
యాజమాన్యం, బ్యూరోపై కర్నూలు పోలీసుల నమోదు
‘రాయలసీమలో అనకొండ ఐపీఎస్’ పేరుతో ఈనెల 25న కథనం
తనపై వార్త రాశారని ప్రెస్‌మీట్‌లో చెప్పిన డీఐజీ కోయ ప్రవీణ్
డీఐజీ సీసీ ఫిర్యాదు మేరకు ‘సాక్షి’పై కేసు నమోదు.. గతేడాది డిసెంబరులో కూడా అక్రమ కేసు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘సాక్షి’పై ప్రభుత్వ కక్షసాధింపు, పోలీసుల అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే అక్రమ కేసులు నమోదుచేస్తామని పత్రికలను, మీడియాను బెదిరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ‘రాయలసీమలో అనకొండ ఐపీఎస్’ పేరుతో ఓ ఐపీఎస్‌పై ‘సాక్షి’ శుక్రవారం ఓ కథనం ప్రచురించింది. అదే రోజు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ విలేకరుల సమావేశం నిర్వహించి తనపైనే కథనం రాశారని.. తాను నిజాయితీపరుడినని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో శనివారం కర్నూలు త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ‘సాక్షి’పై సెక్షన్ 132, 308 (3), 353 (1)(బి), 356 (3), రెడ్‌విత్ 61(2) బీఎన్‌ఎస్ ప్రకారం అక్రమ కేసు నమోదుచేశారు. డీఐజీ సీసీ రత్నప్రకాశ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సీఐ శేషయ్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ–1గా సాక్షి అమరావతి బ్యూరో, ఏ2గా సాక్షి మేనేజ్‌మెంట్, పబ్లిషర్ పేరును చేర్చినట్లు తెలుస్తోంది.
డీఐజీ సీసీ ఫిర్యాదు చేయడమేంటి?
‘సాక్షి’లో ప్రచురితమైన కథనంలో ఓ ఐపీఎస్ అని మినహా అందులో పేరులేదు. డీఐజీ కోయ ప్రవీణ్ తనపైనే వార్త రాశారని విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. డీఐజీ చెప్పినట్లు ఆయనపైనే వార్త రాస్తే, ఆయన పరువుకు నష్టం వాటిల్లిందని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ, డీఐజీ సీసీ రత్నప్రకాశ్ బాధితుడు ఎలా అవుతారు? అతనెలా ఫిర్యాదు చేస్తారు? అతని ఫిర్యాదు మేరకు కేసు ఎలా నమోదుచేస్తారు? అనేది పోలీసులే చెప్పాలి.
నిజానికి.. ప్రభుత్వం, అధికారులు చేసే మంచిని పత్రికలు ఎలా ప్రచురిస్తాయో, తప్పొప్పులు, లోటుపాట్లు, అవినీతి ఆరోపణలు ఉన్నా అలాగే ప్రచురిస్తాయి. ఇది పత్రికలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇదే భావప్రకటనా స్వేచ్ఛ. దీనిపై బాధితులకు అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. గతంలో అభ్యంతరాలున్న వారు కోర్టులను ఆశ్రయించేవారు. కానీ, కర్నూలు పోలీసులు కొత్త పంథాను అవలంభిస్తున్నారు. తప్పుడు కేసులు నమోదుచేస్తున్నారు. పత్రికలు వార్తలు రాస్తే కేసులు నమోదుచేయడం ఏంటని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు పలుమార్లు ఖండించినా, ఆందోళనలు నిర్వహించినా పోలీసుల్లో మార్పులేదు.

గతంలోనూ తప్పుడు కేసు నమోదు..
ఇక గతేడాది డిసెంబరు 22న కర్నూలులో మునీర్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారు. తన భూమిని మరొకరికి కట్టబెట్టాలని పోలీసులు బెదిరిస్తున్నారని, తాను పనిచేస్తున్న స్కూలుకు పోలీసులు వచ్చి తనను కిడ్నాప్ చేశారని, డీఐజీ కోయ ప్రవీణ్ సూచనలతోనే ఈ వ్యవహారం జరిగిందని.. పలుమార్లు డీఐజీ పిలిపించి కోర్టులతో పనిలేదు, సెటిల్ చేసుకోవాలని చెప్పారని మునీర్ విలేకరులకు చెప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించగా.. వివిధ ఛానెళ్లూ ప్రసారం చేశాయి.
కానీ, అప్పుడు కూడా ‘సాక్షి’పై మాత్రమే కేసు నమోదుచేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ‘సాక్షి’ కథనం రాస్తే త్రీటౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విధులకు సాక్షి విలేకరి ఆటంకం కల్గించారని తప్పుడు కేసు నమోదుచేశారు. కిందిస్థాయి పోలీసులు తప్పుడు కేసులు నమోదుచేస్తే డీఎస్పీ, ఎస్పీలను కలిసి బాధితులు విన్నవిస్తారు. కానీ, ఐపీఎస్ అధికారుల సూచనల మేరకే తప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఇలా పత్రికలపై తప్పుడు కేసులు కడుతుంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో.. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఏ స్థాయిలో తొక్కేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.