పల్లె గర్వించేలా .. దేశం తలెత్తుకునేలా..

AP CM YS Jagan Mohan Reddy  Congratulate Hockey Goal Keeper In Chittoor - Sakshi

అది అటవీ సరిహద్దులోని మారుమూల గ్రామం. ఇప్పుడు ఆ పల్లె పేరు అంతర్జాతీయ స్థాయిలో చర్చానీయాంశంగా మారింది. భారత హాకీ జట్టులో గోల్‌ కీపర్‌గా రాణిస్తున్న రజని స్వస్థలం ఎర్రావారిపాళెం మండలంలోని యనమలవారిపల్లె. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ యువతి ఇప్పుడు దేశం గర్వించేలా ఒలింపిక్‌ మెడల్‌ సాధన దిశగా తన బృందం సభ్యులతో కలిసి దూసుకెళ్తోంది.  

సాక్షి,  ఎర్రావారిపాళెం(చిత్తూరు): మండలంలోని కమళ్ల గ్రామం యనమలవారిపల్లె కుగ్రామానికి చెందిన రమణాచారి, తులసి దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు ఆడ పిల్లలు కాగా, ఒక కుమారుడు. రమణాచారి వడ్రంగి పని చేస్తుండగా, తులసి పశువుల కాపరి. సంతానంలో రెండో కుమార్తె రజని 1 నుంచి 5వ తరగతి వరకు పచ్చారువాండ్లపల్లెలో, 6 నుంచి 10 వరకు నెరబైలు పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత తిరుపతిలో ఉన్నత విద్యను అభ్యసించింది. 

హాకీకి నెరబైలే పునాది
నెరబైలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రజని హాకీ క్రీడకు బీజం పడింది. అక్కడ 8వ తరగతి చదువుతుండగా పీఈటీ వెంకటరాజు సహకారంతో ఈ క్రీడ పట్ల ఆసక్తి పెంచుకుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రజనీ ఆటతీరును గుర్తించిన పీఈటీ  ప్రోత్సాహంతో జోనల్‌ ప్లేయర్‌గా ఉన్న ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. 2005లో తిరుపతి సాయ్‌ హాస్టల్‌లో ఉంటూ హాకీ కోచ్‌ ప్రసన్నకుమార్‌ రెడ్డి ప్రోత్సాహంతో తన ఆట తీరును మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత జట్టులో గోల్‌ కీపర్‌గా ప్రాతినిధ్యం వహిస్తోంది.  

2004: 6వ తరగతిలోనే పుత్తూరులో జరిగిన జోనల్స్‌లో రన్నర్స్‌గా నిలిచింది. 
2005: తిరుపతిలో జరిగిన ఇంటర్‌ జోనల్స్‌కు ప్రాతినిధ్యం వహించింది. 
2005: పంజాబ్‌ రాష్ట్రం జలందర్‌లో పాల్గొని సత్తాచాటింది 
2006: ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. 
2007: కోయంబత్తూరు, ఇబల్‌పూర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా 
2008: రూర్కెలాలో జాతీయ పోటీల్లో విజయం. 
2009: మొదటి సారి అంతర్జాతీయ మ్యాచ్‌లో ప్రవేశం 
2010: చైనా, న్యూజిల్యాండ్, చైనా, కొరియా, అర్జెంటినాలో ఆడింది. 
2011: ఆస్ట్రియా పోటీల్లో ఈమె జట్టు సిల్వర్‌ మెడల్‌ సాధించింది. 
2012: జనవరిలో ఢిల్లీలో జరిగిన హాకీలో చాంపియన్‌గా నిలిచింది. 
2013: నెదర్‌లాండ్, జర్మనీ, మలేషియా మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం. 
2016: ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 
2017: జపాన్‌లో జరిగిన ఏషియన్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో ఆసియా చాంపియన్లుగా నిలింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశంస  
హాకీ క్రీడాకారిణి, గోల్‌ కీపర్‌ రజనీని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. ఇటీవల ఆమె తల్లిదండ్రులను ఆయన సత్కరించారు. చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించేలా పిల్లలను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.  

గర్వంగా ఉంది 
కూతుళ్లంటే మాకు ప్రాణం. ఇద్దరికి పెళ్లిళ్లు చేసినా, రజని బాగా చదువుతుండడంతో ఎంత కష్టమైనా ముందుకు తీసుకెళ్దామనుకున్నాం. హాకీ ఇష్టమని చెప్పడంతో ప్రోత్సహించాం. ఆడపిల్లకు ఆటలు ఏమిటని ఊర్లో కొందరు గేలి చేసినా పట్టించుకోలేదు. ముము అనుకున్నట్లుగానే రాణించింది. ఇప్పుడు మా పాపను చూస్తుంటే గర్వంగా ఉంది. ఊరు తలెత్తుకునేలా చేసింది మా కూతురు. 

– రజని తల్లిదండ్రులు రమణాచారి, తులసి  

మాటల్లో చెప్పలేని ఆనందం 
రజనితో పాటు నలుగురు యువతులు 2005లో సాయ్‌కి ఎంపికయ్యారు. వీరిలో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రజని ఆట పట్ల ఎంతో ఆసక్తి కనపర్చింది. ఆమె అంకితభావం, క్రమశిక్షణ కారణంగానే ఇప్పుడు ఈ స్థాయిలో రాణిస్తోంది. రెండోసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం అంత సులువైన విషయం కాదు. గురువుగా ఆమె ఎదుగుదల నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. 

 – ప్రసన్నకుమార్‌రెడ్డి, హాకీ కోచ్, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, తిరుపతి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top