఖలో ఎన్నడూ లేని రీతిలో... ఆవేశం, ఆవేదన కలగలిపి నిరసన స్వరం బలంగా వినిపించారు. ‘‘డీజీపీ అంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి తండ్రివంటివారు. ఏడాది పైగా మాకు పోస్టింగులు లేవని, జీతాలు ఇవ్వడం లేదనే విషయం ఆయనకు తెలియదా? వందలమంది పోలీసు అధికారులు కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు? పిల్లల చదువులు, ఇతర బాధ్యతలు ఎలా నిర్వరిస్తున్నారు? అని డీజీపీ ఏనాడైనా ఆలోచించారా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వేధింపులు చాలవన్నట్టు ఇప్పుడు డీజీపీ కార్యాలయంలో రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్‌ హాజరు వేయాలని చెప్పడం ఏమిటని ధ్వజమెత్తారు. 

ఎక్కడ ఉండాలి..?
‘‘కుటుంబాలన్నీ మేం ఏడాది క్రితం పనిచేసిన పట్టణాలు, నగరాల్లో ఉండిపోయాయి. పోస్టింగ్‌ లేకుండా మేం కుటుంబాలతో సహా ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉండాలి...? డీజీపీ కార్యా­లయానికి రోజూ ఉదయం, సాయంత్రం ఎలా వచ్చేది?’’ అని సూటిగా పోలీసు అధికారులు ప్రశ్నిం­చారు. ‘‘పోస్టింగులు ఇవ్వండి. ఎక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తాం. ఉదయం, సాయంత్రం ఏమిటీ...? రోజుకు పదిసార్లు బయోమెట్రిక్‌ వేయమన్నా వేస్తాం’’ అని స్పష్టం చేశారు. అంతేగానీ, పోస్టింగులు లేకుండా జీతాలు ఇవ్వకుండా రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్‌ వేయమని చెప్పడం అమానవీయం అని వాపోయారు.

పోలీసు అధికారుల ఆగ్రహం చూసి అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి అవాక్కయ్యారు. అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తప్పుబట్టే అంశం ఏదీ లేకపోవడంతో ఆయన వారిని ఏమీ అనలేకపోయారు. వారి ఆవేదన పట్ల తనకూ సానుభూతి ఉందని చెప్పినట్టు సమాచారం. డీజీపీ గుప్తా ఆదేశాలనే తాను చేరవేశానని అన్నారు. సమస్యను డీజీపీతోనే చర్చించాలని సూచించారు.

తన మాటను నెగ్గించుకునేందుకే...
‘‘వెయిటింగ్‌లో ఉన్నా పోస్టింగే’’ అనే తన మాటను నెగ్గించుకునేందుకే డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తాజా ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెయిటింగ్‌లో ఉన్న అధికారులు రోజూ ఉదయం, సాయంత్రం వచ్చి బయోమెట్రిక్‌ హాజరు వేయాలని ఆదేశించినట్లు సమాచారం. కానీ, అనూహ్యంగా అధి­కారులు పూర్తిగా ఎదురు తిరగడంతో  పోలీస్‌ బాస్‌లకు నోట మాట రాలేదు. కాగా, ఈ పరిణామం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో తీవ్ర చర్చ­నీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల రెడ్‌­బుక్‌ కుట్ర, అందుకు వత్తాసు పలుకుతున్న పోలీసు బాస్‌ల తీరుతో తమ డిపార్ట్‌మెంట్‌ ఆత్మగౌరవం దెబ్బతింటోందని పోలీసు వర్గాలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

పోస్టింగులపై హామీ ఇవ్వని డీజీపీ
అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డిని కలి­సిన అనంతరం పోలీసు అధికా­రులు కొందరు జట్టుగా, మరికొందరు విడివిడిగా డీజీపీ హరీశ్‌­కుమార్‌గుప్తా వద్దకు వెళ్లినట్లు సమా­చారం. సమస్యలను ఆయ­నకు కూడా వివరించినట్లు తెలిసింది. పోస్టింగులపై డీజీపీ వారికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. కాగా, అధికారులకు ఏడాదికి పైగా పోస్టింగులు ఇవ్వ­కుండా వేధిస్తుండడాన్ని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఇటీవల సమర్థించుకోవడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. ‘‘పోలీసు శాఖలో వేకెన్సీ రిజర్వ్‌ (వీఆర్‌)లో ఉండడం కూడా పోస్టింగే. వీఆర్‌ అన్నది శాంక్షన్డ్‌ పోస్టే’’ అని ఆయన వ్యాఖ్యానించడం గమ­నార్హం. దీనిపై పోలీసు అధికారులు తీవ్రంగా స్పందించారు. ‘‘...మరి వీఆర్‌లో ఉన్న పోలీసు అధికారులకు నెలనెలా జీతాలు ఇస్తున్నారా? ఏడాదిగా జీతా­లివ్వకుండా పోస్టింగ్‌లో ఉన్నట్టే అని ఎలా ప్రకటిస్తారు’’? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement