2024 నాటికి... సముద్ర వాణిజ్యంలో ఏపీ నంబర్‌ 1

AP No 1 In Maritime Trade By 2024 - Sakshi

కార్గో సామర్థ్యం 400 మిలియన్‌ టన్నులకు పెంచడమే లక్ష్యం

చకచకా ఏర్పాట్లు చేస్తున్న ఏపీ మారిటైమ్‌ బోర్డు

సాక్షి, అమరావతి: దేశ సముద్ర ఆధారిత (మారిటైమ్‌) వాణిజ్యంలో మొదటి స్థానం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పోర్టులు నిర్మించడం ద్వారా ప్రస్తుతం సుమారు 100 మిలియన్‌ టన్నులుగా ఉన్న కార్గో హ్యాండలింగ్‌ సామర్థ్యాన్ని 2024 నాటికి 400 మిలియన్‌ టన్నులకు చేర్చాలని ఏపీ మారిటైమ్‌ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టులు, 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టింది.

తొలిదశలో రామాయపట్నం, భావనపాడు పోర్టులు, ఉప్పాడ, జువ్వెలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటి తొలిదశ నిర్మాణాలకు 15 రోజుల్లో టెండర్లు జారీ చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో శంకుస్థాపన చేయడం ద్వారా రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  రామాయపట్నం, భావనపాడు పోర్టుల డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)కు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పోర్టుల నిర్మాణ పనులు, నిధుల సేకరణ పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీల(పీఎంసీ)నూ నియమించింది. భావనపాడు పీఎంసీగా టాటా కన్సల్టింగ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌– ఇన్‌రోస్‌ లాక్కనర్‌ ఎస్‌ఈ కన్సార్టియం, రామాయపట్నానికి ఏఈకామ్‌ సంస్థ వ్యవహరించనుంది.

వైఎస్సార్‌ తర్వాత వైఎస్‌ జగనే..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో మూడు మైనర్‌ పోర్టులు నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా ఒక్క ఓడరేవు నిర్మాణం జరగలేదు. వైఎస్సార్‌ హయాంలో గంగవరం, కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు, కృష్ణపట్నం పోర్టులను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొత్తగా రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌ల్లో ఓడ రేవుల నిర్మాణంతో పాటు ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్లను నిర్మించనున్నారు.

మారిటైమ్‌లో అపార అవకాశాలు
రాష్ట్రంలో సముద్ర ఆధారిత వాణిజ్యంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారిస్తున్నాం. ఇప్పటికే రామాయపట్నంలో 1,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడానికి జపాన్‌ ఆసక్తి చూపిస్తోంది. కొత్త రేవుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం.
– మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి

గుజరాత్‌తో పోటీపడుతున్నాం
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం ద్వారా 2024 నాటికి కార్గో హ్యాండలింగ్‌ సామర్థ్యాన్ని 400 మిలియన్‌ టన్నులకు చేర్చాలన్నది లక్ష్యం. ప్రస్తుతం దేశంలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్‌తో పోటీ పడుతున్నాం.
– రాష్ట్ర మారిటైమ్‌ బోర్డు సీఈఓ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top