
అక్రమ కేసులో.. ‘సాక్షి’ ఎడిటర్‌కు నోటీసులు
నిన్నటిదాకా ‘సాక్షి’ కార్యాలయాలపై టీడీపీ నేతలు, పోలీసుల దాడులు..
ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై తాజాగా పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేసిన కూటమి సర్కారు
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ నేత మాట్లాడిన అంశాలను వార్తగా ప్రచురించడంపై కేసు
డీఎస్పీల పదోన్నతుల్లో లంచాల వ్యవహారంపై కథనం రాసినందుకు మరో అక్రమ కేసు
ఎమర్జెన్సీని మించిన అరాచకం.. దేశంలో తొలిసారి చూస్తున్నాం: పాత్రికేయ సంఘాలు
చంద్రబాబు సర్కారు అప్రజాస్వామిక చర్యలు, మీడియాపై అణచివేత విధానాలను ఖండించిన పాత్రికేయ సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు
అభ్యంతరాలుంటే వివరణ కోరాలేగానీ అక్రమ కేసులు బనాయించడం ఏమిటని విస్మయం
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి సర్కారు ఘోర వైఫల్యాలు.. అంతులేని అవినీతి, అక్రమాలపై ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ‘సాక్షి’ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తోంది. ఎమర్జెన్సీ దురాగతాలను తలదన్నేలా బరి తెగిస్తోంది. ‘సాక్షి’ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు గతంలో పలుచోట్ల దాడులకు తెగబడగా ఇటీవల విజయవాడ ఆటోనగర్‌లోని ప్రధాన కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసులు చొరబడి అరాచకంగా వ్యవహరించడం తెలిసిందే.
గతంలో కార్యాలయాలపై దాడులకు పురిగొల్పగా.. ఇప్పుడు వార్త ప్రచురించినందుకు నోటీసులు, అక్రమ కేసులు నమోదు చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. ఓ రాజకీయ పార్టీ నేత మాట్లాడిన అంశాలను ప్రచురించినందుకు మీడియాపై కేసులు పెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవని ప్రజాస్వామికవాదులు, పాత్రికేయ సంఘాలు పేర్కొంటున్నాయి.
ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే యత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారులతో ఫిర్యాదులు ఇప్పించడం.. ఆ వెంటనే ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం కూటమి సర్కారుకు పరిపాటిగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే.. వాటిని ఖండించవచ్చు లేదా సంబంధిత అధికారి లేదా పదవిలో ఉన్న నాయకుడు పరువు నష్టం దావా వేసుకునే వీలుంది.
అయితే చంద్రబాబు సర్కారు కొత్త సంస్కృతికి తెర తీసింది. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించడం... ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పే ప్రక్రియను ఎంచుకుంది. పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక వార్త వస్తే చాలు.. వెంటనే కేసు రిజిస్టర్ చేయాలనేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలను వార్తగా ప్రచురించినందుకు తాడేపల్లి పోలీసులు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు.
అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా.. బీఎన్‌ఎస్‌ఎస్ 35 (3) కింద నోటీసులు జారీ చేశారు. పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గతనెల 16వ తేదీన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ మాయలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరు నియోజకవర్గంలో 72 వేల ఎకరాల్లోపంట పొలాల ముంపునకు కారణమైందని ఆరోపించారు.
దీనికి సంబంధించి.. ‘అమరావతి కోసం పొన్నూరును ముంచేశారు’ శీర్షికన ప్రచురించిన వార్తపై గుంటూరు ఛానెల్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ అవినాష్ ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు 518/2025 కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాడేపల్లి పోలీసు స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయానికి చేరుకుని ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి నోటీసులు అందచేశారు. బీఎన్‌ఎస్‌ఎస్‌లో సెక్షన్లు 353(1), 61(2), డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2025 సెక్షన్ 54 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అందచేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. దీనితో పాటు మరో అక్రమ కేసులోనూ ఎస్‌ఐ నోటీసులు అందజేశారు.
పోలీసు శాఖలో డీఎస్పీల నుంచి అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించడానికి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు రాసిన ‘పైసా మే ప్రమోషన్’ కథనంపై తాడేపల్లి పోలీసులు మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ అక్రమ కేసులో 61(2), 196(1),353(2) రెడ్‌విత్ 3(5) బీఎన్‌ఎస్‌ఎస్, పోలీసుల్లో అసంతృప్తిని రెచ్చగొట్టడం 1922 చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం గమనార్హం.
తీవ్రంగా ఖండించిన పాత్రికేయ సంఘాలు, సీనియర్ జర్నలిస్ట్‌లు
‘సాక్షి’ దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తకు సంబంధించి ఏకంగా పత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి, రిపోర్టర్, వార్తను వెబ్ ఎడిషన్‌లో ప్రచురించినందుకు ఇన్‌చార్జిగా ఉన్న ధనంజయరెడ్డిపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయించి నోటీస్‌లు ఇవ్వడాన్ని పలు జర్నలిస్టుల సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్ట్‌లు, సంపాదకులు తీవ్రంగా ఖండించారు.
పత్రికలో ఏదైనా వార్త వస్తే దానిపై అభ్యంతరాలుంటే వివరణ కోరడం లేదా రిజాయిండార్ ఇవ్వడం ఆనవాయితీ కాగా ఏకంగా అక్రమ కేసులు మోపి ‘సాక్షి’ జర్నలిస్టులను కోర్టుకు ఈడ్వటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జర్నలిస్ట్‌సంఘాల నేతలు, సీనియర్ పాత్రికేయుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
ఖండన ఇవ్వకుండా సంపాదకుడిపై కేసులా?
దినపత్రికలు ప్రచురించే వార్తల్లో పొరపాట్లు ఉంటే సంబంధిత వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వాస్తవాలు తెలియచేస్తూ వివరణ ఇవ్వడం, వక్రీకరణలు ఉంటే ఖండించడం ఒక పద్ధతి. ఉద్దేశపూర్వకంగా అసత్యాలు రాసి వాటి మీద సవరణలు తెలిపినా ప్రచురించని మీడియా సంస్థల మీద చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమిషనర్‌కు దఖలు పరుస్తూ చాలా ఏళ్ల క్రితం ఒక జీవో వెలువడింది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ జీవోను సవరించి సమాచార శాఖ కమిషనర్‌కు ఉన్న అధికారాలను ఆయా శాఖల కార్యదర్శులకు బదిలీ చేశారు. దీనిపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ, దాని వందిమాగధ మీడియా చేయని రభస లేదు.
ఇప్పుడు అదే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ పత్రికా గోష్టిలో కొండవీటి వాగు మళ్లింపు వల్ల పంట పొలాలు మునిగి రైతులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్న విషయాన్ని ‘సాక్షి’ రిపోర్ట్ చేసినందుకు నేరుగా సంపాదకుడి మీద కేసు పెట్టి పోలీసులను పంపే దాకా వచ్చింది ప్రభుత్వం. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. – దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ స్టీరింగ్ కమిటీ మెంబర్
రాజ్యాంగ హక్కుల హననం..
‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ఒక వార్త విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏకంగా ఎడిటర్‌పై పోలీసు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతి కోసం పొన్నూరు అనే ప్రాంతాన్ని ముంచేశారు అంటూ వైఎస్సార్ సీపీకి చెందిన ఒక నాయకుడు చేసిన ఆరోపణను ఆయన వ్యాఖ్యల రూపంలోనే ‘సాక్షి’లో ప్రచురించారు. దానిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అదే పత్రికాముఖంగా ఖండించాలేగానీ ఈ విధంగా పోలీస్ కేసులు పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా మీడియా స్వేచ్ఛను హరిస్తూ పోలీస్ కేసులు పెడితే జర్నలిస్ట్ సంఘాలుగా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై నమోదు చేసిన పోలీస్ కేసును వెంటనే ఉపసంహరించుకునేలా అక్కడి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – అల్లం నారాయణ, ఆస్కాని మారుతి సాగర్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం
ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక మీడియాపై దాడి..
ఏపీలో పరిస్థితి చూస్తుంటే... పోలీస్‌రాజ్యం మినహా ప్రజారాజ్యం నడుస్తున్నట్లు కనిపించడంలేదు. ఎల్లో మీడియా తమ అవసరం కోసం ప్రభుత్వంలో లోపాలు ఎత్తిచూపుతూ వార్తలు రాస్తే కేవలం రిజాయిండర్ లేదా వివరణ మాత్రమే అడుగుతున్నారు. చంద్రబాబు పర్యవేక్షణలోని ‘సూర్యఘర్’పై వారు వార్తలు రాస్తే ఖండన మాత్రమే ఇచ్చారు. అదే ‘సాక్షి’ పత్రిక అమరావతికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తను మాత్రమే రాస్తే ఎడిటర్‌కు నోటీస్‌లు ఇవ్వటాన్ని చూస్తుంటే.. పత్రికాస్వేచ్ఛను హరించాలనే తాపత్రయమే కనిపిస్తోంది.
సోషల్ మీడియాను సైతం నియంత్రంచడానికి నేపాల్‌లో ఏం జరిగిందంటూ మాట్లాడడం సరికాదు. సాక్షిలో ప్రచురితమైన వార్తకు ఖండన ఇవ్వకుండా, వివరణ కోరకుండా నేరుగా కేసులు పెట్టడాన్ని చూస్తుంటే జర్నలిజం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు విపక్షంలో ఉండగా సీఎంతో సహా ఎవరి మీద పడితే వారి మీద నానా విమర్శలు చేశారు. ఇప్పుడు తనపై వాస్తవాలు రాస్తున్నా భరించలేకపోవడం ప్రజాస్వామ్య హననమే.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్