అన్నమయ్య జిల్లా: ఇద్దరి మనసులు కలిశాయి, పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. కాబోయే పెళ్లి కొడుక్కి.. అప్పటికి ఉద్యోగం రాలేదు. పెళ్లికూతురు ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తోంది. తర్వాత ఇద్దరూ డీఎస్సీకి ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తే.. కాబోయే పెళ్లి కొడుక్కి ఉద్యోగం వచ్చింది. దీంతో ఈ పెళ్లి వద్దంటూ వరుడి కుటుంబీకులు నిరాకరించారు. ఈ క్రమంలో ఆదివారం పురుగుల నివారణ మందు తాగి కాబోయే పెళ్లి కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకుల కథనం మేరకు వివరాలి ఉన్నాయి.
మదనపల్లె రూరల్ మండలం చీకలబయలు గ్రామానికి చెందిన యువతి (24)కి కలికిరి మండలం అమరనాథ్‌రెడ్డి కాలనీకి చెందిన ప్రకాష్‌తో పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 30న నిశ్చితార్థం జరిగింది. ఇది జరిగిన రెండు నెలల తర్వాత వివాహం జరిపేందుకు నిర్ణయించారు. ఈ మధ్యలో ప్రకాష్ డీఎస్సీ పరీక్ష రాశాడు. మొదటి రెండు కౌన్సెలింగ్‌లలో ఉద్యోగం రాలేదు. మూడో విడత కౌన్సెలింగ్ లో టీచరు ఉద్యోగం వచ్చింది. అప్పట్నుంచి కాబోయే పెళ్లి కొడుకు తరఫు కుటుంబీకుల నిజ స్వరూపం బయటపడింది. నిశ్చితార్థం జరిగి రెండు నెలలు కావడంతో.. పెళ్లి ఎప్పుడు పెట్టుకుందామని యువతి కుటుంబీకులు అడుగుతూ వచ్చారు. ఈ విషయాన్ని పెళ్లికొడుకు కుటుంబీకులు దాట వేస్తూ వచ్చారు.
కొన్ని రోజులుగా పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ వేధించడం మొదలుపెట్టారు. ఫోన్లో తిట్టడం, దుర్భాషలాడినా.. పెళ్లిని దృష్టిలో ఉంచుకొని యువతి కుటుంబీకులు భరిస్తూ వచ్చారు. అయితే ఆదివారం ఇది శ్రుతి మించిపోయింది. కాబోయే పెళ్లికొడుకు కుటుంబీకులు ఫోన్లో తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. దీంతో మనస్తాపానికి గురి కావడం, పెళ్లికి నిరాకరించడంపై ఆవేదనకు గురైన యువతి మధ్యాహ్నం ఇంటిలోనే పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుర్తించిన కుటుంబీకులు చికిత్స కోసం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తమ బిడ్డ ఆత్మహత్యకు ప్రయత్నించడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఎన్నో ఆశలతో నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు పెళ్లి జరగదని తెలిసి, తమ బిడ్డ చనిపోయేందుకు ప్రయతి్నంచిందంటూ తల్లి బోరున విలపిస్తోంది. కాబోయే పెళ్లి కొడుకు కుటుంబీకులు ఫోన్లో తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారంటూ యువతి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


