
ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై క్రిమినల్ చట్టాలను అసంబద్ధంగా, ఎంపిక చేసినట్లుగా ప్రయోగించారు
ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా ఆగ్రహం
సాధారణ వార్తలు రాసినందుకే వేధింపులా?.. ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆందోళన
ఇతర పత్రికలూ రాశాయి కదా..?
‘సాక్షి’నే లక్ష్యంగా చేసుకోవడం దారుణం.. సంపాదకీయ వివాదాలు సివిల్ అంశాలు
క్రిమినల్ కేసులు నమోదు రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ ధోరణి పత్రికా స్వేచ్ఛపై దాడి అని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును అణచివేయడానికి ఏపీ ప్రభుత్వం క్రిమినల్ చట్టాలను ఆయుధంగా వాడుకుంటోందనేందుకు ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అని అభిప్రాయపడింది. అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించే వార్తలు రాసినందుకు దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై ఒకటికి రెండు కేసులు నమోదు చేసే ఆందోళనకర సంస్కృతి కొనసాగుతోందని పేర్కొంది.
‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసుల నమోదు కూడా ఇందులో భాగమేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లహిరి, ప్రధాన కార్యదర్శి నీరజ్ ఠాకూర్ సోమవారం ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. ‘‘సాధారణ వార్తలు రాసినందుకే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై కేసులు బనాయించి, వ్యవస్థాగతంగా వేధిస్తున్నారు.
ఏపీలోని వేర్వేరు జిల్లాల్లో భారతీయ న్యాయ సంహిత కింద 4 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తను ప్రచురించినందుకే రెండు స్టేషన్లలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అదే వార్తను ఇతర పత్రికలు, మీడియా సంస్థలు సైతం ఇచ్చాయి. కేవలం ‘సాక్షి‘ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని వేధించడం కక్షసాధింపు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించిన తర్వాత, పత్రిక సంపాదకవర్గంపై క్రిమినల్ చట్టాలను అసంబద్ధంగా, ఎంపిక చేసినట్లుగా ప్రయోగించారని అర్థమవుతోంది’’ అని తెలిపారు.
⇒ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో ‘సాక్షి’ జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడాన్ని గమనించామని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్తలు రాసిన జర్నలిస్టులను వేధించకుండా... పోలీసులను కట్టడి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. సంపాదకీయపరమైన వివాదాలను సివిల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, క్రిమినల్ చట్టాల ద్వారా కాదని తాము విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.