
ఆటో డ్రైవర్లపై ఆంక్షలు
సరుకులతో ఆటోలు తిప్పొద్దని హుకుం
ప్రయాణికులను మాత్రమే రవాణా చేయాలి
సాక్షి టాస్క్ ఫోర్స్: కూటమి నాయకులు అధికార దర్పంతో సామాన్యులను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఓ నేత తన వ్యాపారం కోసం ఏకంగా ఆటో డ్రైవర్లుపై ఆంక్షలు విధించడం చర్చ నీయాంశంగా మారింది. సరుకులతో కాకుండా ప్రయాణికులను మాత్రమే ఆటోలు తిప్పుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఆటో వాలాలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.
కొలిమిగుండ్ల మండలం పెట్నికోట సమీపంలోని కొండ ప్రాంతంలో కొత్తగా అ్రల్టాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనులు చేసేందుకు వచ్చారు. కొలిమిగుండ్లలోని కస్తూర్బా పాఠశాల వద్ద ఉన్న ఇండస్ట్రీయల్ పార్కు సమీపంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకుని రాక పోకలు సాగిస్తున్నారు.
కాగా ప్రతి ఆదివారం వారు నిత్యావసర సరుకులు, కాయగూరలు, చికెన్, కోడిగుడ్లు, దుస్తులు కొనుగోలు చేసేందుకు మండల కేంద్రం కొలిమిగుండ్లకు వస్తుంటారు. కార్మికులు కొలిమిగుండ్లలో సరుకులు కొనుగోలు చేశాక ఆటోల్లో ఫ్యాక్టరీ పని ప్రదేశానికి వెళుతుంటారు. అయితే ఫ్యాక్టరీ ఆవరణలో కూటమికి చెందిన ఓ నాయకుడు కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. తన దుకాణంలోనే కార్మికులు సరుకులు కొనుగోలు చేసేందుకు ఆటో డ్రైవర్లపై బెదిరింపులకు పాల్పడ్డాడు. లగేజీతో కాకుండా మనుషులను మాత్రమే తీసుకు రావాలని ఆటో డ్రైవర్లపై మూడు వారాలుగా ఒత్తిడి చేస్తూ వస్తున్నా డు.
ఈ విషయంపై మూడు రోజుల క్రితం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి కొలిమిగుండ్లకు వచ్చిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని ఆటో వాలాలు కలిసి వినతి పత్రం అందించారు. ఈ ఆదివారం కూడా కార్మికులు లగేజీతో ఆటోల్లో వెళ్లడంతో వారితో వాగ్వావాదానికి దిగాడని డ్రైవర్లు పేర్కొన్నారు. ఆటోల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న తమపై కూడా ఆంక్షలు విధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ఆటో ఫైనాన్స్ కంతులు ఎలా కట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ∙