సాయికృష్ణ లాకప్‌ డెత్ కేసులో మరో కీలక మలుపు | Another Key Turning Point In The Sai Krishna Case | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ లాకప్‌ డెత్ కేసులో మరో కీలక మలుపు

Jun 30 2026 9:26 AM | Updated on Jun 30 2026 12:18 PM

Another Key Turning Point In The Sai Krishna Case

సాక్షి, విజయవాడ:  రాష్ట్రంలో  సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో కీలక సాక్షుల నుంచి సిట్‌ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్‌, ఆర్‌ఎంపీ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణకు పోలీస్‌స్టేషన్‌లోనే ఆర్‌ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. సాయికృష్ణ లాకప్‌డెత్‌ ఎపిసోడ్‌ బయటకు రాగానే ఆర్‌ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్‌, ఆర్‌ఎంపీని సిట్‌ బృందం ప్రశ్నిస్తోంది.

సాయికృష్ణ లాకప్‌డెత్, శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు అశోక్, నాని విజయవాడ సౌత్‌జోన్‌ ఏసీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం లొంగిపోయారు. అనంతరం పోలీసులు వీరిని సిట్‌ కార్యాలయానికి తరలించారు.  ఇప్పటికే సిట్‌ వీరి ఇద్దరిపై  కేసు నమోదు చేస్తున్నట్లు కోర్టులో మెమో జారీ చేసింది. వీరిద్దరు గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు.

వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని విచారణకు హాజరుకావాలని కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు అందజేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో క్రైం కానిస్టేబుల్‌ బాబూరావును ఇప్పటికే సిట్‌ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇక  మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్‌ను కూడా అదుపులోకి తీసుకొని, ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం.  ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లను విచారిస్తే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రావడంతోపాటు ఈ దారుణంలో ఉన్న అనుమానాల చిక్కుముడులు వీడతాయనే భావన వ్యక్తమవుతోంది. కాగా, కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో మరో  10 మంది కానిస్టేబుళ్లను ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించే దిశలోనే దర్యాప్తు! 
మొత్తం మీద ఈ దారుణంలో ప్రభుత్వ, పోలీసు పెద్దల పాత్రను రక్షించే విధంగానే సిట్‌ దర్యాప్తు పక్కా ప్లాన్‌తో జరుగుతోందన్న భావన పోలీసు వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో  సీసీ ఫుటేజీ మొత్తం మాయం చేశారు.  నాలుగు హార్డ్‌ డిస్క్‌లను ఫార్మెట్‌  చేశారని తెలుస్తోంది. దీనిని రికవరీ చేయడం సాధ్యమే అయినా, ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. సిట్‌ కూడా ఫోరెన్సిక్‌ ద్వారా  సీసీ ఫుటేజీ రికవరీ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. సీసీ ఫుటేజిని రికవరీ చేయడం కష్టమనే భావన వ్యక్తం అవుతుంది.  కేసులో కీలక ఆధారమైన సీసీ ఫుటేజీ లేకపోతే,, కేసులో పురోగతి కష్టమనే భావన పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతోంది.  ఇప్పటి వరకు సిట్‌ దర్యాప్తు కేవలం స్టేట్‌మెంట్ల పరిశీలన, అనుమానాస్పందంగా ఉన్నవారిని విచారించడం మినహా,  కేసులో కీలక ఆధారాలు మాత్రం సేకరించలేదని సమాచారం. 

లాకప్ డెత్ కేసులో కొత్త ఆధారాలు.. సాయికృష్ణ కేసులో సంచలన ట్విస్ట్!

క్రాంతి ఆత్మహత్యపై ‘సాగు’తున్న దర్యాప్తు 
మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్‌  ఉదంతంపైన చేస్తున్న దర్యాప్తు మందకొడిగా సాగుతోంది.  ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ఏసీపీ సత్యానందం రెండు రోజుల క్రితమే క్రాంతికుమార్‌ ఇంటికి వెళ్లి  అతని తండ్రి, కుటుంబ సభ్యులనుంచి స్టేట్‌మెంటు రికార్డు చేశారు. స్టేషన్‌కు సోమవారం తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావును పిలిచి పలు అంశాలపై ఏసీపీ విచారించారు.

సస్పెండ్‌ అయిన కానిస్టేబుల్‌ సురేశ్‌  గురించి కూడ వివరాలు అడిగినట్లు తెలుస్తోంది.  సీఐ నాగరాజు ఎలా వేధించింది క్రాంతికుమార్‌ సెల్ఫీ వీడియోనే చెబుతోంది కదా అని విచారణాధికారికి తండ్రి నివేదించినట్లు సమాచారం. ప్రధానంగా మాదిగ పుట్టుక పుట్టడం, బూటు పాలిష్‌ చేయడం వంటి అంశాలతో తీవ్ర వేదన చెందినట్లు ఆయన పోలీసులకు తెలిపారు.  కాగా నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న డిమాండ్లపై అధికారులు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement