20 సినిమాలకు పైగా షూటింగ్‌.. జానకిరాముడు, ప్రేమదేశం తీసింది అక్కడే..

AP Government Funds For Araniyar Reservoir Tourism Development - Sakshi

పిచ్చాటూరు(చిత్తూరు జిల్లా): జిల్లాలోనే అతిపెద్ద జలాశయం అరణియార్‌ బహుసుందరంగా మారనుంది. బోటింగ్‌ సరదా తీర్చనుంది. సినిమా షూటింగులకు అనువుగా తయారుకానుంది. రిసార్టులు కొలువుదీరేందుకు ప్రణాళిక సిద్ధమైంది. చిల్ర్టన్స్‌ పార్క్, ఉద్యానవనం, పచ్చిక బయళ్లు, వ్యూ టవర్‌ వంటి నిర్మాణాలతో ముస్తాబు కానుంది. తిరుమల– చెన్నై మార్గంలో పర్యాటక కేంద్రంగా రూపు దిద్దుకోనుంది. ఇందుకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అధికార యంత్రాంగం అరణియార్‌ ప్రాజెక్టు సుందరీకరణకు శ్రీకారం చుట్టింది.

అరణియార్‌ పర్యాటకానికి మహర్దశ కలగనుంది. ప్రాజెక్టు సుందరీకరణ, అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి తుడాతో పాటు పర్యాటక శాఖకు గత ఏడాది ప్రతిపాదనలు అందాయి. అంతే వేగంగా స్పందించిన తుడా రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జనవరి 3న తుడా వీసీ హరికృష్ణ అరణియార్‌ను సందర్శించి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటక శాఖకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అరణియార్‌ అభివృద్ధి, సుందరీకరణ పనులకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వద్ద జైకా నిధులు రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

పిచ్చాటూరు అరణియార్‌ గేట్ల వద్ద ప్రకృతి అందాలు  

అరణియార్‌ వద్ద చేపట్టనున్న పనులు  
తుడా అందించే నిధులతో అరణియార్‌ అందాలన్నీ తిలకించేలా ప్రాజెక్టు వద్ద వ్యూ టవర్‌ నిర్మించను న్నారు. నదిపై సరదాగా ప్రయాణించేందుకు బోటింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అనువుగా కాటేజీలు అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా పర్యాటక  శాఖ అందించే నిధులతో అదనంగా మరో బోటింగ్, రిసార్టులు, చిల్డ్రన్‌ పార్క్, ఉద్యానవనాల అభివృద్ధి, సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌కు అనువుగా పచ్చిక మైదానాలు నిర్మించనున్నారు.

అతి సుందరమైన ప్రదేశం  
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి, మహా నగరమైన చెన్నై జాతీయ రహదారి పక్కనే కొలువైన అతిపెద్ద జలాశయం బహుసుందరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికులకు అరణియార్‌ వద్ద సేద తీరేవారు. ప్రకృతి అందాలు సైతం ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ ఆకట్టుకునే ఉద్యానవనం ఉండడంతో వెండితెర, బుల్లితెర దర్శకులు తరలివచ్చేవారు. అయితే 20 ఏళ్ల క్రితం పర్యాటక నిర్వహణకు నిధులు నిలిపివేయడంతో పార్కులన్నీ వెలవెలబోయాయి. ఇన్నేళ్లకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అరణియార్‌ సుందరీకరణకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరణియార్‌ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులను వేగితరం చేస్తున్నారు.

గతంలో షూటింగ్‌ స్పాట్‌ ఇదే  
పిచ్చాటూరు అరణియార్‌ ప్రాజెక్టు గతంలో షూటింగ్‌ స్పాట్‌గా పేరొందింది. ఇక్కడ సుమారు 20 సినిమాలకు పైగా చిత్రీకరించారు. అందులో ప్రధానంగా జానకిరాముడు, ప్రేమదేశం, అన్నకిళి, టూటౌన్‌ రౌడీ సినిమాలు సూపర్‌ హిట్‌ అందుకున్నాయి. దీంతోపాటు వందలాది సినిమాల్లో పాటల చిత్రీకరణ ఇక్కడే సాగింది. తెలుగు, తమిళం సినిమాల్లోని పాటల చిత్రీకరణకు ఇది చాలా అనువైన ప్రదేశంగా నిలిచింది. టీవీ సీరియళ్లు ఎక్కువ కాలం పాటు చిత్రీకరించేవారు. నాగమ్మ టీవీ సీరియల్‌ 80 శాతం ఇక్కడే రూపుదిద్దుకుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, రాజేంద్రప్రసాద్, విజయశాంతి, రాధ వంటి తారలు ఇక్కడ సందడి చేసినవారే.

సంతోషంగా ఉంది
గతంలో ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యానవనం, రకరకాల జంతువుల బొమ్మలతో పిల్లలను ఎంతో ఆహ్లాదపరిచేది. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. మళ్లీ ఇక్కడ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. సుందరీకరణను వేగవంతం చేయాలి. 
– తిరుమల, టూటౌన్, పిచ్చాటూరు 

అందుబాటులో ఆహ్లాదం
అరణియార్‌ ప్రాజెక్టును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గతంలోలాగా పర్యాటకులు, సినీ తారలు, దర్శకు లు తరలి రావాలి. ఈ జలాశయం షూటింగ్‌ స్పాట్‌గా సందడి చేయాలి. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం చేకూరడంతోపాటు స్థానికులకు కాస్త ఆహ్లాదం అందుబాటులో ఉంటుంది. 
–గంగాధరం రెడ్డి,  రిటైర్డ్‌ టీచర్, పిచ్చాటూరు

మరిన్ని నిధులు తెప్పిస్తా     
పర్యాటక అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు తేవడానికి నా వంతు కృషి చేస్తా. గతంలో ఈ అరణియార్‌ వైభవాన్ని స్వయంగా చూశాను. కాబట్టే మళ్లీ ఆ స్థితికి రావాలని ప్రయతి్నస్తున్నా. తిరుపతి ఎంపీ గురుమూర్తి సహకారం తీసుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేస్తున్నారు.    
–కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్యే, సత్యవేడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top