సర్వ సేవాలయాలు

AP CM YS Jagan Key Directions To Officers In High Level Review - Sakshi

సచివాలయాల్లో తొలి విడతగా అక్టోబర్‌ 2న శాశ్వత భూహక్కు పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్లు

రిజిస్ట్రేషన్‌ అనుబంధ సేవలూ అందించాలి.. సిబ్బంది, ప్రజల్లో విస్తృత అవగాహనకు చర్యలు 

ఓటీఎస్‌ లబ్ధిదారులకు వేగంగా రిజిస్ట్రేషన్లు

వడివడిగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లు 

వెదురు పెంపకాన్ని అటవీశాఖ ప్రోత్సహించాలి

సులియారీ గనుల నుంచి జెన్‌కో, పరిశ్రమలకు బొగ్గు సరఫరా 

బొగ్గు గనుల వేలంలో పాల్గొనడంపై ఎండీసీ దృష్టి పెట్టాలి

వాణిజ్య పన్నుల శాఖ సమర్థత పెరిగేలా చర్యలు 

డేటా అనలిటిక్స్, లీగల్‌ సెల్‌ విభాగాల ఏర్పాటు

బకాయిల వసూలుకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ సదుపాయం

మరింత సేవల కోసం వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

అక్రమ మద్యం తయారీ, రవాణాపై కఠిన చర్యలు 

ఉన్నతస్థాయి సమీక్షలో  సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూముల సర్వేలో భాగంగా అక్టోబరు 2న తొలివిడతగా గ్రామాల్లో శాశ్వత భూహక్కు– భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు సత్వరమే అందించాలని సూచించారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం (ఓటీఎస్‌) లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని నిర్దేశించారు. వాణిజ్య పన్నుల శాఖలో సమర్థత పెంచే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, అటవీ శాఖలపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

14 వేల మందికి శిక్షణ
ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ గ్రామాల సంఖ్య మరింత పెరగనుందని అధికారులు తెలిపారు. 14 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 2న తొలివిడత కింద రిజిస్ట్రేషన్‌ సేవలు, భూహక్కు–భూరక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచేలా కృషి చేయాలని సీఎం సూచించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు (ఓటీఎస్‌) పథకం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని నిర్దేశించారు.

అక్రమ మద్యంపై కఠిన చర్యలు
అక్రమ మద్యం తయారీ, రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖకు సూచించారు.

2,700 క్వారీల్లో పనులు మొదలయ్యేలా..
మైనర్‌ మినరల్స్‌కి సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కిపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో కార్యకలాపాలు మొదలయ్యేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

బొగ్గు మన అవసరాలకే
ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని అధికారులు తెలిపారు. జెన్‌కో సహా రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దీనివల్ల జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా ఈ బొగ్గును మన అవసరాలకు వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. తదుపరి బొగ్గు గనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టి పెట్టాలని ఏపీఎండీసీకి సూచించారు.

వాణిజ్య శాఖలో సమూల మార్పులు
వాణిజ్య పన్నుల శాఖలో సమర్ధత పెంపొందించే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం తెలిపారు. ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టత ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. డేటా అనలిటిక్స్‌తో పాటు లీగల్‌సెల్‌ విభాగం కూడా ఏర్పాటు చేయనున్నారు. పెండింగ్‌ బకాయిల వసూలుకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) సదుపాయం కల్పించాలని నిర్ణయించారు.

జూన్‌ చివరికల్లా వాణిజ్య పన్నుల శాఖలో ఈ విభాగాల ఏర్పాటును పూర్తి చేయనున్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ) కె.నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, అటవీ పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయిప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చి విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఎలాంటి సేవలు పొందవచ్చు అనే అంశాలపై సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కేవలం ఆస్తుల రిజిస్ట్రేషన్లే కాకుండా రిజిస్ట్రేషన్‌ పరంగా అందించే ఇతర సేవలపై కూడా పూర్తి సమాచారం, అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు లభిస్తాయి? ఎలాంటి భద్రత సమకూరుతుందో వివరంగా తెలియచేయాలన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top