వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్‌ వన్‌

Andhra Pradesh Number one service in the country With Rythu Bharosa Centres - Sakshi

ఆర్‌బీకేలు, ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ సేవలు అద్భుతం

ఆర్‌బీకే చానల్‌ నిర్వహణ చాలా బాగుంది

ఎంఎస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధుల ప్రశంస

సాక్షి, అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తున్న సేవలు దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నాయని ఎంఎస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఆర్‌బీకేలు, సమీకృత వ్యవసాయ రైతు సమాచార కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌) ద్వారా అందిస్తున్న సేవలు, ఆర్‌బీకే చానల్‌ నిర్వహణ తీరు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ రామస్వామి రాజ్‌కుమార్, డాక్టర్‌ గోపీనాథ్‌ గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌తో పాటు కృష్ణా జిల్లాలోని కేసరపల్లి రైతు భరోసా కేంద్రాన్ని శనివారం సందర్శించారు. వాటి పనితీరును పరిశీలించి అక్కడి రైతులతో మమేకమయ్యారు.

రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలను ఆత్మ డైరెక్టర్‌ ప్రమీల వివరించారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. తమిళనాడులో తమ ఫౌండేషన్‌ నడుపుతున్న కాల్‌ సెంటర్‌ కంటే ఇక్కడి కాల్‌ సెంటర్‌ చాలా బాగుందన్నారు. కాల్‌ సెంటర్‌లో ఏకంగా 80 మంది ఉన్నత విద్యావంతులు పని చేస్తున్నారని, 8 మంది శాస్త్రవేత్తల బృందం సైతం ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. రోజుకు 700 నుంచి 800 కాల్స్‌ వస్తుండటం కాల్‌ సెంటర్‌ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. 
(చదవండి: ‘శ్రీశైలం’లో ఆగని తెలంగాణ ‘దోపిడీ’ )

ఆర్‌బీకేల ద్వారా అన్నీ అందించడం గొప్ప విషయం
ఆర్‌బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను గ్రామస్థాయిలోనే రైతులకు అందించడం గొప్ప విషయమని ఫౌండేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్‌బీకేలో కియోస్క్, డిజిటల్‌ లైబ్రరీ చాలా బాగున్నాయని కితాబిచ్చారు. నాలెడ్జ్‌ హబ్‌లుగా ఆర్‌బీకేలను తీర్చిదిద్దిన తీరుపై సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌బీకే చానల్‌ నిర్వహణ తీరు చాలా బాగుందని, ఓ వైపు కమిషనర్‌ నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు, మరోవైపు ఆదర్శ రైతుల నుంచి సామాన్య రైతుల వరకు ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ రైతులకు ప్రయోజనకరమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తుండటం అభినందనీయమన్నారు.

ఎంఎస్‌ స్వామినాథన్‌ ఆశించినట్టుగా ఏపీ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికే ఆదర్శమని, ఇక్కడ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, అందుబాటులోకి తీసుకొచ్చిన సేవలను తమ ఫౌండేషన్‌ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ జరుగుతున్నాయని పేర్కొన్నారు.  
(చదవండి: కారణం లేకుండా ‘కోత’ వద్దు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top