
కూటమి అసమర్థ, రెడ్‌బుక్ పాలనతో క్షీణత దిశగా ఏపీ ఆర్థిక వ్యవస్థ
ఈ సర్కారు ఏర్పాటు నుంచి తిరోమగనంలోనే రాష్ట్ర సంపద
అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం తగ్గుతోంది తప్ప పెరగడం లేదు
2023–24 తొలి త్రైమాసికంతో చూస్తే రెవెన్యూ రాబడుల్లో ఏకంగా రూ.9,873 కోట్లు తగ్గుదల
కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా ఏకంగా 90.65 శాతం తగ్గిన కేంద్ర గ్రాంట్లు
2023–24 తొలి త్రైమాసికంతో పోలిస్తే రూ.14,234 కోట్లు తగ్గిన కేంద్ర గ్రాంట్లు
2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే సామాజిక రంగ వ్యయం రూ.7,485 కోట్లు తగ్గుదల
ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసిక బడ్జెట్ గణాంకాలను వెల్లడించిన కాగ్
సాక్షి, అమరావతి : కూటమి ప్రభుత్వ అసమర్థ, రెడ్‌బుక్ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బక్కచిక్కిపోతోంది. సంపద పెరగకపోగా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వచ్చిన సంపదను కూడా కూటమి సర్కారు ఆవిరి చేసేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఇందుకు నిదర్శనం అమ్మకం పన్ను రాబడులు తగ్గిపోవడమే. దీంతోపాటు రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో తగ్గిపోయాయి.
మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర సంపద తిరోగమనంలోనే పయనిస్తోంది. అమ్మకం పన్ను రాబడితో పాటు పన్నేతర ఆదాయం తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. ఇందుకు కాగ్ గణాంకాలు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) బడ్జెట్ గణాంకాలను కాగ్ వెల్లడించింది.
» సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు పెద్దపెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు తీరా సీఎం అయ్యాక సంపద సృష్టించడం దేవుడెరుగు 2023–24లో వైఎస్ జగన్ పాలనలో వచ్చిన సంపద కూడా రాకుండా ఆవిరి చేసేస్తున్నారు. అప్పులను మాత్రం భారీగా పెంచేశారు. అయినా, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు.
» 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో రెవెన్యూ రాబడులు ఏకంగా రూ.9,873 కోట్లు (21.41 శాతం) తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. అంటే... వైఎస్ జగన్ పాలనలో 2023–24 తొలి త్రైమాసికంలో వచ్చినంత కూడా రాకపోగా ఇంకా తగ్గిపోయాయి. సాధారణంగా ఏటా రెవెన్యూ రాబడులు ఎంతో కొంత పెరగాలి గానీ అంతకుముందు సంవత్సరాల కంటే తగ్గకూడదు. ఒకవేళ తగ్గాయి అంటే రాష్ట్ర సంపద తిరోగమనంలో ఉన్నట్టే.
» అమ్మకం పన్ను రాబడి కుడా తగ్గిపోయింది. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో అమ్మకం పన్ను రాబడి రూ.369 కోట్లు తగ్గిపోవడంతో వృద్ధి 7.78 శాతం తిరోగమనంలోకి వెళ్లింది. అమ్మకం పన్ను రాబడి తగ్గిపోతున్నదంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్లు అర్థం అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే అమ్మకం పన్నులో వృద్ధి నమోదవుతుందని లేదంటే రాబడి తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు.
» కూటమి ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర గ్రాంట్లు కుడా గణనీయంగా తగ్గడం గమనార్హం. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 2025–26 తొలి త్రైమాసికంలో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఏకంగా రూ.14,230 కోట్లు తగ్గిపోయాయి. 90.95 శాతం మేర కేంద్ర గ్రాంట్లు తగ్గిపోయినట్లు తేలుతోంది.

» బాబు అధికారం చేపట్టిన నాటి నుంచి పన్నేతర ఆదాయంలో తరుగుదలే తప్ప పెరగడం లేదు. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 2025–26 తొలి త్రైమాసికంలో పన్నేతర ఆదాయం రూ.111 కోట్లు తగ్గిపోయింది. వృద్ధి 8.06 శాతం తగ్గింది.
» మరోవైపు సామాజిక రంగ వ్యయం (విద్య వైద్యం, సంక్షేమ రంగాలకు చేసేది) గతం కన్నా సాధారణంగా పెరగాలి. కానీ, వైఎస్ జగన్ సర్కారుతో పోల్చితే బాబు ప్రభుత్వంలో తగ్గిపోయింది. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో రూ.7,495 కోట్లు (15.28 శాతం) తగ్గింది.

» ఈ ఆర్థిక ఏడాది మూడు నెలల్లో బాబు సర్కారు ఏకంగా రూ.36,384 కోట్లు అప్పులు చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. మూలధన వ్యయం రూ.6,053 కోట్లు మాత్రమే అని పేర్కొన్నాయి. ఇదే 2023–24 తొలి త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.12,669 కోట్లు ఉండడం విశేషం. సాధారణంగా అమ్మకం పన్నులో ఎంతో కొంత వృద్ధి ఉండాలి. అలాంటిది 2023–24 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చిన అమ్మకం పన్ను రాబడి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రాలేదంటే ఆందోళన కలిగించే విషయమేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
» సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చిన సంపదను కూడా రాబట్టలేక ఉన్నదానిని ఆవిరి చేసేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై భారీ అప్పుల భారం మోపుతున్నారు.